Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరుమీదున్న ఇరు జట్లు
- సా. 6 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
ఓవల్ (లండన్)
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మ్యాచ్. సహజంగా ఈ మ్యాచ్‌లో విజేత ఎవరో చెప్పడానికి క్రికెట్ పండితుడు అక్కర్లేదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. క్రికెట్ పండితులు సైతం అంత సులువుగా విజేతను ఎంచుకునే వీలు లేదు!. నిలకడగా విజయాలు సాధిస్తున్న బంగ్లాదేశ్ ఇప్పుడు సెమీఫైనల్స్‌పై కన్నేసింది. ఆరంభ మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాపై 21 పరుగులతో గెలుపొందింది. ప్రపంచకప్‌లో అదిరే బోణీ సాధించింది. మరోవైపు శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్ 10 వికెట్ల విజయంతో దుమ్మురేపింది. ఆరంభ మ్యాచుల్లో విజయాలతో జోరు మీదున్న బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లు నేడు తమ రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ప్రపంచకప్‌లో ఇది రెండో డే నైట్ మ్యాచ్.
కివీస్ వ్యూహం ఏంటీ? : బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఆరంభ ఓవర్లలోనే బౌన్స్, పేస్ అస్త్రాన్ని సంధించింది. తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ సఫారీ పరీక్ష పాసయ్యారు. నేటి మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అదే వ్యూహంతో వస్తాడనే చెప్పవచ్చు. మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌తో కూడిన పేస్ ద్వయం బంగ్లా టాప్ ఆర్డర్‌ను ఇరుకున పడేయగలదని విలియమ్సన్ విశ్వసిస్తున్నాడు. స్పిన్నర్ శాంట్నర్‌కు తోడుగా సోధికి సైతం జట్టులోకి తీసుకుంటే.. మిడిల్ ఆర్డర్‌నూ కట్టడి చేయవచ్చని భావన. ఇదే సమయంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ భీకర ఫామ్‌లో ఉంది. రాస్ టేలర్, విలియమ్సన్, టామ్ లాథమ్‌లు తొలి మ్యాచ్‌లో బ్యాట్ పట్టలేదు. నేడు బంగ్లాపైనే విరుచుకుపడేందుకు ఎదురుచూస్తున్నారు. మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో ప్రపంచకప్‌లో సూపర్ హిట్ కొట్టారు!. ఆరంభంలో ఓపెనర్ల దూకుడు అడ్డుకోవటం బంగ్లా బౌలర్లకు కఠిన పరీక్ష.
జోరు సాగేనా? : దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకున్న బంగ్లాదేశ్, ఒకేసారి విజయ సంబురాలు చేసుకున్నది. విజయం ఊరిస్తోన్నా, ఒత్తిడిలో ఆటపై దృష్టి పెట్టిన బంగ్లా చిరస్మరణీయ విజయం సాధించింది. ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్ నేడూ కీలకం కానున్నారు. తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ ఆరంభ ఓవర్లలో నిలదొక్కుకుంటేనే.. బంగ్లా మెరుగైన స్కోరు సాధించేందుకు అవకాశం మెండు. మహ్మదుల్లా ఎంతటి ప్రభావం చూపగలడో సఫారీపై చూపించాడు. మిడిల్ ఆర్డర్లో మొహమ్మద్ మిథున్ సైతం రాణిస్తే బంగ్లాకు మరింత ఆనందం. సీమర్ సైఫుద్దీన్ తొలి మ్యాచ్‌లో తడబడ్డాడు. అతడి స్థానంలో రూబెల్ హుస్సేన్ జట్టులోకి వచ్చే వీలుంది. మెహిది హసన్, ముస్తాఫిజుర్, మొర్తజాలు బంతితో మరోసారి మెరవాల్సిన అవసరం ఉంది.
పిచ్ రిపోర్టు : కెన్నింగ్టన్ ఓవల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. మేఘావృతమైనా, ఎటువంటి వర్ష సూచన లేదు. బంగ్లా, కివీస్ మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను వాడుతున్నారు. ఇది సహజసిద్ద ఓవల్ పరుగుల పిచ్‌గా కనిపిస్తోంది. పిచ్‌పై పచ్చిక పూర్తిగా తొలగించారు. ఇరు వైపులా బ్యాట్స్‌మెన్ ఊపులో ఉన్నారు, పరుగుల వరద లాంఛనమే.
తుది జట్లు (అంచనా) :
బంగ్లాదేశ్ : తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రెహమాన్, మొహమ్మద్ మిథున్, మహ్మదుల్లా, మొసద్దిక్ హుస్సేన్, మెహిది హసన్, మష్రఫె మొర్తజా, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కానె విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమె, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.
2015 ప్రపంచకప్ తర్వాత బంగ్లా, కివీస్ 9 సార్లు తలపడగా న్యూజిలాండ్ 7 మ్యాచుల్లో గెలుపొందింది. తాజాగా 3-0తో వన్డే సిరీస్ స్వీప్ చేసింది. కానీ 2017 చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.