Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డజను టైటిళ్లు కొల్లగొట్టిన స్పెయిన్ బుల్
- ఫైనల్లో థీమ్‌కు మరోసారి భంగపాటు
- గ్రాండ్‌స్లామ్‌లో నడాల్ నయా రికార్డు
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రఫెల్ నడాల్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓపెన్ శకం, ఆధునిక టెన్నిస్ ఏ కాలంలోనైనా ఓ గ్రాండ్‌స్లామ్‌ను 12 సార్లు నెగ్గిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రొలాండ్ గారోస్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన నడాల్ రికార్డు 12వ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2018 ఫైనల్స్ రీ మ్యాచ్‌లో డొమినిక్ థీమ్‌పై నాలుగు సెట్ల మ్యాచ్‌లో గెలుపొంది కెరీర్ 18వ గ్రాండ్‌స్లామ్ ముద్దాడాడు.
పారిస్ (ఫ్రాన్స్): వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి కెరీర్ ఫామ్ సాధించిన వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్‌ను సెమీఫైనల్లో ఓడించాడు. మట్టికోర్టులో వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు చేరుకున్నాడు. దిగ్గజ రోజర్ ఫెడరర్, నయా స్టార్స్ జకోవిచ్, ముర్రేలతో సాధ్యం కానిది ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ సాధించేలా కనిపించాడు. కానీ మట్టికోర్టు మహారాజు నేనేనని స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ మరోసారి నిరూపించాడు. ఫామ్, వయసుతో సంబంధం లేకుండా మట్టికోర్టులో బరిలో దిగితే, టైటిల్ పట్టేయాల్సిందేనని చాటాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నడాల్ 6-3, 5-7, 6-1, 6-1తో డొమినిక్ థీమ్‌పై విజయం సాధించాడు. రఫెల్ నడాల్‌తో మట్టికోర్టులో నాలుగు సార్లు తలపడిన థీమ్ తొలిసారి క్లే కింగ్‌పై ఓ సెట్లో గెలుపొందాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆస్ట్రియా ఆటగాడు ఆనందపడేందుకు అదొక్కటే కారణం!. 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018 సహా 2019లో రఫెల్ నడాల్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు.
ఎదురులేని ఆటగాడు : మూడు గంటల పాటు సాగిన టైటిల్ పోరులో డొమినిక్ థీమ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చాడు. తొలి మూడు సర్వ్‌లను నడాల్, థీమ్ నిలుపుకున్నారు. తొలి సెట్ 3-3తో ఆసక్తిగా మొదలైంది. ఆ తర్వాత రెండు సార్లు థీమ్ సర్వీస్ బ్రేక్ చేసిన నడాల్ వరుసగా మూడు గేములు గెల్చుకున్నాడు. 6-3తో తొలి సెట్‌ను అలవోకగా నెగ్గాడు. రెండో సెట్లో థీమ్ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ఇక్కడా ఇద్దరూ తమ సర్వ్‌లను నిలుపుకున్నారు. దీంతో 5-5తో ఆట రసవత్తరంగా సాగింది. 6-5తో ముందంజ వేసిన థీమ్.. ఈ సమయంలో నడాల్ సర్వ్‌ను బ్రేక్ చేశాడు. నడాల్ అనవసర తప్పిదంతో అడ్వాన్స్ అయిన థీమ్.. బ్రేక్ పాయింట్‌తో రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్నాడు. రెండు సెట్లు ముగిసే సరికి 1-1తో నడాల్‌తో థీమ్ సమవుజ్జీగా నిలిచాడు. ఇక్కడే థీమ్‌పై అంచనాలు, ఆశలు రెట్టింపయ్యాయి. గత ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచుల్లో దిగ్గజ నడాల్‌పై థీమ్ ఎన్నడూ ఓ సెట్ నెగ్గలేదు. గత ఏడాది ఫైనల్లో సైతం నడాల్ వరుస సెట్లలోనే విజయం సాధించాడు. రెండో సెట్ విజయం మ్యాచ్‌ను రసకందాయంలో పడేస్తుందని అంచనా వేసిన వారికి నడాల్ నిరాశే మిగిల్చాడు. చివరి రెండు సెట్లలో పంజా విసిరిన నడాల్ అలవోక విజయాలు అందుకున్నాడు. మూడో సెట్లో 4-0తో ఆధిక్యం సాధించిన నడాల్ 6-1తో ముందంజ వేశాడు. నాల్గో సెట్లో 3-0తో దూసుకెళ్లిన నడాల్ ప్రత్యర్థికి ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయాడు. 3-1 తర్వాత వరుసగా మూడు గేములు గెల్చుకున్న స్పెయిన్ బుల్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. థీమ్ ఏడు ఏస్‌లు సంధించినా ప్రయోజనం లేకపోయింది. 38 విన్నర్లు సాధించిన నడాల్.. ఓవరాల్‌గా 116-82తో థీమ్‌పై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాడు. 38 అనవసర తప్పిదాలు చేసిన థీమ్ పోటీనివ్వలేకపోయాడు. నాల్గో సెట్లో నడాల్ ఏకంగా వరుసగా 11 పాయింట్లు సాధించి ఔరా అనిపించాడు. ఓవరాల్‌గా నడాల్ 23 గేములు నెగ్గగా, థీమ్ 12 గేములకు పరిమితం అయ్యాడు.
మహిళల డబుల్స్‌లో టిమియ బాబోస్ (హంగరీ), క్రిస్టినా మ్లడనోవిక్ (ఫ్రాన్స్) 6-2, 6-3తో చైనా జంట డ్యూన్, జాంగ్లపై గెలుపొందారు. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతలుగా నిలిచారు.