Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మట్టికోర్టు రాణి ఆసీస్ భామ
- ఫైనల్లో భంగపడ్డ మార్కెట
- సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ (ఫ్రాన్స్) : రొలాండ్ గారోస్‌కు కొత్త రాణి వచ్చేసింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ ఆష్లీ బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. అన్‌సీడెడ్ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మార్కెట వొంద్రుసొవపై వరుస సెట్లలో గెలుపొందిన బార్టీ కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 70 నిమిషాల ఫైనల్లో నియంత్రణ కలిగిన దూకుడు ప్రదర్శించిన బార్టీ.. విలక్షణ షాట్లతో అలరించింది. 6-1, 6-3తో గెలుపొంది మార్గరెట్ కోర్టు తర్వాత (1973) ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెల్చుకున్న తొలి ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. తొలి సెట్లో 4-0తో దూసుకెళ్లిన బార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. రెండో సెట్లో 2-3, 3-4తో రేసులోకి వచ్చిన వొంద్రుసొవకు బార్టీ చెక్ పెట్టింది. 5-3 నుంచి వరుసగా రెండు గేముల గెల్చుకుని చరిత్ర సృష్టించింది. 3 ఏస్‌లు సంధించిన బార్టీ.. 27 విన్నర్లు సాధించింది. 26 అనవసర తప్పిదాలకు పాల్పడినా బార్టీ మ్యాచ్ పట్టు కోల్పోలేదు. బార్టీ, మార్కెటలకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ కావటం విశేషం.
నం. షాక్ : పురుషుల సింగిల్స్‌లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నం.1, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. వర్షం అంతరాయంతో రెండు రోజుల్లో ముగిసిన సెమీస్‌లో జకోవిచ్‌కు భంగపాటు తప్పలేదు. ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ ఐదు సెట్ల పోరులో పైచేయి సాధించాడు. 6-2, 3-6, 7-5, 5-7, 7-5తో జకోవిచ్‌పై అదిరే విజయం సాధించాడు. నాలుగున్నర గంటల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జకోవిచ్ తడబడ్డాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో 5-5తో సమవుజ్జీలుగా నిలిచిన సమమయంలో 40-0తో గేమ్ గెల్చుకున్న థీమ్ మ్యాచ్ పాయింట్ ముంగిట నిలిచాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన గేమ్‌లో జకోవిచ్ గట్టిగా పోరాడాడు. 40-40తో ఇద్దరూ నాలుగు సార్లు డ్యూస్ వద్ద నిలిచారు. అనవసర తప్పిదంతో ఆధిక్యం కోల్పోయిన జకోవిచ్.. థీమ్ విన్నర్‌తో ఫైనల్స్ బెర్త్ చేజార్చుకున్నాడు. నాల్గో సీడ్ థీమ్‌కు ఇది వరుసగా రెండో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్. ' ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో ముగ్గురు ఆల్‌టైమ్ దిగ్గజాలు నిలిచారు. అందులో ఓ స్టార్‌పై విజయం సాధించటం ఎంతో ఆనందంగా ఉంది. నడాల్‌తో తుది పోరు అమోఘం. నడాల్ ఫేవరెట్ అని తెలుసు. నా వంతు ప్రయత్నం చేసేందుకు కోర్టులోకి దిగుతా' అని థీమ్ సెమీస్ విజయానంతరం అన్నాడు. 11 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నడాల్ రొలాండ్ గారోస్‌లో ఎన్నడూ ఫైనల్స్ ఓడలేదు.