Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్, ఆసీస్ ఢీ నేడు
- మ. 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
లండన్ (లార్డ్స్): ప్రపంచకప్ మొదలై 20 రోజులు ముగిసింది. తిరుగులేని టైటిల్ ఫేవరెట్‌గా టోర్నీకి మొదలెట్టిన ఇంగ్లాండ్.. ఇప్పుడు సెమీఫైనల్స్ రేసులో కఠిన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఫైనల్స్ అంచనాల్లోనే లేని డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ సాగుతున్న కొద్దీ బలం పుంజుకుంటోంది. శ్రీలంక చేతిలో అనూహ్య ఓటమి ఇంగ్లాండ్‌ను క్లిష్ట పరిస్థితుల్లో నిలుపగా.. స్టార్ ఓపెనర్ జేసన్ రారు గాయం కోలుకోలేని ఎదురుదెబ్బ!. సెమీస్ రేసులో తప్పక నెగ్గాల్సిన స్థితిలో నేడు ఆస్ట్రేలియా సవాల్‌ను స్వీకరించేందుకు ఇంగ్లాండ్ సిద్ధమైంది. గత ఐదు వన్డేల్లో ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్‌కు ఇది కొత్త సవాల్ కానుంది.
ఇంగ్లాండ్‌పై ఒత్తిడి : సెమీస్ రేసులో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తాపీగా సాగుతున్నాయి. ఇంగ్లాండ్ అనూహ్య ఓటములతో కొత్త చిక్కులు కొని తెచ్చుకుంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జేసన్ రారు లేని లోటు ఇంగ్లాండ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ నిలకడగా రాణిస్తున్నాడు. మోర్గాన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ సైతం ఫామ్‌లో ఉన్నారు. జానీ బెయిర్‌స్టో, విన్సేలు మెరుగైన ఆరంభం అందిస్తే.. ఇంగ్లాండ్ భారీ స్కోరుపై కన్నేయవచ్చు. విధ్వంసక బ్యాట్స్‌మన్ జోశ్ బట్లర్ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆస్ట్రేలియాపై బట్లర్ చెలరేగితే ఇంగ్లాండ్‌కు తిరుగుండదు. జోఫ్రా ఆర్చర్‌ను ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నారు. కంగారూ బ్యాట్స్‌మెన్‌పై ఆర్చర్ కొత్త బాణాలతో వస్తేనే చిక్కుల్లో పడేయగలడు. ఆదిల్ రషీద్ స్పిన్‌కు తోడు మార్క్‌వుడ్, ఫ్లంకెట్ పేస్‌తో బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
వార్నర్‌ను ఆపగలరా? : ఏడాది నిషేధం ముగించుకుని, నేరుగా ప్రపంచకప్‌లోకి వచ్చిన డెవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లతో కదం తొక్కుతున్నాడు. నేడు లార్డ్స్‌లో వార్నర్‌ను అడ్డుకోవటం ఇంగ్లాండ్‌కు కత్తి మీద సామే. కెప్టెన్ అరోన్ ఫించ్ సైతం ఊపందుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్ గోడ కడుతున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనా.. భారీ భాగస్వామ్యాలు నిర్మిస్తున్నాడు. ఉస్మాన్ ఖవాజా, గ్లెన్ మాక్స్‌వెల్‌లు అవకాశం దొరికినప్పుడు చెలరేగుతున్నారు. ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ ఎదుర్కొన్న ఆసీస్‌కు, నేడు లార్డ్స్‌లో ఎదుర్కొబోయే కంగారూలకు ఎంతో వ్యత్యాసం. మిచెల్ స్టార్క్, కౌంటర్నైల్, పాట్ కమిన్స్‌లు బంతితో విజృంభిస్తున్నారు. నాథన్ లయాన్ తుది జట్టులో చోటు కోసం ఆడం జంపాతో పోటీపడుతున్నాడు. అనుభవం దృష్ట్యా నేడు లయాన్‌కు అవకాశం లభించినా ఆశ్చర్యం లేదు.
పిచ్ రిపోర్టు : లార్డ్స్ పిచ్ ప్రపంచకప్‌ను ఆసక్తికరంగా మారుస్తోంది. సఫారీ, పాక్ మ్యాచ్‌తో పాక్ సెమీస్ రేసులోకి వచ్చింది. బ్యాట్‌కు, బంతికి సరసమైన అనుకూలత లభిస్తోంది. నేటి మ్యాచ్‌కు పిచ్‌పై కాస్త పచ్చికను విడిచిపెట్టారు. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ.. వరుణుడు అలా వచ్చి వెళ్లే అవకాశం ఉంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు చూస్తుంది!.
తుది జట్లు (అంచనా) :
ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, జేమ్స్ విన్సే, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజ, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారె, నాథన్ కౌల్టర్‌నీల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.