Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింబుల్డన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్
- మార్గరెట్ 24 గ్రాండ్‌స్లామ్ రికార్డుపై గురి
- టైటిల్ పోరులో సిమోన హలెప్‌తో ఢీ
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2019
లండన్ (ఇంగ్లాండ్)
టెన్నిస్ దిగ్గజం, 23 గ్రాండ్‌స్లామ్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) చరిత్రకు మరింత చేరువైంది. 37 ఏండ్ల వయసులో, ఓ బిడ్డకు తల్లిగా సెరెనా విలియమ్స్ రికార్డు గ్రాండ్‌స్లామ్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రైకోవాపై 6-1, 6-2తో ఏకపక్ష విజయం సాధించిన సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. 59 నిమిషాల్లోనే సెమీస్ సమరాన్ని ముగించిన సెరెనా విలియమ్స్ రికార్డు స్థాయిలో 11వ సారి టైటిల్ పోరుకు చేరుకుంది. మరో సెమీఫైనల్లో సిమోన హలెప్ గెలుపొందింది. ఎలినా స్విట్లోనా (ఉక్రెయిన్)పై 6-1, 6-3తో హెలెప్ (రోమానియా) ఘన విజయం సాధించింది. వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి రోమానియా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌తో సిమోన హలెప్ తలపడనుంది.
గంటలోపే ముగించింది : 33 ఏండ్ల వయసులో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రైకోవా తొలిసారి వింబుల్డన్ సెమీఫైనల్లో ప్రవేశించింది. లేటు వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ సెమీస్ ఆడిన ప్లేయర్‌గా బార్బరా నిలిచింది. ఈ రికార్డు ప్రేరణ ఆమెను సెమీస్ రేసులో పోరాడేలా చేసినా, దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ముందు నిలబడేలా చేయలేదు. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు, భారీ సర్వ్‌లతో సెరెనా విలియమ్స్ విరుచుకుపడింది. సెమీఫైనల్స్‌ను ఏకపక్షం చేసింది. 4 ఏస్‌లు, 28 విన్నర్లతో సెరెనా దూకుడుగా ఆడింది. సెరెనా 54 పాయింట్లు సాధించగా, బార్బరా 31తో సరిపెట్టుకుంది. తొలి సెట్లో సెరెనా వరుసగా ఐదు గేమ్‌లు గెల్చుకుని బార్బరాను చిత్తు చేసింది. మరో సెమీఫైనల్లో సిమోన హలెప్ హవా నడిచింది. 6-1, 6-3తో ఉక్రెయిన్ ప్లేయర్‌పై తిరుగులేని విజయం సాధించింది. పాయింట్ల పరంగా 68-21తో హలెప్ భారీ ఆధిక్యం సాధించింది. హలెప్ 12 గేములు నెగ్గగా.. స్విట్లోనా 4తో సరిపెట్టుకుంది.
నేడు నడాల్, ఫెడరర్ పోరు : పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో దిగ్గజాల సమరానికి సర్వం సిద్ధమైంది. ర్యాంక్‌తో సంబంధం లేకుండా ఫెడరర్‌కు రెండో సీడ్ ఇవ్వటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన రఫెల్ నడాల్ (స్పెయిన్) నేడు సెమీస్‌లో స్విస్ యోధుడిని ఢకొీట్టనున్నాడు. మరో సెమీఫైనల్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)తో రాబర్ట్ బటిస్టా ఆగట్ (స్పెయిన్) తలపడనున్నాడు. సెమీఫైనల్స్ మ్యాచుల్లో ఫెడరర్, జకోవిచ్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.