Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింబుల్డన్ సీడింగ్స్ విడుదల
లండన్ : ఎనిమిదిసార్లు చాంపియన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు వింబుల్డన్‌లో రెండో సీడ్ లభించింది. ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సీడింగ్ ప్రపంచ ర్యాంక్ ప్రకారం కాకుండా, గ్రాస్ కోర్టుపై ప్రదర్శననూ పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో రోజర్ ఫెడరర్‌కు సీడింగ్‌లో ప్రమోషన్, రఫెల్ నడాల్‌కు డిమోషన్ లభించింది. వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్‌కు టాప్ సీడ్ లభించగా, నిరుడు ఫైనలిస్ట్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)కు నాల్గో సీడ్ ఇచ్చారు. అండర్సన్ వరల్డ్ ర్యాంక్ 8. అండర్సన్ ప్రమోషన్‌తో అలెగ్జాండర్ జ్వెరెవ్, స్టెఫానిస్ సిట్సిపస్లు ఒక్కో సీడింగ్ దిగజారారు. నడాల్‌కు మూడో సీడ్ లభించటంతో టాప్ సీడ్ జకోవిచ్‌తో అతడు సెమీస్‌లోనే తలపడే అవకాశం ఉంటుంది. 1, 2 సీడ్లు ఫైనల్లో మాత్రమే ఎదురయ్యేలా డ్రా ఉంటుంది. మహిళల సింగిల్స్‌లో సీడింగ్ మాత్రం డబ్లూటీఏ ర్యాంక్‌ల ప్రకారం ప్రకటించారు. ఫ్రెంచ్ ఓపెన్ విజేత, వరల్డ్ నం.1 బార్టీకి టాస్ సీడ్ లభించగా, జపాన్ స్టార్ నవొమి ఒసాక రెండో సీడ్ దక్కించుకుంది. టాప్ సీడ్‌గా గ్రాండ్‌స్లామ్ ఆడనుండటం బార్టీకి ఇదే తొలిసారి. డిఫెండింగ్ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ ఐదో సీడ్‌గా బరిలోకి దిగనుంది. సెరెనా విలిమమ్స్ 11వ సీడ్‌గా ఆడనుంది. గత ఏడాది సెరెనా ప్రపంచ ర్యాంక్ 183. కానీ వింబుల్డన్‌లో ఆమెకు 25వ సీడ్ లభించింది. పోటీని ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు సీడింగ్ మార్పు చేసే అవకాశం లేకపోలేదు. అర్హత మ్యాచులతో మొదలైన వింబుల్డన్, జులై 1 నుంచి ప్రధాన పోటీలకు సిద్ధం కానుంది. జులై 14న పురుషుల సింగిల్స్ టైటిల్ పోరుతో వింబుల్డన్ ముగుస్తుంది. అదే రోజు, క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ కావటం విశేషం.