Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐనా, విండీస్‌కు గుండె పగిలే ఫలితం
- ఉత్కంఠ మ్యాచ్‌లో కివీస్ గెలుపు
మాంచెస్టర్
2016 వరల్డ్ టీ20 ఫైనల్లో కార్లోస్ బ్రాత్‌వేట్ ఊచకోత అభిమానులు ఇంకా మరచిపోలేదు. ఇంగ్లాండ్‌పై 10 బంతుల్లోనే ఓ ఫోర్, నాలుగు సిక్సర్లతో విరుచుకుపడిన బ్రాత్‌వేట్ అసాధ్యమనిపించిన ఛేదనలో మరో రెండు బంతులు మిగిల్చి విండీస్‌కు టైటిల్‌ను అందించాడు. 340 స్ట్రయిక్ రేట్‌తో కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో కార్లోస్ ఖతర్నాక్ షో అతడిని సూపర్ హీరోను చేసింది. మూడేండ్ల విరామం తర్వాత మాంచెస్టర్‌లో, 50 ఓవర్ల ప్రపంచకప్‌లో కార్లోస్ బ్రాత్‌వేట్ అంతకుమించిన విన్యాసమే చేశాడు. 292 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20/2తో ఒత్తిడిలో పడింది. క్రిస్ గేల్ (87, 84 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), షిమ్రోన్ హెట్మయర్ (54, 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) ఛేదనను ట్రాక్‌పైకి తీసుకొచ్చారు. 142/2తో కరీబియన్లను ముందంజలో నిలిపారు. కివీస్ బౌలర్ల మెరుపులతో విండీస్ మిడిల్ ఆర్డర్లో కుదుపు. 164/7తో ఓటమి ఖరారు!. ఈ దశలో కార్లోస్ బ్రాత్‌వేట్ (101, 82 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కివీస్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన కార్లోస్ '2019 ప్రపంచకప్ అద్భుత ఇన్నింగ్స్' ఆడేశాడు అనటంలో సందేహం లేదు. 9 ఫోర్లు, ఐదు సిక్సర్లతో మెరిసిన కార్లోస్.. విజయాన్ని విండీస్ గుప్పిట్లోకి తీసుకొచ్చాడు. మరో ఆరు పరుగులు చేయాల్సిన దశలో లాంగ్ ఆన్ బౌండరీ లైన్ వద్ద ట్రెంట్ బౌల్ట్ పట్టిన అద్భుత క్యాచ్‌తో విండీస్ గుండె పగిలింది. మరో ఆరు బంతులు మిగిలి ఉన్నా.. చేతిలో వికెట్లు లేకపోవటంతో న్యూజిలాండ్ 5 పరుగులతో విజయం సాధించింది. రసవత్తర మలుపులు తిరుగుతూ, ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆ ఫలితాన్ని బహుశా న్యూజిలాండ్ సైతం ఊహించి ఉండదు. మాంచెస్టర్‌లో వెస్టిండీస్ ఓటమి వైపు నిలుచున్నా.. కార్లోస్ బ్రాత్‌వేట్ కండ్లుచెదిరే ఇన్నింగ్స్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 291/8 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' కేన్ విలియమ్సన్ (148, 154 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) శతకం సాధించగా, రాస్ టేలర్ (69, 95 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు.
సంక్షిప్త స్కోర్లు : న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 291/8 ( విలియమ్సన్ 148, రాస్ టేలర్ 69, కాట్రెల్ 4/56, బ్రాత్‌వేట్ 2/58)
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 286/10 (బ్రాత్‌వేట్ 101, క్రిస్ గేల్ 87, హెట్మయర్ 54, ట్రెంట్ బౌల్ట్ 4/30)