Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో స్పెయిన్ బుల్ నడాల్
- సెమీస్‌లో ఫెడరర్‌పై ఏకపక్ష విజయం
- మహిళల ఫైనల్లో మార్కెట, బార్టీ
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ :మట్టికోర్టు మొనగాడు రఫెల్ నడాల్ 12వసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చిరకాల గౌరవ ప్రత్యర్థి రోజర్ ఫెడరర్‌పై వరుస సెట్లలో గెలుపొందిన నడాల్ 12వ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. రెండున్నర గంటల సెమీఫైనల్లో 6-3, 6-4, 6-2తో ఫెడరర్‌ను నడాల్ చిత్తుగా ఓడించాడు. 33 విన్నర్లు సాధించిన నడాల్.. 25 అనవసర తప్పిదాలు చేసిన ఫెడరర్‌పై అలవోకగా గెలుపొందాడు. తొలి సెట్లో 3-0తో ముందంజ వేసిన నడాల్‌కు ఫెడరర్ పోటీనివ్వలేదు. 2-4తో రేసులోకి వచ్చినా నడాల్ లెక్క చేయలేదు. రెండో సెట్లో 3-2తో ఆధిక్యం సాధించిన ఫెడరర్, నిలుపుకోలేదు. దూసుకొచ్చిన నడాల్ 6-4తో రెండో సెట్‌నూ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో ఫెడరర్ నుంచి పోటీ ఎదురు కాలేదు. 6-2తో నడాల్ నల్లేరు మీద నడక మాదిరి ఫైనల్లోకి ప్రవేశించాడు. 2009 తర్వాత మట్టి కోర్టులో నడాల్‌పై నెగ్గని ఫెడరర్.. ఓవరాల్ 2-14తో వెనుకంజలో ఉన్నాడు. ఏకపక్ష సెమీఫైనల్లో నడాల్‌కు ఫైనల్స్ బెర్త్ కోల్పోయిన ఫెడరర్.. మ్యాచ్ అనంతరం నడాల్‌కు ఆత్మీయ అభినందనలు తెలిపాడు. మైదానం బయట నడాల్, ఫెడరర్‌కు మంచి మైత్రి బంధం ఉన్న సంగతి తెలిసిందే. మెన్స్ సింగిల్స్‌లో మరో సెమీఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. వరల్డ్ నం. నొవాక్ జకోవిచ్ 2-6, 6-3, 1-3తో డొమినిక్ థీమ్‌తో వెనుకంజలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ విజేతతో నడాల్ టైటిల్ పోరులో తలపడతాడు.
మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌కు రంగం సిద్ధమైంది. చెక్ రిపబ్లిక్ భామ మార్కెట వండ్రౌసోవ, ఆస్ట్రేలియా అమ్మాయి అష్లె బార్టీ తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీఫైనల్లో 6-7(4-7), 6-3, 6-3తో అమెరికా ప్లేయర్ ఆమంద అనిషిమోవపై బార్టీ మూడు సెట్లలో గెలుపొందింది. బ్రిటన్ భామ జొహన్న కొంటపై 7-5, 7-6(7-2) ఉత్కంఠ సెమీస్‌లో మార్కెట టైబ్రేకర్‌లో విజయం సాధించింది. నేడు జరిగే టైటిల్ పోరులో మార్కెట, బార్టీ చావోరేవో తేల్చుకోనున్నారు.