Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్సీ వ్యూహలపై కోహ్లి చిన్ననాటి కోచ్
న్యూఢిల్లీ : నరాలు తెగే ఉత్కంఠలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం, ఎనలేని ఒత్తిడి సమయాల్లోనూ కూల్‌గా పరుగులు కొట్టేయటం, మ్యాచ్ పరిస్థితులతో పాటే వ్యూహాలు మార్చేయటం... ఈ లక్షణాలున్న నాయకుడు ఎవరు అనగానే ఠక్కున సమాధానం వచ్చేస్తోంది. కెప్టెన్ కూల్ ఎం.ఎస్ ధోని అని వరల్డ్ క్రికెట్‌కు ఎప్పుడో తెలుసు. జాతీయ జట్టు నాయకత్వ పగ్గాలు తర్వాత తరానికి అప్పగించినా, ఐపీఎల్లో మహి మేనియా చూపిస్తున్నాడు. వయసు మళ్లిన ఆటగాళ్లతోనూ అద్భుతాలు చేస్తూ, ఔరా సారథీ అనిపిస్తున్నాడు. ఒత్తిడిని చిత్తు చేయటంలో, నాయకత్వ వ్యూహ పటిమలో ధోనీని ఢీ కొట్టేవారు వరల్డ్ క్రికెట్లోనే లేరని అనటం అతిశయోక్తి కాదు. ధోని నాయకత్వ వారసుడు విరాట్ కోహ్లిలో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించకపోవటం తరచుగా విమర్శలకు తావిస్తోంది. ఐపీఎల్లో లెక్కలేనన్ని ఓటములు ఎదురైనా, కెప్టెన్సీ నిలుపుకున్న సారథిగా కోహ్లిని ఇటీవల గంభీర్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ' మ్యాచ్‌ను చదవటం, వ్యూహాత్మక ఎత్తుగడలు వేయటంలో ధోనీని మించిన వారు లేరు. విరాట్ కోహ్లి అందుకు మినహాయింపు కాదు. అందుకే, ఏదైనా సలహా కోసం కోహ్లి ఎప్పుడూ ధోని వెంటపడతాడు. భారత జట్టులో ధోని భాగం కాకపోతే, విరాట్‌కు సహాయం చేసేవారే ఉండరు' అని కేశవ్ బెనర్జీ పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నం.4పై చర్చ జరుగుతున్న తరుణంలో కేశవ్ బెనర్జీ తన అభిప్రాయం పంచుకున్నాడు. ' ధోని నాలుగులో వస్తే కుదురుకునేందుకు అవసరమైన సమయం లభిస్తుంది. అదే నం.5, నం.6లో బ్యాటింగ్‌కు వస్తే తొలి బంతి నుంచీ ఎదురుదాడి చేయాలి. తప్పకుండా రిస్క్ తీసుకోవాలి. అందుకే వరల్డ్‌కప్‌లో ధోని నం.4లో బ్యాటింగ్ చేయాలి. ఆ స్థానంలో ఎవరు ఆడాలనేది మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయమే కానీ, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ధోని నాలుగులో ఆడితే మిగతా బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలరు' అని బెనర్జీ అన్నాడు.రిషబ్ పంత్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిస్తుండగా, కేశవ్ బెనర్జీ మరో అభిప్రాయంతో ఉన్నాడు. ' ప్రపంచకప్‌కు ఎంపిక చేయటం మరీ తొందరపాటు అవుతుంది. భారత్‌కు బలమైన బెంచ్ బలం ఉంది. ప్రపంచకప్ తర్వాత అతడికి అవకాశాలు ఇవ్వవచ్చని' అన్నాడు. ప్రపంచకప్ తర్వాత ఎం.ఎస్ ధోని రిటైర్మెంట్పై బెనర్జీ మహి శైలిలో బదులిచ్చాడు. ' మీరెవరైనా ధోని రిటైర్ కావాలని కోరుకుంటున్నారా? అతడి ఫిట్నెస్ స్థాయి చూడండి. అదే పెద్ద విషయం. అసలు ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో అతడి భార్య, తండ్రికి కూడా తెలియదు' అని చలోక్తి విసిరాడు.