Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెరెనా చేతిలో తప్పని ఓటమి
- క్వార్టర్స్‌లో జకోవిచ్, నిషికొరి
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019
అగ్ర క్రీడాకారిణిపై అమ్మ గెలిచింది. టాప్ సీడ్ సిమోన హలెప్‌కు ప్రీ క్వార్టర్స్‌లోనే బ్రేక్ పడింది. అక్కపై నెగ్గిన హలెప్, చెల్లి చేతిలో ఓటమిపాలైంది. మూడు సెట్ల పోరాటంలో సెరెనా విలియమ్స్ పైచేయి సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నొవాక్ జకోవిచ్, నిషికోరి, ఒసాకలు సైతం క్వార్టర్స్‌కు చేరుకున్నారు.
మెల్బోర్న్
మహిళల సింగిల్స్‌లో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న మ్యాచ్‌లో అమ్మనే విజయం సాధించింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తొలి గ్రాండ్‌స్లామ్, రికార్డు 24వ టైటిల్ వేటలో నిలిచిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాప్ సీడ్ సిమోన హలెప్ (రోమానియా)పై మూడు సెట్ల పోరులో గెలిచి, టైటిల్‌కు మరింత చేరువైంది. 6-1, 4-6, 6-4తో అక్క వీనస్‌ను ఓడించిన హలెప్‌పై ప్రతీకారం తీర్చుకున్నది!. జపాన్ స్టార్స్ నవొమి ఒసాక, కిరు నిషికోరిలు సైతం క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. మెన్స్ సింగిల్స్‌లో సెర్బియా హీరో నొవాక్ జకోవిచ్ 2016 తర్వాత తొలిసారి మెల్బోర్న్లో క్వార్టర్ఫైనల్స్కు చేరాడు.
సెరెనా దూకుడు : విజేతను నిర్ణయించే మ్యాచ్‌ను పరిగణించిన సిమోన హలెప్, సెరెనా విలియమ్స్ పోరులో వెటరన్ స్టార్‌నే విజయం వరించింది. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సెరెనా 2-1తో నెగ్గింది. 107 నిమిషాల ప్రీ క్వార్టర్స్ సమరంలో సెరెనా విలియమ్స్ 44 విన్నర్లు సాధించింది. కానీ హలెప్ కేవలం 24 విన్నర్లకే పరిమితమైంది. హలెప్‌ను సర్వ్‌ను బ్రేక్ చేసిన సెరెనా తొలి సెట్‌ను 6-1తో గెల్చుకున్నది. కానీ రెండో సెట్లో పుంజుకున్న హలెప్ 4-6తో గెలుపొంది, నిర్ణయాత్మక మూడో సెట్‌కు మ్యాచ్‌ను తీసుకెళ్లింది. మూడో సెట్లో హలెప్ 4-5తో రేసులో నిలిచినా, సర్వ్ కోల్పోయి క్వార్టర్స్ బెర్త్‌ను సైతం వదులుకోక తప్పలేదు. ఓవరాల్‌గా సెరెనా 86 పాయింట్లు గెల్చుకోగా, హలెప్ 77 పాయింట్లకే పరిమితమైంది. సెమీస్ బెర్త్ కోసం సెరెనా కరొలినా ఫ్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో సెరెనా ఢకొీట్టనున్నది. నిరుడు ఇక్కడ ఫ్లిస్కోవాపై గెలుపుతోనే సెమీస్‌కు చేరుకున్న సెరెనా, ఈ ఏడాది అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తున్నది. మరో మ్యాచ్‌లో జపాన్ చిన్నది నవొమి ఒసాక చెలరేగింది. లాతివా ప్లేయర్ అనస్తాసియా సెవస్తోవాపై 4-6, 6-3, 6-4తో విజయం సాధించింది. ఏడు ఏస్‌లు సంధించిన ఒసాక తొలి సెట్‌ను కోల్పోయినా ఒత్తిడికి లోనవ్వలేదు. వరుసగా చివరి రెండు సెట్లలో పైచేయి సాధించి క్వార్టర్ఫైనల్లోకి చేరింది. గార్బినె ముగురుజా (స్పెయిన్) పోరాటానికి ప్రీ క్వార్టర్స్‌లోనే తెరపడింది. 6-1, 6-1తో ముగురుజాను ఓడించిన కరొలినా ఫ్లిస్కోవా క్వార్టర్స్ బెర్త్‌ను కైవసం చేసుకున్నది. అమెరికా యువ క్రీడాకారిణి క్వార్టర్స్‌కు చేరకుండానే ఇంటి బాట పట్టింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినా స్విట్లోనా 6-2, 1-6, 6-1తో మడిసన్ను మట్టికరిపించింది. తొలి సెట్లో ఓడినా, రెండో సెట్లో పుంజుకున్న మడిసన్ నిర్ణయాత్మక సెట్లో తేలిపోయింది.
2016 తర్వాత తొలిసారి.. : పురుషుల సింగిల్స్‌లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 2016 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వదెవ్‌తో నాలుగు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందిన జకోవిచ్, ఫామ్ కొనసాగిస్తున్నాడు. 6-4, 6-7(5-7), 6-2, 6-3తో జకోవిచ్ సత్తా చాటాడు. మెద్వదెవ్ 18 ఏస్‌లతో మెరిసినా జకోవిచ్‌ను జోరును నిలువరించలేదు. జకోవిచ్ కోల్పోయినది ఒక్క సెటే అయినా, మెద్వదెవ్‌ను ఓడించేందుకు టాప్ సీడ్‌కు మూడున్నర గంటల సమయం పట్టింది. కీలక పాయింట్లను సొమ్ముచేసుకోవటంలో విఫలమైన 22 ఏండ్ల మెద్వదెవ్, కోర్టులోనే అసహనానికి లోనయ్యాడు. జపాస్ స్టార్ కిరు నిషికొరి మరోసారి క్వార్టర్ఫైనల్లో కాలుమోపాడు. 6-7(8-10), 4-6, 7-6(7-4), 6-4, 7-6(10-8)తో ఐదు సెట్ల మారథాన్ మ్యాచ్‌లో పాబ్లో కారెనో బస్టా (స్పెయిన్)పై నిషికోరి పైచేయి సాధించాడు. 15 ఏస్‌లు సహా రెండు టైబ్రేకర్లలో ఆధిక్యం సాధించిన నిషికొరి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. జర్మనీ యువ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ పోరాటానికి తెరపడింది. క్రోయేషియా ఆటగాడు మిలోస్ రావోనిక్ చేతిలో జ్వెరెవ్ వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. 6-1, 6-1, 7-6(7-5)తో రావోనిక్ గెలుపొందాడు. భవిష్య టెన్నిస్ స్టార్‌గా కితాబు అందుకున్న జ్వెరెవ్ 15 అనవసర తప్పిదాలకు పాల్పాడ్డాడు. దీంతో కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ కోసం మరింత కాలం వేచి చూడక తప్పలేదు. మరో మ్యాచ్‌లో లుకాస్ పౌలీ (ఫ్రాన్స్) 6-7(4-7), 6-4, 7-5, 7-6(7-2)తో బొర్నా కోరిక్ (క్రోయేషియా)పై విజయం సాధించాడు.