Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు శ్రీలంకతో మ్యాచ్
- మ 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
లీడ్స్ (ఇంగ్లాండ్) : ఇంగ్లాండ్, శ్రీలంక సమరం. ఒకప్పుడు సమవుజ్జీల సమరం. ఇప్పుడు ఇంగ్లాండ్ ఏకపక్ష ఆధిపత్యం!. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న శ్రీలంక నేడు ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మరో విజయంపై కన్నేసిన టైటిల్ ఫేవరెట్‌ను నేడు లంకేయులను ఏం చేస్తుందో చూడాలి. శ్రీలంక ఐదు మ్యాచుల్లో ఒక విజయం సాధించగా, ఇంగ్లాండ్ ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు నమోదు చేసింది. ఇయాన్ మోర్గాన్ సిక్సర్లతో శతకం అందుకున్నాక, ఆడుతున్న తొలి మ్యాచ్ కావటంతో లీడ్స్‌లో ఇంగ్లాండ్ సారథిపై ఫోకస్ కనిపిస్తోంది. జానీ బెయిర్‌స్టో, జో రూట్, జోశ్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్ తరఫున మెగా ఫామ్‌లో ఉన్నారు. జోఫ్రా ఆర్చర్‌ను కాచుకోవటం నేడు లంక బ్యాట్స్‌మెన్‌కు విషమ పరీక్ష.
మిడిల్ ఆర్డర్ నిలిస్తేనే : శ్రీలంక టాప్ ఆర్డర్ పేలవం. ప్రపంచకప్‌కు ముందు అందరి ఆందోళన అదే. కానీ పోటీ మొదలయ్యాక పరిస్థితి మారిపోయింది. టాప్ ఆర్డర్లో కరుణరత్నె, కుశాల్ పెరీరా, తిరిమానె మెరుస్తుండగా.. మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమవుతోంది. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ బాధ్యత లేకుండా ఆడుతున్నాడు. కుశాల్ మెండిస్, సిరివర్దనలు ఆరంభాలను సద్వినియోగం చేసుకోవటం లేదు. మిడిల్ ఆర్డర్ కుప్పకూలటంతో శ్రీలంక పోరాటం తేలిపోతుంది. నేటి మ్యాచ్‌లోనైనా మిడిల్ నుంచి సహకారం లభిస్తే ఇంగ్లాండ్‌కు కనీస పోటీ ఇవ్వవచ్చు. మలింగ, ప్రదీప్, ఉదానలతో బౌలింగ్ విభాగం బాగుంది.
పిచ్ రిపోర్టు : గత కొన్ని రోజులుగా లీడ్స్‌లో వర్షం కురుస్తోంది. నేడు మ్యాచ్‌కు ఎటువంటి ఇబ్బంది లేదని వాతావరణ శాఖ చెబుతోంది. శీతల వాతావరణంతో హెడింగ్లే పిచ్ సీమర్లకు మరింత సహకరించనుంది. ఇంగ్లాండ్ ఇక్కడ గతంలో 351/9 పరుగులు చేసింది. పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది. సీమర్లకు అనునుకూలించినా, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, జేమ్స్ విన్సె, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్.
శ్రీలంక : కరుణరత్నె, కుశాల్ పెరీరా, లహిరు తిరిమానె, కుశాల్ మెండిస్, మాథ్యూస్, సిరివర్ధన, ధనంజయ డిసిల్వ, తిశార పెరీరా, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, నువాన్ ప్రదీప్.