Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల వన్డేల్లో అద్భుత విజయం
- 571 పరుగుల తేడాతో గెలుపు
- ఆస్ట్రేలియా స్థానిక టోర్నీలో సంచలనం..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్థానిక టోర్నీలో మహిళలు సంచలనం సృష్టించారు. 50 ఓవర్ల మహిళల క్రికెట్లో ఓ జట్టు ఏకంగా 571 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌వైడ్ మహిళల ఫస్ట్‌గ్రేడ్ మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్స్, పోర్ట్ అడిలైడ్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నార్తర్న్ డిస్ట్రిక్స్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 586 పరుగులు భారీ స్కోరు చేసింది. నలుగురు మహిళాక్రికెటర్లు శతకాలతో చెలరేగిపోయారు. టెగాన్ మెక్ఫార్లిన్ (80 బంతుల్లో 136), టాబీ సవిలీ (56 బంతుల్లో 120), శామ్ బెట్స్ (71 బంతుల్లో 124 నాటౌట్), డార్సీ బ్రౌన్ (84 బంతుల్లో 117 నాటౌట్) రెచ్చిపోయి ఆడారు. డార్సీ బ్రౌన్ వయసు కేవలం 15 ఏండ్లు. నార్తర్న్ డిస్ట్రిక్స్‌లో తొలి వికెట్ 249 పరుగుల వద్ద, తర్వాతి రెండు వికెట్లు 308 వద్ద పడ్డాయి.
కాగా నార్తర్న్ డిస్ట్రిక్స్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనకు దిగిన పోర్ట్ అడిలైడ్ ఒత్తిడికి గురైంది. కేవలం 10.5 ఓవర్లలో 25 పరుగులకే టపటప వికెట్లు పడిపోయాయి. అయితే వీరిలో కేవలం ఎనిమిది మందే బ్యాటింగ్ చేయడం గమనార్హం. ప్రతిభా కపూర్ 9 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకు ముందు నార్తర్న్ డిస్ట్రిక్స్తో జరిగిన మ్యాచ్‌లోనూ పోర్ట్ అడిలైడ్ 415 పరుగులివ్వడం విశేషం. ఈ నేపథ్యంలో తమ జట్టులో 'ఏ-గ్రేడ్' స్థాయిలో ఆడే క్రీడాకారులు లేకపోవడంతోనే భారీ తేడాతో ఓటమి పాలవుతున్నామని డైరెక్టర్ డీన్ సేయర్స్ చెప్పారు. ఇప్పటికే అంతర్జాతీయ మహిళా క్రికెట్ టోర్నీల్లో తమ సత్తా చాటుతూ..భారీ స్కోర్లను నిలబెడుతున్న విషయం విదితమే.