Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి ఇన్నింగ్స్ ఆడేసిన గేల్
- 30 బంతుల్లో మెరుపు అర్ధ సెంచరీ
- భారత్, వెస్టిండీస్ మూడో వన్డే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : యూనివర్శల్ బాస్, విధ్వంసక ఇన్నింగ్స్‌ల మొనగాడు క్రిస్ గేల్ కరీబియన్ జట్టు తరఫున కెరీర్ ఆఖరి ఆట ఆడేశాడు!. ప్రపంచకప్‌తో వీడ్కోలు పలకాలనుకున్న క్రిస్ గేల్, మనసు మార్చుకుని స్వదేశంలో భారత్‌తో చివరి సారిగా మైదానంలోకి బరిలోకి దిగాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్‌తో మూడో వన్డే గేల్‌కు కెరీర్ 301 వన్డే. దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా అత్యధిక పరుగులు, అత్యధిక వన్డేల రికార్డును బద్దలుకొట్టిన క్రిస్ గేల్.. చివరి ఇన్నింగ్స్‌లో ఆకాశాన్ని ముద్దాడాడు. ఐదు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 41 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. కెరీర్ చివరి ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన క్రిస్ గేల్, వేగంగా సెంచరీ వైపు దూసుకెళ్లేలా కనిపించాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి అలవోక క్యాచ్‌తో గేల్ జిగేల్కు ముగింపు పలికాడు. చివరి మ్యాచ్‌లో వన్డే నెంబర్ 301 జెర్సీతో బరిలోకి దిగిన గేల్‌ను కోహ్లిసేన అభినందించగా, విండీస్ డ్రెస్సింగ్‌రూమ్ స్టాండింగ్ ఓవన్తో గౌరవించింది. హెల్మెట్‌ను బ్యాట్‌కు ఉంచి అభిమానులకు గేల్ భావోద్వేగ వీడ్కోలు పలికాడు.
ధనాధన్ ఆరంభం : టాస్ నెగ్గిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గేల్ (72), ఎవిన్ లెవిస్ (43, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసక షాట్లు బాదారు. ఓపెనర్ల బాదుడుతో తొలి పది ఓవర్లలో విండీస్ 114/0తో టాప్ గేర్‌లో నిలిచింది. ఓపెనర్ల దూకుడుతో కరీబియన్లు భారీ స్కోరు దిశగా సాగారు. కానీ స్పిన్నర్ చాహల్ ఊరించే బంతికి లెవిస్ వికెట్ కోల్పోగా.. ఖలీల్ బౌలింగ్‌లో గేల్ నిష్క్రమించాడు. ఓపెనర్ల నిష్క్రమణతో విండీస్ జోరు నెమ్మదించింది. హౌప్ (19), హెట్మయర్ (18) అజేయంగా ఆడుతున్నారు. వర్షం అంతరాయం కలిగించే సమయానికి వెస్టిండీస్ 22 ఓవర్లలో 158/2తో నిలిచింది.