Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓవల్ : ఏడాది నిషేధం తర్వాత నేరుగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్, ప్రమాదకర బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాడు. జశ్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బౌలర్ల యార్కర్లను ఏ విధంగా ఎదుర్కొవాలో తెలుసుకునేందుకు ఈ ప్రపంచకప్‌లో డెవిడ్ వార్నర్ బ్యాట్‌కు సెన్సార్ జోడించాడు. వార్నర్ బ్యాటింగ్ చేసినంత సమయం డేటా సేకరించే సెన్సార్.. మొబైల్ యాప్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం బుమ్రా యార్కర్‌ను ఆడేందుకు బ్యాట్ స్పీడ్ 70-75 కిమి వేగం సరిపోతుంది. కానీ వార్నర్ 85-90 కిమి వేగంతో బ్యాట్‌ను ఊపుతున్నాడు. బ్యాట్ లిఫ్ట్ షాట్ల విషయంలోనూ బుమ్రాపై 120-125 డిగ్రీల బ్యాట్ కోణం.. భువనేశ్వర్‌కు నేరుగా వికెట్ కీపర్ రేఖలో బ్యాట్ కోణం. స్పిన్నర్లపై బ్యాక్ లిఫ్ట్ షాట్ కోణం 160-175 డిగ్రీలుగా ఆడుతున్నాడు. గతంలో కోచ్‌లు తమ పరిజ్ఞానంతో బ్యాట్స్‌మెన్‌పై ఈ కిటుకులు అందించేవారు. కచ్చితమైన బంతులేసే బుమ్రా వంటి బౌలర్లపై అంతే కచ్చితమైన షాట్లు ఆడాలి. లేదంటే, వికెట్ కోల్పోవటం రెప్పపాటులో జరుగుతుంది. అందుకే, ఈ సాంకేతికతను వార్నర్ ఉపయోగిస్తున్నాడు. 'బ్యాట్ సెన్స్'గా పిలుస్తున్న సెన్సార్ చిప్‌ను వార్నర్‌కు అందిస్తున్నది బెంగళూర్‌లోని స్మార్ట్ క్రికెట్ సంస్థ. బ్యాట్‌కు హ్యాండిల్ పైభాగంలో ఈ చిప్‌ను అమర్చుతారు. 2017లోనే ఈ సెన్సార్ వాడేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. కానీ ఒకరిద్దరు మినహా ఈ సెన్సార్‌ను ఉపయోగించటం లేదు. భవిష్యత్‌లో బ్యాట్ సెన్స్‌ను బ్యాట్స్‌మెన్ విస్తృత స్థాయిలో వినియోగించే అవకాశం లేకపోలేదు.