Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్నర్, బెయిర్‌స్టో ధనాధన్
- కోల్‌కతపై సన్‌రైజర్స్ గెలుపు
- నైట్‌రైడర్స్‌కు వరుస ఐదో ఓటమి
నవతెలంగాణ-హైదరాబాద్
ఓపెనర్లే ఆడేశారు. 159 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. డెవిడ్ వార్నర్ (67), జానీ బెయిర్‌స్టో (80 నాటౌట్) సూపర్ ప్రదర్శనతో సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరో విజయం సాధించింది. వార్నర్, బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి హైదరాబాద్‌కు 9 వికెట్ల తిరుగులేని విజయాన్ని అందించారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి.
డెవిడ్ వార్నర్ (67, 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (80 నాటౌట్, 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. సన్‌రైజర్స్ ఓపెనర్లు మరోసారి సెంచరీ భాగస్వామ్యంతో కదం తొక్కగా కోల్‌కత నైట్‌రైడర్స్‌కు దారుణ ఓటమి తప్పలేదు. 159 పరుగుల ఛేదనలో ఓపెనర్ల విధ్వంసానికి హైదరాబాద్ 15 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. ఓపెనర్ క్రిస్ లిన్ (51, 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించగా తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 159/8 పరుగులు చేసింది. ప్రమాదకర ఆల్‌రౌండర్ రసెల్ (15)ను సన్ సీమర్ భువి కట్టడి చేశాడు. రింకూ సింగ్ (30), నరైన్ (25) రాణించారు. హ్యాట్రిక్ ఓటముల తర్వాత హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. హ్యాట్రిక్ విజయాల తర్వాత కోల్‌కతకు ఇది వరుసగా ఐదో ఓటమి. మూడు వికెట్లు కూల్చి కోల్‌కత బ్యాటింగ్ ఆర్డర్‌ను కట్టడి చేసిన సీమర్ ఖలీల్ అహ్మద్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఛేదనలో ధనాధన్ : 159 పరుగుల ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వార్నర్, బెయిర్‌స్టో విధ్వంసం చూస్తే లక్ష్యం 10 ఓవర్లలోనే ఛేదించేలా కనిపించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మొదలైన పరుగుల ప్రవాహం.. గెలుపు గీత దాటే వరకూ ఆగలేదు!. పృథ్వీ రాజ్ వేసిన రెండో ఓవర్లో వార్నర్ లాంగ్ ఆన్ స్టాండ్స్‌లోకి సిక్సర్ కొట్టగా.. బెయిర్‌స్టో రెండు ఫోర్లు బాదాడు. చావ్లాపై వరుసగా బెయిర్‌స్టో వరుసగా 4, 6 సిక్సర్ సంధించగా.. నరైన్‌పై వార్నర్ దండెత్తాడు. కొత్త బౌలర్ కరియప్పకు వార్నర్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 28 బంతుల్లోనే వార్నర్ మరో అర్ధ సెంచరీ సాధించాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో బెయిర్‌స్టో సైతం 28 బంతుల్లోనే ఐపీఎల్లో రెండో అర్ధ శతకం పూర్తి చేశాడు. నరైన్‌ను వరుసగా 4, 6 కొట్టిన ఊపులో ఉన్న వార్నర్‌ను పృథ్వీరాజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 131 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ విలియమ్సన్ (8 నాటౌట్) తోడుగా బెయిర్‌స్టో మరింత రెచ్చిపోయాడు. పియూశ్ చావ్లా వేసిన 15వ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టి హైదరాబాద్‌కు మరో 30 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.
ఖలీల్ తీన్మార్ : తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (25, 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్రిస్ లిన్ (51) తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో నరైన్ పించ్ హిట్టింగ్‌లో సక్సెస్ అయ్యాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. సన్‌రైజర్స్ లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ (3/33) నైట్‌రైడర్స్ దూకుడుకు కళ్లెం వేశాడు. వరుస ఓవర్లలో నరైన్, శుభ్‌మన్ గిల్ (3)లను వెనక్కి పంపాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6) రనౌట్ కాగా, నితీశ్ రానా (11)ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. రింకూ సింగ్ (30)తో కలిసి లిన్ అర్థ శతక భాగస్వామ్యం జోడించాడు. చివర్లో రసెల్ అండతో కోల్‌కత భారీ స్కోరుపై కన్నేసింది. అర్ధ సెంచరీ తర్వాత లిన్‌ను ఖలీల్ చేశాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్ అండ్రీ రసెల్ (15)ను భువి చక్కటి వ్యూహంతో సాగనంపాడు. రెండు సిక్సర్లతో ఊపందుకున్న రసెల్‌కు లెగ్‌సైడ్ యార్కర్లు సంధించిన భువి. ఫలితం రాబట్టాడు. కరియప్ప (9) ఓ సిక్సర్‌తో కోల్‌కతకు 150 ప్లస్ స్కోరు అందించాడు.
కోల్‌కత ఇన్నింగ్స్ : క్రిస్ లిన్ (సి)విలియమ్సన్ (బి) ఖలీల్ అహ్మద్ 51, సునీల్ నరైన్ (బి) ఖలీల్ అహ్మద్ 25, శుభ్‌మన్ గిల్ (సి) విజరు (బి) ఖలీల్ అహ్మద్ 3, నితీశ్ రానా (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్ 11, దినేశ్ కార్తీక్ (రనౌట్) 6, రింకూ సింగ్ (సి) రషీద్ ఖాన్ (బి) సందీప్ శర్మ 30, అండ్రీ రసెల్ (సి) రషీద్ ఖాన్ (బి) భువనేశ్వర్ 15, పియూశ్ చావ్లా (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ ఖాన్ 4, పృథ్వీరాజ్ నాటౌట్ 0, కరియప్ప నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159.
వికెట్ల పతనం : 1-42, 2-50, 3-65, 4-73, 5-124, 6-133, 7-146, 8-150.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-35-2, షాదాబ్ నదీమ్ 4-0-30-0, ఖలీల్ అహ్మద్ 4-0-33-3, సందీప్ శర్మ 4-0-37-1, రషీద్ ఖాన్ 4-0-23-1.
హైదరాబాద్ ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (బి) పృథ్వీ రాజ్ 67, జానీ బెయిర్‌స్టో నాటౌట్ 80, కానె విలియమ్సన్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం :(15 ఓవర్లలో వికెట్ నష్టానికి) 161.
వికెట్ల పతనం : 1-131.
బౌలింగ్ : హ్యారీ గుర్నె 2-0-16-0, పృథ్వీరాజ్ 3-0-29-1, పియూశ్ చావ్లా 3-0-38-0, సునీల్ నరైన్ 4-0-34-0, కరియప్ప 2-0-34-0, రసెల్ 1-0-8-0.