Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లీష్ వేసవి అంచనా తలకిందులు
- మున్ముందూ వర్షం ముప్పు
నవతెలంగాణ క్రీడా విభాగం
'ఈ ఇంగ్లీష్ వేసవిలో మంచి ఎండ కాయనుంది. సూర్యుడి భగభగతో పిచ్‌లు మరింత ఫ్లాట్‌గా మారతాయి. భారీ స్కోర్లకు ఇది ఊతం. అంతిమంగా ఉపఖండపు జట్లకు అదనపు ప్రయోజనం'... 2019 ప్రపంచకప్ ఆరంభానికి ముందు క్రికెట్ దిగ్గజాల విశ్లేషణ సాగిందిలా. అందుకు తగినట్టే ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లీష్ వేసవి ఆరంభం నడుచుకుంది.
ప్రపంచకప్ ఆరంభమయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు రావాలని వరుణుడు అనుకున్నాడేమో.. టోర్నీని వీడి వెళ్లటం లేదు. భానుడి భగభగలతో ప్రపంచకప్ రసపట్టులో సాగుతుందని అనుకుంటే, వరుణుడి ఉరుములు, మెరుపులతో స్టేడియాలను చెరువులను తలపిస్తున్నాయి. 2019 ప్రపంచకప్ విఫల టోర్నీగా మిగిలిపోయే ప్రమాదంలో పడింది!.
ఫుట్‌బాల్, రగ్బీ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన ప్రపంచకప్‌గా మొదలైన 2019 క్రికెట్ వరల్డ్‌కప్.. చరిత్రలో ఓ విఫల టోర్నీగా మిగిలి పోనుందా? నిలకడగా నిరాశ మిగిల్చిన వరల్డ్‌కప్‌గా అభిమానుల మదిలో నిలిచిపోనుందా? రానున్న రోజుల్లో సైతం వరుణుడు ఇదే రీతిలో అడ్డంకి సృష్టిస్తే అదే నిజమవుతుంది. ఇప్పటికే నాలుగు మ్యాచులు వర్షార్పణం అయిపోయాయి. మరిన్ని మ్యాచులకు వర్షం ముప్పు పొంచి ఉంది. రిజర్వ్ డే లేకపోవటం, స్టేడియాల నిర్వహణ ప్రమాణిక స్థాయిలో ఉండకపోవటం, ఐసీసీ షెడ్యూల్ లోపాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారత్ మ్యాచుల టిక్కెట్ల అధిక ధరలను సొమ్ముచేసుకునే ఐసీసీకి కోహ్లిసేన మ్యాచ్ రద్దు కావటం ఆర్థికంగా తీరని నష్టం చేకూర్చింది. ప్రసారదారులు, స్పాన్సర్లు లాభాలను కోల్పోనున్నారు. ప్రతి జట్టు మరో జట్టుతో తలపడే ఆసక్తికర ఫార్మాట్‌ను ఆస్వాదించాలనే అభిమానులకు 2019 ప్రపంచకప్ నిరాశే మిగిల్చేలా కనిపిస్తోంది.
రిజర్వ్ డే ఎందుకు లేదు?
వర్షం కారణంగా రద్దయిన మ్యాచులను తర్వాతి రోజు నిర్వహించాలనే డిమాండ్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు కనీసం 1200 మంది పని చేస్తారు. హౌటల్ బుకింగ్స్, ప్రయాణ షెడ్యూల్, ప్రసార నిర్వహణ ప్రధానమైనవి. ప్రపంచకప్‌లో వరుసగా 45 రోజులు మ్యాచులు ఉన్నాయి. రిజర్వ్ డే ఉంటే, ఈ ఏర్పాట్ల కోసం ఓ బృందం మరో రోజు పని చేయాల్సి ఉంటుంది. అందుకు అదనంగా నిర్వహణ కమిటీ సిబ్బందిని నియమించుకోవాలి. లీగ్ దశలో రిజర్వ్ డే ఉండటం, టోర్నీని మరింత సుదీర్ఘం చేస్తుందని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు సైతం మరో రోజు వసతి చూసుకోవాలి. రిజర్వ్ డేకు మళ్లీ వర్షం అంతరాయం కలిగిస్తే, అప్పుడూ ఏం చేయలేం.
గతంలో రిజర్వ్ డే ఉందా?
ప్రపంచకప్ గతంలో రిజర్వ్ డేలు పొందుపరిచింది. 2007 వెస్టిండీస్‌లో, 1999 ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచులకు రిజర్వ్ డే ఉంచారు. 1999లో కేవలం రెండు మ్యాచుల్లోనే రిజర్వ్ డే ఉపయోగపడింది. అలాంటి ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై నెగ్గిన భారత్ ఆతిథ్య జట్టును టోర్నీ నుంచి సాగనంపింది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు క్రమంగా పెరగటం, మ్యాచుల సంఖ్య, టోర్నీ రోజుల్లో పెరుగదల రిజర్వ్ డేలను మింగేసింది.
తీవ్ర వర్ష ప్రభావిత ప్రపంచకప్ ఇదేనా?
అవుననే చెప్పాలి. ప్రపంచకప్ చరిత్రలోనేవర్షం కారణంగా పూర్తిగా రద్దు అయిన మ్యాచులు రెండే రెండు. కానీ 2019 ప్రపంచకప్‌లో వరుణుడి కారణంగా నాలుగు మ్యాచులు రద్దయ్యాయి. 1992, 2003 ప్రపంచకప్‌లలో రెండు మ్యాచులు వర్షార్పణం అయ్యాయి.
వర్షం ముప్పు ఇంకా ఉందా?
జూన్ మాసం ఇంగ్లాండ్ వేసవి సీజన్. ఈ సమయంలో ఇక్కడ వర్షాలు అత్యంత అరుదు. కానీ రానున్న రోజుల్లోనూ వరుణుడు వస్తాడనే వాతావరణ శాఖ చెబుతోంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్ మ్యాచ్ సైతం రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. వరద ప్రమాద హెచ్చరికలు సైతం కొన్ని ప్రాంతాల్లో జారీ చేశారు. గ్రూప్ దశ చివర్లో రద్దు మ్యాచులు లేకపోయినా.. డక్‌వర్త్ లూయిస్ తెరపైకి రావటం ఖాయం. బ్రిటన్ చరిత్రలో అత్యధిక వర్షం కురిసిన జూన్ మాసం ఇదే అవుతుందని ఇప్పుడు బెట్టింగ్ నడుస్తోంది.
టిక్కెట్ల డబ్బు ఇస్తారా?
ప్రపంచకప్ మ్యాచ్ రద్దు అయినా, కనీసం టిక్కెట్ల డబ్బు వెనక్కి రావటం ఒక్కటే అభిమాలనుకు ఊరట. మ్యాచ్‌లో 15 ఓవర్ల ఆట సాగినా పూర్తి టిక్కెట్టు సొమ్ము వెనక్కి ఇస్తారు. 15.1-29.5 ఓవర్ల ఆట జరిగితే 50 శాతం డబ్బులు ఇస్తారు. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, 28 రోజుల్లో సొమ్ము ఖాతాలో జమ చేస్తారు. బాక్సాఫీస్‌లో కొనుగోలు చేస్తే పోస్ట్ ద్వారా డబ్బులు తిరిగి చెల్లిస్తారు.
ఎవరికి లాభం
రద్దు మ్యాచులతో ఏ జట్టుకు ఉపయోగం లేదు. ఓ విధంగా అగ్రజట్లకు నష్టమనే చెప్పాలి. శ్రీలంక రెండు మ్యాచులు రద్దయ్యాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పాయింట్లు పంచుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన జట్లపై మొత్తంగా రెండు పాయింట్లు లంకకు లాభం చేకూర్చగా.. పాక్, బంగ్లాకు నష్టం. వరుస మూడు ఓటముల తర్వాత దక్షిణాఫ్రికా పాయింట్లు పంచుకోవటం ఆ జట్టుకు చేటే. సఫారీకి తర్వాతి ఐదు మ్యాచుల్లో తప్పన నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రజట్లు భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల టాప్-4 స్థానాలను సైతం ఇది ప్రభావితం చేయనుంది.
ప్రపంచకప్ నిబంధనలు
1. సూపర్ ఓవర్ : గ్రూప్ దశ మ్యాచులకు లేదు. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో మాత్రమే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
2. టై బ్రేకర్ : పాయింట్ల పరంగా రెండు జట్లు సమవుజ్జీలుగా నిలిస్తే ఎక్కువ విజయాలు సాధించిన జట్టు సాధిం చిన జట్టు ముందడుగు వేస్తుంది. తర్వాత నెట్ రన్‌రేట్, ముఖాముఖి పోరులో విజేత ద్వారా నిర్ణయిస్తారు. చివరకు టోర్నీకి ముందు మెరుగైన ర్యాంక్ ప్రకారం సెమీస్‌కు ఎంపిక చేస్తారు.
3. రిజర్వ్ డే : గ్రూప్ దశ మ్యాచులకు రిజర్వ్ డే లేదు. కేవలం సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచులకు రిజర్వ్ డే ఉంటుంది.
4. సెమీఫైనల్స్ రద్దు అయితే? : గ్రూప్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుతుంది.
5. ఫైనల్స్ వర్షార్పణమైతే? : ఫైనలిస్ట్‌లు ట్రోఫీని పంచుకుంటాయి.