Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కింగ్‌స్టన్‌లో బుమ్రా కింగ్ షో
- కెరీర్ తొలి హ్యాట్రిక్ వికెట్ల ఘనత
- వెస్టిండీస్ 117 ఆలౌట్
- కరీబియన్లతో రెండో టెస్టు
కింగ్స్టన్ (జమైకా): ఆంటిగ్వాలో కరీబియన్ల నడ్డి విరిచిన బుమ్రా.. నార్త్‌సౌండ్ వేధన నుంచి విండీస్ తేరుకునే లోపే మరో బీభత్సం సృష్టించాడు. టెస్టుల్లో కొత్త అవుట్ స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తున్న బుమ్రా.. కింగ్‌స్టన్‌లో కింగ్ షో చేశాడు. బుమ్రా లైన్, లెంగ్త్, బంతి సంధించే కోణం సహా స్వింగ్ దిశను అర్థం చేసుకోవటానికి వెస్టిండీస్ టాప్ ఆర్డర్ విఫల ప్రయత్నాలు చేసింది. అయినా, బుమ్రా అస్త్రాన్ని విండీస్ నిలువరించలేదు. వరుస బంతుల్లో బ్రావో (4), బ్రూక్స్ (0), ఛేజ్ (0)లను అవుట్ చేసిన జశ్‌ప్రీత్ బుమ్రా కెరీర్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. రెండో రోజు ఆటలో ఆఖరు సెషన్లో నిప్పులు చెరిగిన బుమ్రా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ స్పెల్‌లో 9.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా దెబ్బకు విండీస్ రెండో రోజుకే 87/7తో పతనావస్థలో నిలిచింది. మూడో రోజు ఉదయం సెషన్ తొలి గంటలోనే కోహ్లిసేన లాంఛనం ముగించింది. వెస్టిండీస్‌ను 117 పరుగులకే కుప్పకూల్చింది. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి (111, 225 బంతుల్లో 16 ఫోర్లు) కెరీర్ అర్థ సెంచరీతో చెలరేగాడు. టెయిలెండర్ ఇషాంత్ శర్మ (57, 80 బంతుల్లో 7 ఫోర్లు) కెరీర్ తొలి అర్థ సెంచరీ సాధించాడు. హనుమ విహారి, శర్మ జోడీ ఎనిమిదో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. వెస్టిండీస్‌ను 117 పరుగులకే కుప్పకూల్చిన కోహ్లిసేన.. తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. బౌలర్ల దూకుడుతో విండీస్‌ను ఫాలోఆన్ ఆడించే ఆలోచన ఉన్నప్పటికీ.. కెప్టెన్ కోహ్లి మరోసారి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు.
బుమ్రా బుల్లెట్లు : అవుట్ స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా తయారైన జశ్‌ప్రీత్ బుమ్రా, వెస్టిండీస్‌పై ఊచకోతను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం చూపిన బుమ్రా.. కింగ్‌స్టన్‌లో తొలి ఇన్నింగ్స్ నుంచే మొదలెట్టాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మొదలైన బుమ్రా బీభత్సం విండీస్ పతనం వరకూ కొనసాగింది. ఓపెనర్ కాంప్‌బెల్ (2)ను వికెట్ల వెనకాల అవుట్ చేసిన బుమ్రా..ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కెరీర్ అత్యుత్తమ ఘనత సాధించాడు. ఆ ఓవర్ రెండో బంతిని మిడిల్ వికెట్ మీదుగా సంధించి స్వింగ్ చేసిన బుమ్రా.. బ్రావో బంతిని ఆడేలా చేశాడు. దీంతో స్లిప్స్‌లో రాహుల్ అలవోక క్యాచ్ అందుకున్నాడు. తర్వాతి బంతికి బ్రూక్ (0) ఎల్బీ అయ్యాడు. అవుట్ స్వింగ్‌తో వచ్చిన బంతి బ్రూక్స్ ప్యాడ్లను ముద్డాడింది. బ్రూక్స్ సమీక్ష కోరినా ఫలితం సున్నా. రోస్టన్ ఛేజ్ (0) ఎదుర్కొన్న తొలి బంతినే ప్యాడ్లపైకి తెచ్చుకున్నాడు. బుమ్రా ఎల్బీపై నమ్మకంగా లేకపోయినా, కెప్టెన్ కోహ్లి సమీక్ష కోరాడు. బంతి నేరుగా ప్యాడ్‌కు తాకటంతో బుమ్రాకు హ్యాట్రిక్ వికెట్ లభించింది. బుమ్రా విధ్వంసానికి వెస్టిండీస్ 22 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. హెట్మయర్ (22), హౌల్డర్ (18), కార్న్‌వాల్ (14), కీమర్ రోచ్ (17) వెస్టిండీస్ స్కోరు వంద దాటేలా చేశారు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమి రెండు వికెట్లు తీసుకున్నాడు. జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
విహారి శతకం : అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి (111) కెరీర్ తొలి శతకం సాధించాడు. టెయిలెండర్ ఇషాంత్ శర్మ (57)తో కలిసి విహారి శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ ఇద్దరి మెరుపులతో తొలి ఇన్నింగ్స్‌లో తిరుగులేని స్కోరు సాధించింది. విహారి నిష్క్రమణ తర్వాత భారత్ 416 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ కెప్టెన్ హౌల్డర్ (5/77) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. స్పిన్నర్ కార్న్‌వాల్ మూడు వికెట్లు కూల్చాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 416/10
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : బ్రాత్‌వేట్ (సి) పంత్ (బి) బుమ్రా 10, కాంప్‌బెల్ (సి) పంత్ (బి) బుమ్రా 2, డారెన్ బ్రావో (సి) రాహుల్ (బి) బుమ్రా 4, బ్రూక్స్ (ఎల్బీ) బుమ్రా 0, రోస్టన్ ఛేజ్ (ఎల్బీ) బుమ్రా 0, హెట్యమర్ (బి) మహ్మద్ షమి 34, జేసన్ హౌల్డర్ (సి) రోహిత్ శర్మ (బి) ఇషాంత్ శర్మ 18, హామిల్టన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ శర్మ 5, కార్న్‌వాల్ (సి) రహానె (బి) మహ్మద్ షమి 14, కీమర్ రోచ్ (సి) మయాంక్ (బి) జడేజా 17, గాబ్రియల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (47.1 ఓవర్లలో ఆలౌట్) 117.
వికెట్ల పతనం : 1-9, 2-13, 3-13, 4-13, 5-22, 6-67, 7-78, 8-97, 9-117, 10-117.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 10.5-3-24-1, జశ్‌ప్రీత్ బుమ్రా 12.1-3-27-6, మహ్మద్ షమి 13-3-34-2, రవీంద్ర జడేజా 11.-1-7-19-1.
3: టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు కూల్చిన మూడో భారత బౌలర్ జశ్‌ప్రీత్ బుమ్రా. భారత్‌కు తొలుత హర్బజన్‌సింగ్, ఇర్ఫాన్ పఠాన్లు హ్యాట్రిక్ ఘనతలు సాధించారు. తాజాగా విండీస్‌పై విధ్వసంతో బుమ్రా ఆ ఇద్దరి సరసన చేరాడు.
నా 12 ఏండ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయాను. భారత్‌కు ప్రాతినిథ్యం వహించినప్పుడు సాధించే తొలి సెంచరీ మా నాన్నకు అంకితం ఇవ్వాలని ఆ రోజే అనుకున్నాను. ఇప్పుడు ఆ కల నేరవెరినందుకు సంతోషంగా ఉంది. రాత్రి నిద్ర పట్టలేదు. మంచి స్కోరును శతకంగా మారుస్తానా? లేదా? అనే సంశయం వెంటాడింది. ఇషాంత్ శర్మ నా కంటే మెరుగైన బ్యాట్స్‌మన్‌లా అనిపించాడు. అతడి సహకారంతోనే ఈ శతకం సాధ్యపడింది'
- హనుమ విహారి
ఈ రోజు మరువలేను. ఈ హ్యాట్రిక్ ఘనత కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్కుతుంది. బ్రావో, బ్రూక్స్ తర్వాత ఛేజ్ ఎల్బీపై నేను నమ్మకంగా లేను. బంతి ముందు బ్యాట్‌కు తగిలిందని నా భావన. కానీ కెప్టెన్ కోహ్లి సమీక్ష కోరేందుకు మొగ్గుచూపాడు. ఆ విధంగా హ్యాట్రిక్ ఘనత దక్కింది'
- జశ్‌ప్రీత్ బుమ్రా