Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన దక్షిణాఫ్రికా
- విలియమ్సన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
- ఆమ్లా, డుసెన్ అర్ధ శతకాలు
ఎడ్జ్‌బాస్టన్: టోర్నీలో తొలిసారి దక్షిణాఫ్రికా జట్టు సమిష్టిగా రాణించింది. ప్రపంచకప్ టోర్నీలో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ను సఫారీజట్టు కట్టడి చేసింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాజట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆ జట్టు ఓపెనర్ హషీం ఆమ్లా, డుసెన్‌లు అర్ధ శతకాలతో మెరిశారు. వర్షం కారణంగా బౌలర్లకు సహకరించిన ఈ మైదానంలో దక్షిణాఫ్రికా ఆ మాత్రమైన స్కోర్ చేయగల్గింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు కడపటి వార్తలందే సమయానికి 34 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేసి పోరాడుతోంది. కివీస్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ అర్ధసెంచరీతో రాణించినా... మిగతా బ్యాట్స్మన్లు నిరాశపరిచారు. మోరిస్‌కు మూడు, రబడా, ఫెల్క్యులియోలకు తలా ఒక వికెట్ దక్కాయి. బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు అదే నిలకడలేమి ప్రదర్శనను కనబర్చింది. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో డుసెన్(67), ఆమ్లా(55) అర్ధశతకాలు చేసి జట్టును ఆదుకున్నారు. మార్క్రమ్(38), మిల్లర్(36) సమయోచితంగా పరుగులు చేశారు. కివీస్‌లో ఫెర్గూసన్‌కు మూడు, బౌల్ట్, గ్రాంథోమ్, సాంట్నర్‌కు తలో వికెట్ దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో సఫారీ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ముందురోజు వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్‌ను గంటన్నర ఆలస్యంగా మొదలుపెట్టారు. అంతేగాక మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. వాతావరణ పరిస్థితులు, బ్యాటింగ్ చేసేందుకు కష్టంగా ఉన్న పిచ్‌ను కివీస్ చక్కగా వినియోగించుకుంది.
టాస్ గెలిచిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్(5)ను ట్రెంట్ బౌల్ట్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో మరో ఓపెనర్ హషీమ్ ఆమ్లాతో కలిసి సారథి డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం డుప్లెసిస్(23)ను ఫెర్గుసన్ పెవిలియన్‌కు పంపించాడు. ఓ వైపు వికెట్లు పెడుతున్నా మరో వైపు ఆమ్లా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అర్దసెంచరీ పూర్తి చేసిన అనంతరం ఆమ్లా కూడా పెవిలియన్ బాట పట్టాడు. మార్క్రమ్తో కలిసి ఆమ్లా జట్టును ఆదుకొని అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 111 వద్ద సాంట్నర్.. ఆమ్లాను బోల్తా కొట్టించడంతో సఫారీ జట్టు ఒత్తిడిలో పడింది. క్రీజులోకి వచ్చిన డుసెన్ నిలకడగా ఆడాడు. వికెట్ ఇవ్వలేదు. అనవసర షాట్లు ఆడలేదు. మార్క్రమ్తో కలిసి 25 పరుగుల భాగస్వామ్యం అందించాడు. మార్క్రమ్ను ఔట్ చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్ ఈ జోడీని విడదీశాడు. అయితే డేవిడ్ మిల్లర్, డుసెన్ ఏకంగా 72 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 44.5 ఓవర్లలో 210 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ 37 బంతుల్లో 36 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 218 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 6వ వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి ఫెలుక్వాయో ఔటయ్యాడు. 5 బంతులు ఆడిన ఫెల్క్యులియో ఖాతా కూడా తెరవకుండా ఔటయ్యాడు.
కివీస్ కట్టుదిట్టంగా..
దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు విజయవంతమయ్యారు. క్రమంగా వికెట్లు తీస్తూ సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచారు. కివీస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి సఫారీ బ్యాట్స్‌మెన్ నానాతంటాలు పడ్డారు. ఇంగ్లండ్ పిచ్‌లపై నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్ నమోదు కావడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం గమనార్హం.
ఆమ్లా 8000(నాటౌట్)
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేమ్యాచ్లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆమ్లా వ్యక్తిగత స్కోర్ 24 పరుగుల వద్ద వన్డేల్లో వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి 175 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకోగా, ఆమ్లా 176 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. అంతేగాక దక్షిణాఫ్రికా తరఫున వేగంగా 8000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా రికార్డు సృష్టించాడు. గతంలో సఫారీజట్టు తరఫున విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ 182 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకోగా.. ఓవరాల్‌గా 8000 పరుగుల క్లబ్లో చేరిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో జాక్వస్ కలిస్(11,579), డివిలియర్స్(9577), గిబ్స్(8094)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నిజానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ముందుగానే ఈ రికార్డుని ఆమ్లా అధిగమించాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమ్లా ఫామ్‌లో లేకపోవడంతో ఈ రికార్డు కాస్త ఆలస్యం అయింది.
స్కోర్‌బోర్డు...
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 5, ఆమ్లా (బి) సాంట్నర్ 55, డుప్లెసిస్ (బి) ఫెర్గ్యుసన్ 23, మార్క్రమ్ (సి) మున్రో (బి) గ్రాంథోమ్ 38, డుసెన్ (నాటౌట్) 67, డేవిడ్ మిల్లర్ (సి) బౌల్ట్ (బి) ఫెర్గ్యుసన్ 36, ఫెల్క్యులియో (సి) విలియమ్సన్ (బి) ఫెర్గ్యుసన్ 0, మోరిస్ (నాటౌట్) 6, అదనం 11. (49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు)
వికెటపతనం: 1/9, 2/59, 3/111, 4/136, 5/208, 6/218
బౌలింగ్: హెన్రీ 10-2-34-0, బౌల్ట్ 10-0-63-1, ఫెర్గ్యుసన్ 10-0-59-3, గ్రాంథోమ్ 10-0-33-1, సాంట్నర్ 9-0-45-1