Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌తో ముఖాముఖి నేడు
- మ. 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్)
సెమీఫైనల్స్ ఫేవరెట్ ట్యాగ్‌తో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. ఓ మ్యాచ్ రద్దు, మరో మ్యాచ్‌లో గెలుపుతో కాస్త ఊరట పొందింది. టాప్-4లో నిలిచే అవకాశాలు సన్నగిల్లిన సమయంలో దక్షిణాఫ్రికా ప్రమాదకరంగా మారుతోంది. టాప్-4 రేసు ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశం ఉండగా.. న్యూజిలాండ్ నేడు సఫారీని ఎదుర్కొనుంది. 2015 సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు క్షోభ మిగిల్చిన న్యూజిలాండ్‌కు బర్మింగ్‌హామ్‌లో సఫారీ బదులుగా ఏం ఇస్తుందో చూడాలి.
అంత సులువు కాదు! : ప్రపంచకప్‌లో రెండు అజేయ జట్లలో న్యూజిలాండ్ ఒకటి. కానీ పరుగుల వేటలో, వికెట్ల వేటలో న్యూజిలాండ్ ఆటగాళ్ల పేర్లు కనిపించవు. అయినా, సమష్టిగా ఎంతో బలంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ను ఓడించటం అంత సులువు కాదు. స్టార్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ గొప్పగా రాణిస్తున్నా... వికెట్ల వేటలో వెనుకంజ వేస్తున్నాడు. నేడు సఫారీపై వికెట్ల జోరు సాగించాలని బౌల్ట్ భావిస్తున్నాడు. స్పిన్ అనుకూలిత పిచ్‌పై శాంట్నర్, సోధిలు కీలక భూమిక వహించనున్నారు. బ్యాటింగ్ లైనప్‌లో మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, కానె విలియమ్సన్ సహా టామ్ లాథమ్ ఫామ్‌లో ఉన్నారు. ఇమ్రాన్ తాహీర్ రూపంలో ప్రమాదం పొంచి ఉన్నా.. స్పిన్‌పై కివీస్‌కు మెరుగైన రికార్డుంది. సెమీస్ ఆశల్లేని సఫారీ చేతిలో భంగపడకుండా ఉండేందుకు, న్యూజిలాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సమష్టిగా మెరిస్తేనే : దక్షిణాఫ్రికా సీనియర్ సీమర్ డెల్ స్టెయిన్ లేని వేళ, సఫారీ పేస్ విభాగం అంచనాలను అందుకోలేకపోతుంది. కగిసో రబాడ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో పరుగుల నియంత్రణ కోల్పోతున్నాడు. ఇమ్రాన్ తాహీర్‌తో కలిసి రబాడ మెరిస్తే న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోరుకు కట్టడి చేయవచ్చు. స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా ప్రపంచకప్‌లో తనదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. కష్టకాలంలో సీనియర్ బ్యాట్స్‌మెన్ ముందుండి నడిస్తే, జట్టు పని తేలికవుతుంది. క్వింటన్ డికాక్, డుప్లెసిస్, వాన్‌డర్ డుసెన్‌లు నిలకడగా రాణిస్తున్నారు. కానీ జట్టు అవసరాలను అందుకోవటంలో విఫలమవుతున్నారు. లోయర్ ఆర్డర్లో డెవిడ్ మిల్లర్ ధనాధన్ పాత్రకు న్యాయం చేయాల్సిన అవసరం వచ్చింది. నాణ్యమైన ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికా వరుస విజయాలపై కన్నేసింది. సఫారీ కసి ముంగిట కివీస్ నిలుస్తుందేమో చూడాలి.
పిచ్ రిపోర్టు : ఈ ప్రపంచకప్‌లో తొలిసారి ఎడ్జ్‌బాస్టన్ ఆతిథ్యం ఇవ్వనుంది. పచ్చిక కనిపించని పిచ్‌పై పరుగుల వరద ఖాయమని తెలుస్తుంది. సీమర్లకు అంత సహకారం దక్కదు కానీ మాయగాళ్లకు మంచి అవకాశం. సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ ప్రభావశీలం అవుతాడు. కివీ స్పిన్నర్లు సఫారీ మిడిల్ ఆర్డర్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. అంతరాయం మాత్రమే ఏర్పడవచ్చు, రద్దు అయ్యే ప్రమాదం లేదు.
తుది జట్లు (అంచనా) :
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్, హషీమ్ ఆమ్లా, ఎడైన్ మార్కరమ్, డుప్లెసిస్, వాన్‌డర్ డుసన్, డెవిడ్ మిల్లర్, ఫెలుక్వయో, క్రిస్ మోరీస్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహీర్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కానె విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమె, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.