Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్, బంగ్లా మ్యాచ్ నేడు
- ఎవరు నెగ్గినా సెమీస్‌కు చేరరు
- మ.3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
లండన్ (లార్డ్స్): 1992, 2019 ప్రపంచకప్ వేటలో పాకిస్థాన్ ప్రయాణంపై పోలికల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. 1992లో అలా జరిగింది, 2019లో అదే విధంగా జరుగుతోంది. మరోసారి ప్రపంచకప్ పాకిస్థాన్ సొంతమవుతుంది.. ఇదీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితానికి ముందు సోషల్ మీడియాతో పాటు పాక్ క్రికెట్ చర్చించింది. న్యూజిలాండ్‌పై అలవోక విజయంతో ఇంగ్లాండ్ నేరుగా సెమీఫైనల్లోకి చేరుకొని, పాకిస్థాన్ ఆశలను చిదిమేసింది. ప్రపంచకప్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడుతున్న పాకిస్థాన్.. నేడు దాయాది దేశం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. నేడు బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ నెగ్గినా.. ఆ జట్టు సెమీస్‌కు చేరుకునే అవకాశం లేదు. పాయింట్ల పరంగా (11) న్యూజిలాండ్‌తో సమవుజ్జీగా నిలిచినా.. నెట్‌రన్‌రేట్‌లో కివీస్ (0.175)అందనంత ఎత్తులో ఉంది. పాకిస్థాన్ (-0.792) బుణాత్మక నెట్‌రన్‌రేట్‌ను అధిమించి.. న్యూజిలాండ్‌పై పైచేయి సాధించాలంటేత నేడు కనీసం 309 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలి. క్రికెట్లో ఇది అసాధ్యమైన విజయం. గణిత శాస్త్ర పరంగా అవకాశాలు ఉండటంతో.. పాక్ ఇంకా రేసులోనే ఉందని చెప్పక తప్పదు.
పాకిస్థాన్‌తో గత ఐదు మ్యాచుల్లో నాలుగింట బంగ్లాదేశ్ విజయం సాధించింది. చివరగా 2014 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలుపొందింది. 2018 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ సాధికారిక విజయం సొంతం చేసుకుంది. తాజా ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ సంతృప్తికర ప్రదర్శన చేసింది. ఓడిన మ్యాచుల్లోనూ ప్రత్యర్థి గౌరవాన్ని పొందిన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. భారత్ చేతిలో భారీ ఓటమితో బంగ్లాదేశ్ సైతం సెమీస్ రేసుకు దూరమైంది. గత ప్రపంచకప్‌లో క్వార్టర్ఫైనల్స్కు చేరిన బంగ్లాదేశ్.. ఈసారి విజయంతో వరల్డ్‌కప్ నుంచి వైదొలగాలని భావిస్తోంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ పరుగుల వరద పారించాడు. ముష్ఫీకర్ రహీమ్, లిటన్ దాస్, మహ్మదుల్లా, తమీమ్ ఇక్బాల్ నిలకడగా రాణించారు. లార్డ్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే బంగ్లాదేశ్ విజయంతో వీడ్కోలు పలుకటం లాంఛనమే.
మరోవైపు 1992 ప్రపంచకప్ గెలుపు పోలికలతో సంతృప్తిపడిన పాకిస్థాన్, 2019 ప్రయాణం ముగిసిందని గ్రహించింది. సెమీస్‌కు చేరటం సాధ్యం కాని పరిస్థితుల్లో చివరి మ్యాచ్ విజయంపై కన్నేసింది. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చేతిలో దారుణ ఓటమికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. నెట్‌రన్‌రేట్ రూపంలో ఆ ఓటమి పాక్‌ను వెంటాడుతోంది. ఫకర్ జమాన్ టోర్నీలో నిలకడగా విఫలమయ్యాడు. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా అతడు మెరుస్తాడేమో చూడాలి. బాబర్ ఆజామ్, మహ్మద్ హఫీజ్‌లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఇమామ్ ఉల్ హాక్, సర్ఫరాజ్ అహ్మద్ మెరుగైన ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. లోయర్ ఆర్డర్లో హరీశ్ సోహైల్, ఇమద్ వసీం మెరిసే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు తీసుకోనున్నాడు. బహుశా, లార్డ్స్‌లో అతడికి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం దక్కవచ్చు.
పరాజయం పరిపూర్ణం! : 2019 ప్రపంచకప్‌ను అఫ్గనిస్థాన్ విజయం లేకుండా ముగించింది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ అఫ్గనిస్థాన్ పరాజయం పాలైంది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనూ ఓడిన అఫ్గనిస్థాన్ వరుసగా తొమ్మిదో ఓటమి చవిచూసి, పరాజయాలను పరిపూర్ణం చేసుకుంది. అఫ్గనిస్థాన్‌పై 23 పరుగుల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్ విజయంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్ 311/6 పరుగులు చేయగా, అఫ్గాన్ 288 పరుగులకు ఆలౌట్ అయింది.