Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : అంతర్జాతీయ అథ్లెటిక్ అసోసియేషన్స్ సంఘం (ఐఏఏఎఫ్)పై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా మండిపడింది. మహిళా అథ్లెట్లపై అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మానవ హక్కుల సంఘం తొలిసారి క్రీడా సంఘంపై తీర్మానం ఆమోదించింది. హార్మోన్ల సమతుల్యత పేరుతో మహిళా అథ్లెట్లపై బలవంతపు వైద్య పద్దతులు ప్రయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా అథ్లెట్ (రన్నర్) కాస్టర్ సెమిన్యాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితి దేశాలు మద్దతుగా నిలిచాయి. ' హానికరమైన, అవమానకరమైన వైద్య పద్దతులను అమ్మాయిలు, మహిళా అథ్లెట్లపై బలవంతంగా రుద్దటాన్ని ప్రభుత్వాలు నియంత్రాలి' అని క్రీడా సంఘానికి వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘం తీర్మానం ఆమోదించింది. మహిళా అథ్లెట్లలో పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉందనే కారణంతో ఎంతో మంది మహిళా అథ్లెట్లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళల్లో టెస్టోస్టిరాన్ స్థాయి ఎంత ఉండాలనే అంశంపై ఐఎఎఎఫ్ ప్రామాణికత తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఐఎఎఎఫ్ నిర్దేశించి స్థాయి కంటే ఎక్కువ టెస్టోస్టిరాన్ మోతాదు కల్గి ఉంటే, వైద్య పద్దతులతో నియంత్రణలోకి తీసుకురావాలి. ఎక్కువ ఎత్తు ఉన్నాడని బాస్కెట్బాల్ ఆడేందుకు నిరాకరించటం, టెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువుందని మహిళలను నియంత్రించటం ఒకటేనని చెప్పటమే యుఎన్ తీర్మానం ఉద్దేశం. సెమిన్యా ఓ మహిళా. ఏ ఆధునిక టెక్నాలజీ ఆధారంతో ఆమె మహిళా కాదని చెప్పలేరు. హర్మోన్ల అసమానతలతో మహిళలపై వివక్ష చూపుతున్నారని యుఎన్ మానవ హక్కుల హై కమిషనర్ మిచెలీ బాచ్లెట్ పేర్కొన్నారు. మహిళా సెమిన్యా గౌరవ ప్రదంగా జీవించటం, ఎంచుకున్న రంగంలో కొనసాగటం ఆమె హక్కు అని తీర్మానంలో పేర్కొన్నారు.