Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1996 ప్రపంచకప్ విజేత. 2007, 2011లలో వరుసగా రెండు సార్లు ఫైనల్స్‌కు చేరుకున్న నిలకడ. ప్రతికూల పరిస్థితుల్లో ఒడ్డున పడేయగల సత్తా ఉన్న ఆటగాళ్ల అడ్డా. ఇదంతా గతం. శ్రీలంక ఇప్పుడు సాదాసీదా జట్టు!. అగ్రజట్లకు కనీస పోటీనిచ్చే స్థాయి ఆట కాదా జట్టుది. అయినా, దక్షిణాఫ్రికాలో సాధించిన చారిత్రక విజయం స్ఫూర్తితో ముందుకు సాగనుంది.
- వరల్డ్‌కప్‌లో శ్రీలంక అవకాశాలు స్వల్పం
- నాణ్యమైన ఆటగాళ్ల సేవలు కరవు
నవతెలంగాణ క్రీడా విభాగం
2015 ప్రపంచకప్ తర్వాత ఆడిన 20 సిరీస్‌ల్లో శ్రీలంక కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. దిగ్గజాలు మహేళ జయవర్దనె, కుమార సంగక్కర, ముత్తయ్య మురళీధరన్‌ల తర్వాత ఆ స్థాయి యువ ప్రతిభను వెలికి తీయటంలో శ్రీలంక విఫలమైంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ప్రదర్శన ఎలాగున్నా.. ప్రపంచకప్‌లో నిలకడగా రాణించే అలవాటు శ్రీలంకది. కానీ ఈ ప్రపంచకప్‌లో శ్రీలంకపై ఆ జట్టుకే అంచనాలు లేవు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలబడి ఇన్నింగ్స్ నిలబెట్టగల స్థాయి బ్యాట్స్‌మన్ కరువయ్యారు. జయవర్దనె, సంగక్కర వీడ్కోలు తర్వాత ఆ లోటు భర్తీ చేయలేదు. నాణ్యమైన స్పిన్నర్లను ఎంచుకోవటంలోనూ శ్రీలంక దారుణ వైఫ్యలం చెందింది. ప్రపంచకప్‌లో ఘనమైన రికార్డు కల్గిన శ్రీలంక.. బహుశా తొలిసారి టైటిల్‌పై ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది.
బలం : 1999 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంక.. ఆ తర్వాత ఎన్నడూ ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు ముందు ఇంటికెళ్లలేదు. ప్రతిసారీ కనీసం క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నది. 2007, 2011లలో వరుసగా రన్నరప్‌గా నిలిచింది. సీనియర్ ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్, సీనియర్ సీమర్ లసిత్ మలింగలు జట్టులో ఉండటం శ్రీలంక అతి పెద్ద బలం. సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, మలింగలతో కూడిన పేస్ విభాగం లంక ఆశలను సజీవంగా నిలుపుతోంది. దక్షిణాఫ్రికాపై టెస్టులో చివరి వికెట్ భాగస్వామ్యంతో అద్భుతం చేసిన కుశాల్ పెరీరా ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు.
బలహీనత : శ్రీలంకకు ప్రపంచకప్‌లో ఆ జట్టు కెప్టెన్ బలహీనత. 2015లో చివరగా వన్డే ఆడిన దిముత్ కరుణరత్నెను సెలక్టర్లు ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. టెస్టుల్లో కరుణరత్నె చరిత్ర సృష్టించినా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడు నాయకత్వ లక్షణాలు నిరూపించుకోలేదు. బ్యాట్స్‌మన్‌గా కరుణరత్నె సగటు 20లోపే. బలమైన స్పిన్ విభాగం కల్గిన శ్రీలంక... ఈసారి బలహీన స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఏడాదికి పైగా వన్డేల్లోనే ఆడని జెఫ్రీ వాండర్సె, మిలింద సిరివర్ధనెలను సెలక్టర్లు ఎంపిక చేశారు.
అవకాశం ఎంత? : 2015 ప్రపంచకప్ ముగిసిన తర్వాత అన్ని జట్లూ తర్వాతి వరల్డ్‌కప్ ప్రణాళికల్లో ఉండగా.. శ్రీలంకకు ఆ విజన్ కొరవడింది. సెలక్షన్ పాలసీలో తీవ్ర లోపాలు కనిపించాయి. దేశవాళీ సీజన్లో మెరిసిన వారికి నేరుగా ప్రపంచకప్ జట్టులో చోటు ఇచ్చారు. అంతర్జాతీయ సర్క్యూట్లో నిరూపించునే కసితో ఉన్న కుర్రాళ్లుకు వరల్డ్‌కప్ చక్కని వేదిక. లీగ్ దశ తర్వాత శ్రీలంక టాప్-4లో నిలిచే అవకాశం ఏ మాత్రం కనిపించటం లేదు. 1999 తర్వాత 2019లో శ్రీలంక మళ్లీ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే అవకాశం ఎక్కువ.
గత ప్రదర్శన : 1996 చాంపియన్. 2007, 2011 రన్నరప్ .
ప్రపంచకప్ జట్టు : దిముత్ కరుణరత్నె (కెప్టెన్), డి సిల్వ, ఫెర్నాండో, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్, లసిత్ మలింగ, ఎంజెలో మాథ్యూస్, జీవన్ మెండిస్, కుశాల్ మెండిస్ , కుశాల్ పెరీరా, సిరివర్దనె, తిరిమానె, ఉదాన, వాండర్సె.