Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక, వెస్టిండీస్ పోరు నేడు
- మ. 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
చెస్టర్ లీ స్ట్రీట్ (డర్హమ్)
ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచులు ముగింపుకొచ్చాయి. సెమీఫైనల్స్ రేసులో ఎవరి అవకాశాలు ఎవరు దెబ్బ కొడతారో అనే ఆందోళన కనిపిస్తోంది. కానీ చెస్టర్ లీ స్ట్రీట్ ప్రపంచకప్ మ్యాచ్ అందుకు మినహాయింపు. నేడు శ్రీలంక, వెస్టిండీస్ గ్రూప్ దశలో ఎనిమిదో మ్యాచ్‌కు సిద్ధపడ్డాయి. ఏడు మ్యాచుల్లో ఒక విజయమే సాధించిన కరీబియన్లు సెమీఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించారు. ఏడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక.. చివరి రెండు మ్యాచుల్లో నెగ్గి, ఇతర మ్యాచుల ఫలితాలు, ఇతర సమీకరణాలు కలిసొస్తే ఆశలు నిలుపుకోనుంది. కానీ ప్రస్తుత దశలో శ్రీలంకకు అటువంటి వాతావరణమేమీ కనిపించటం లేదు. పైగా, తన చివరి మ్యాచ్‌లో బలమైన భారత్‌తో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక, వెస్టిండీస్ నామమాత్రపు మ్యాచ్‌కు రెఢ అయ్యాయి.
విండీస్ విజృంభిం చేనా? : 2019 ప్రపంచకప్ సర్ప్రైజ్ ఫేవరెట్‌గా అందరూ వెస్టిండీస్‌నే ఎన్నుకున్నారు. ఆరంభంలో కరీయబిన్ల ప్రదర్శన అద్భుతం. కానీ కీలక సందర్భాలను నెగ్గలేని విండీస్.. చేజేతులా విలువైన విజయాలు చేజార్చుకుంది. మెరుపు బౌలింగ్, విధ్వంసక బ్యాటింగ్ లైనప్‌తో నేడు వెస్టిండీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. క్రిస్ గేల్, షిమ్రోన్ హెట్మయర్, హౌప్, లెవిస్ సహా బ్రాత్‌వేట్ భారీ స్కోర్లపై కన్నేశారు. చివరి మ్యాచుల్లోనైనా కండ్లుచెదిరే ప్రదర్శనలు చేయాలని విండీస్ భావిస్తోంది. ఒసేన్ థామస్, షెల్డన్ కాట్రెల్, జేసన్ హౌల్డర్ బంతితో జోరుమీదున్నారు. డర్హమ్‌లో విండీస్ భారీ విజయంపై కన్నేసింది.
లంక ఏం చేస్తుంది! : టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్‌పై విజయంతో శ్రీలంక అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. టాప్ ఆర్డర్ ఆడిన చోట మిడిల్ ఆర్డర్ వైఫల్యం.. మిడిల్ మెరిసిన వేళ, టాప్ ఆర్డర్ కుప్పకూలటం శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను వేధిస్తోంది. విండీస్‌తో మ్యాచ్‌లోనైనా లంకేయులు సమష్టి ప్రదర్శన చేస్తే విజయంపై కన్నేయవచ్చు. లసిత్ మలింగ సారథ్యంలోని బౌలింగ్ బృందం మెరుగ్గా కనిపిస్తోంది. భారీ హిట్టర్లతో కూడిన కరీబియన్లను నిలువరించటం శ్రీలంకకు నేడు సవాలే.
తుది జట్లు (అంచనా) :
శ్రీలంక : తిరిమానె, కరుణరత్నె, కుశల్ మెండిస్, పెరీరా, ధనంజయ డిసిల్వ, మాథ్యూస్, జీవన్ మెండిస్, ఇసురు ఉదాన, లక్మల్, లసిత్ మలింగ.
వెస్టిండీస్ : క్రిస్ గేల్, షారు హౌప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హెట్మయర్, జేసన్ హౌల్డర్, కార్లోస్ బ్రాత్‌వేట్, సునీల్ ఆంబ్రిస్, షెల్డన్ కాట్రెల్, ఒసేన్ థామస్, అష్లె నర్సె.