Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకపై ఆసీస్ విజయం
- అరోన్ ఫించ్ భారీ శతకం
- కరుణరత్నె పోరాటం వృథా
లండన్ (ఓవల్) : డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో నాల్గో విజయం సాధించింది. శ్రీలంకపై ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో అలవోకగా గెలుపొందింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (153, 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకంతో చెలరేగాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73, 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 ఫోర్) అర్ధ సెంచరీతో రాణించాడు. మాక్స్వెల్ (46 నాటౌట్, 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ధనాధన్‌తో మెరువగా తొలుత ఆస్ట్రేలియా 334/7 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.
ఫించ్ శతకం : తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు. అరోన్ ఫించ్ (153) ధనాధన్‌తో చెలరేగాడు. డెవిడ్ వార్నర్ (26) నెమ్మదిగా ఆడినా, స్కోరు బోర్డు నెమ్మదించలేదు. 15 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడిన ఫించ్ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. వార్నర్, ఖవాజ (10) వెన్వెంటనే అవుటైనా.. స్టీవ్ స్మిత్ (73)తో కలిసి ఫించ్ జోరు కొనసాగించాడు. డెత్ ఓవర్లలో మాక్స్వెల్ (46) మెరుపులు కలిసొచ్చాయి. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు ఆసీస్ 334 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు ఇసుర ఉదన (2/57), డిసిల్వ (2/40) రాణించారు.
ఛేదనలో చతికిల : శ్రీలంక టాప్ గేర్‌తో ఛేదన మొదలెట్టింది. కెప్టెన్ కరుణరత్నె (97, 108 బంతుల్లో 9 ఫోర్లు), కుశాల్ పెరీరా (52, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ఓపెనర్ల మెరుపు అర్ధ సెంచరీలతో లంక లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 186/2తో మెరుగైన స్థితి నుంచి శ్రీలంక పేకమేడలా కూలింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యంలో ఆలౌటైంది. మాథ్యూస్ (9), సిరివర్దన (3), తిశార పెరీరా (7), తిరిమానె (16) విఫలమయ్యారు. కుశల్ మెండిస్ (30) ఫర్వాలేదనిపించాడు. మిచెల్ స్టార్క్ (4/55), మాక్స్వెల్ (3/47) శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు.