Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ ఆరంభ పోరులో ఢీ
- ఫేవరేట్ సూపర్ కింగ్స్
నవతెలంగాణ-చెన్నై : ధోని వర్సెస్ కోహ్లి... చెన్నై వర్సెస్ బెంగళూర్!. కాగితంపై ఈ పేర్లు, వీరి ముఖాముఖి పోరు అభిమానుల్లో ఆసక్తి రేపటంలో ఆశ్చర్యం లేదు. కానీ గణాంకాలే ఈ రెండు జట్ల రసవత్తర సమరం అంటే అంగీకరించటం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో మూడు విజేత. మరో నాలుగు సార్లు రన్నరప్. కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మూడు సార్లు రన్నరప్. తొలి టైటిల్ కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉంది. అన్నింటికి మించి 2014 నుంచి చెన్నైపై బెంగళూర్‌కు విజయమే లేదు. మధ్యలో సూపర్ కింగ్స్ రెండేండ్ల నిషేధం తీసేసినా, విపరీత పోటీ నెలకొనే ఐపీఎల్లో బెంగళూర్‌కు ఇది చెత్త రికార్డే. డిఫెండింగ్ చాంపియన్‌గా సొంతగడ్డపై టైటిల్ వేటను ఆరంభించబోతున్న సూపర్ కింగ్స్ నేటి మ్యాచ్‌లో తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
నాయకులే హీరోలు : చెన్నై, బెంగళూర్ ముఖాముఖిలో మరో ప్రత్యేకత కనిపిస్తుంది. చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లి. అతడు సూపర్ కింగ్స్‌పై 732 పరుగులు చేశాడు. ఇదే విధంగా, బెంగళూర్ అత్యధిక పరుగులు బాదిన వారిలో చెన్నై నాయకుడు ముందున్నాడు. మహేంద్రసింగ్ ధోని బెంగళూర్‌పై 710 పరుగులు సాధించాడు. నేటి మ్యాచ్‌లోనూ ఇరు జట్ల తరఫున ఎవరు విజృంభించనున్నారో ఈ గణాంకాలే చెప్పాయని అనుకోవచ్చు.
షేన్ వాట్సన్, డుప్లెసిస్, డ్వేన్ బ్రావో, డెవిడ్ విల్లేలతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతున్నది. ఐపీఎల్ హీరో సురేశ్ రైనా, గత సీజన్ మెరుపు అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు సీఎస్కేకు కీలకం కానున్నారు. దీపక్ చాహర్, మోహిత్ శర్మలు బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయనున్నారు. మరోవైపు విదేశీ కోటాలో బెంగళూర్ తరఫున ఏబీ డివిలియర్స్, మోయిన్ అలీ, షిమ్రోన్ హెట్మయర్, టిమ్ సౌథిలు మాత్రమే బరిలోకి దిగనున్నారు. పార్దీవ్ పటేల్, శివం దుబె, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్‌లు కోహ్లి జట్టులో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.