Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేవరెట్‌గా ఆస్ట్రేలియా
- ప్రమాదకరంగా వెస్టిండీస్
- మ 3 నుంచిస్టార్స్పోర్ట్స్లో
ట్రెంట్‌బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్)
ఆస్ట్రేలియా, వెస్టిండీస్ 2019 ప్రపంచకప్‌లో ఎదురులేని విజయాలతో బోణీ కొట్టాయి. చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్థాన్‌ను కరీబియన్లు సీమర్లు చిత్తు చేయగా.. పసికూన అఫ్గాన్‌కు కంగారూ పంచ్ మరీ ఎక్కువైపోయింది!. ఆరంభ మ్యాచుల్లో విజయాలు సాధించిన ఆసీస్, విండీస్ నేడు తమ రెండో మ్యాచ్‌లో తలపడతాయి. వార్మప్ మ్యాచ్‌లో సహా గత ఐదు మ్యాచుల్లోనూ విండీస్‌పై ఆసీస్‌కు మంచి రికార్డుంది. చివరగా 2016లో విండీస్‌తో వన్డే మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా ఆధిపత్యం నిరూపించుకుంది. ఇప్పుడు సీన్ మారింది. వెస్టిండీస్ టైటిల్ ఫేవరెట్లలో నన్నూ చేర్చాలనే స్థాయిలో రెచ్చిపోయింది. భీకర హిట్టర్ల అండతో అగ్రజట్లను అవలీలగా ఓడించగల ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా నేడు ఫేవరెట్ కాగా, వెస్టిండీస్ ప్రమాదకర జట్టుగా బరిలోకి దిగుతోంది.
రసెల్ రాణించాలి : సీమర్ల మెరుపులతో పాకిస్థాన్‌పై బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా పని పడలేదు. ఆసీస్ సీమర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌లు విండీస్ అనగానే రెచ్చిపోతారు. నేడు ఆ ఇద్దరిని కాచుకుని విండీస్ టాప్ ఆర్డర్ ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. క్రిస్ గేల్, హౌప్తో పాటు మిడిల్ ఆర్డర్లో పూరన్, హెట్‌మయర్‌లు కీలకం. బంతితోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగలనని నిరూపించిన రసెల్ ఆసీస్‌పై రాణించాలి. అతడు బ్యాట్‌తో, బంతితో మెరిస్తేనే విండీస్ విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ విషయం రెండు జట్లకూ తెలుసు. ఒసేన్ థామస్, కాట్రెల్, జేసన్లతో కూడిన పేస్ విభాగం ఆసక్తికరంగా ఉంది.
ఆసీస్‌కు ఎదురుందా? : డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ రాకతో ఆస్ట్రేలియా స్వరూపమే మారిపోయింది. కెప్టెన్ అరోన్ ఫించ్ సైతం ఫామ్‌లో ఉన్నాడు. చిన్నబౌండరీల ట్రెంట్‌బ్రిడ్జ్‌లో విండీస్‌పై స్పిన్ అస్త్రం ప్రయోగం ఆసీస్ వ్యూహం. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌పై స్పిన్ ప్రయోగం పని చేస్తుందని ఫించ్ నమ్ముతున్నాడు. ఆడమ్ జంపా, మాక్స్‌వెల్‌లు మిడిల్ ఓవర్లలో స్పిన్ బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుంది. పరుగుల పిచ్‌పై సీమర్లు స్టార్క్, కమిన్స్, కౌల్టర్‌నైల్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఆసక్తికరం.
పిచ్ రిపోర్టు : ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్ సహజంగా భారీ స్కోర్లకు పెట్టింది పేరు. ఇంగ్లాండ్, పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ 600పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తుంది. స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్‌కు అనుకూలం.
తుది జట్లు (అంచనా) : ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజ, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారే, పాట్ కమిన్స్, నాథన్ కౌల్టర్‌నైల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
వెస్టిండీస్ : క్రిస్ గేల్, షారు హౌప్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, షిమ్రోన్ హెట్మయర్, అండ్రీ రసెల్, జేసన్ హౌల్డర్, కార్లోస్ బ్రాత్‌వేట్, అష్లె నర్సె, షెల్డన్ కాట్రెల్, ఒసేన్ థామస్.