Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఢ
- ఫేవరెట్‌గా ఆతిథ్య మోర్గాన్ సేన
- మ 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసు రసవత్తర ఘట్టానికి చేరుకుంది. టాప్-4లో నిలిచినా, నేరుగా సెమీఫైనల్స్ బెర్త్ సొంతం చేసుకునేందుకు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ నేడు ముఖాముఖి పోరుకు సిద్ధమవుతున్నాయి. ఆతిథ్య ఇంగ్లాండ్ నేడు నెగ్గితే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే, ఇతర మ్యాచుల ఫలితాలపై, సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ పరిస్థితీ ఇదే. విజయంతో దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టడమా? నెట్ రన్‌రేట్ సాయంతో టాప్-4పై ఆశలు పెట్టుకోవటమా? అనేది కివీస్ తేల్చుకోవాలి. క్వార్టర్ఫైనల్స్లను తలపిస్తోన్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రపంచకప్‌లో సెమీస్ రేసును రక్తి కట్టిస్తుంది. గ్రూప్ దశలో ఇరు జట్లకూ ఇదే చివరి మ్యాచ్ కావటంతో.. నేరుగా సెమీస్‌కు చేరేదెవరో చూడాలి.
చెస్టర్ లీ స్ట్రీట్ (డర్హమ్)
ఆతిథ్య జట్టుగా టైటిల్‌పై కన్నేసి ప్రపంచకప్ వేట ఆరంభించిన ఇంగ్లాండ్ అనూహ్యంగా మూడు ఓటములు చవిచూసింది. చివరి దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో బలమైన భారత్‌పై సాధికారిక విజయం సాధించింది. మరో టాప్ జట్టు న్యూజిలాండ్‌పై నెగ్గితే మోర్గాన్ గ్యాంగ్ సొంతగడ్డపై సెమీఫైనల్స్‌కు సిద్ధం కానుంది. మరి, అందుకు బ్లాక్‌క్యాప్స్ బృందం అంత సులువుగా తలొగ్గుతుందా?. ఇతరులపై ఆధారపడకుండా సెమీస్‌కు చేరటంపై కన్నేసిన న్యూజిలాండ్ సైతం నేడు విజయం కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించనుంది.
మోర్గాన్, బట్లర్ మెరవాలి : ఓపెనర్ జేసన్ రారు పునరాగమనంతో ఇంగ్లాండ్ మళ్లీ ప్రమాదకరంగా కనిపిస్తోంది. జానీ బెయిర్‌స్టోతో కలిసి రారు విధ్వంసక ఆరంభం మిడిల్ ఆర్డర్‌పై భారం గణనీయంగా తగ్గిస్తోంది. బర్మింగ్‌హామ్ జోరు డర్హమ్లోనూ కొనసాగిస్తే ఇంగ్లాండ్‌కు తిరుగుండదు. స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ నిలకడ అదనపు ప్రయోజనం. కానీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, విధ్వంసక బ్యాట్స్‌మన్ జోశ్ బట్లర్ మెరుపులపై ఇంగ్లాండ్ విజయం ఆధారపడి ఉంది. అఫ్గాన్‌పై విజృంభించిన మోర్గాన్ వరుసగా విఫలమవుతున్నాడు. బట్లర్ అంచనాలను అందుకోవటం లేదు. ఈ ఇద్దరూ మెరిస్తే ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అతడిని అడ్డుకోవటం కివీస్‌కు కష్టమేనని చెప్పాలి. జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, ఫ్లంకెట్‌లు పేస్ బాధ్యతలు చూసుకోనున్నారు. ఆదిల్ రషీద్ ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులో ఉండనున్నాడు.
కివీస్ పుంజుకునేనా : వరుస ఓటములు చవిచూసిన న్యూజిలాండ్ విజయంపై కన్నేసింది. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమవుతోంది. సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తొలి మ్యాచ్‌లో మినహా మళ్లీ మెరువలేదు. కొలిన్ మన్రో అవకాశాలను లెక్క చేయటం లేదు. మిడిల్ ఆర్డర్లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ జోరుపైనే కివీస్ బ్యాటింగ్ లైనప్ ఆధారపడి ఉంది. లోయర్ ఆర్డర్లో టామ్ లాథమ్ సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హౌమె సైతం రాణించాల్సి ఉంది. ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్, మాట్ హెన్రీలతో కూడిన పేస్ విభాగం ఆకట్టుకుంటోంది. స్పిన్నర్ శాంట్నర్ ఇంగ్లీష్ టాప్ ఆర్డర్‌ను ఎలా నిలువరిస్తాడనేది ఆసక్తికరం.
పిచ్ రిపోర్టు : చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఇది మూడో మ్యాచ్. డర్హమ్‌లో మంచి ఎండకాస్తోంది. పరుగుల వరదకు తొలి సూచకం. ఇక్కడ జరిగిన తొలి రెండు మ్యాచుల్లో 300 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. విధ్వంసక బ్యాట్స్‌మెన్ బరిలో నిలిచిన మ్యాచ్‌లో 350 ప్లస్ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడవచ్చు.
తుది జట్లు (అంచనా) :
ఇంగ్లాండ్ : జేసన్ రారు, జానీ బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, క్రిస్ వోక్స్, లియాం ఫ్లంకెట్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హౌమె, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.