Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19వ గ్రాండ్‌స్లామ్‌పై రఫెల్ గురి
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
న్యూయార్క్
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, రష్యాకు చెందిన మెద్వెదేవ్ ప్రవేశించారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2వ సీడ్ నాదల్ 24వ సీడ్ బెర్రెట్టినీపై... 5వ సీడ్ రష్యాకు చెందిన మెద్వెదేవ్ అన్‌సీడెడ్ డిమిట్రోవ్పై వరుససెట్లలో గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ 7-6(8-6), 6-4, 6-1 తేడాతో బెర్రెట్టినీ(ఇటలీ)పై గెలిచాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చివరకు నాదల్ పైచేయి సాధించి తుది పోరుకు అర్హత సాధించాడు. నాదల్-బెర్రెట్టినీల మధ్య జరిగిన తొలి సెట్ రసవత్తరంగా సాగింది. ఇద్దరు సమంగా తలపడటంతో ఆ సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే ఇక్కడ కూడా ఆసక్తికర సమరమే జరిగింగి. కాకపోతే చివరకు నాదల్ గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి సెట్‌ను గెలిచిన ఊపును రెండు, మూడు సెట్లలో నాదల్ కొనసాగించాడు. అయితే బెర్రిట్టినీ మాత్రం అద్భుతమైన ఏస్‌లతో ఆకట్టుకున్నాడు. రెండో సెట్‌ను నాదల్ 6-4తో గెలవగా, మూడో సెట్‌ను 6-1తో దక్కించుకోవడంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫలితంతా 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై నాదల్ గురిపెట్టాడు. ఇప్పటివరకూ 18 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్.. యుఎస్ ఓపెన్‌ను మాత్రం మూడుసార్లు మాత్రమే అందుకున్నాడు. 2017లో చివరిసారి యుఎస్ ఓపెన్‌ను గెలిచిన నాదల ఈసారి కూడా టైటిల్‌పై ధీమాగా ఉన్నాడు. టాప్ సీడ్ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్‌లు ఇప్పటికే ఇంటిముఖం పట్టడంతో నాదల్ యుఎస్ ఓపెన్‌ను సాధించడం కష్టం కాకపోవచ్చు.
రెండో సెమీఫైనల్లో రష్యాకు చెందిన మెద్వెదేవ్ 7-6(7-5), 6-4, 6-3 సెట్ల తేడాతో బల్గేరియాకు చెందిన అన్‌సీడెడ్ డిమిట్రోవ్ను చిత్తుచేశాడు. తొలి సెట్ గెల్చుకునేందుకు ఇరువురు హోరాహోరీగా తలపడినప్పటికీ ఆ సెట్‌ను టైబ్రేక్‌లో 7-5తో మెద్వెదేవ్ గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. ఇక రెండోసెట్లో ఒక బ్రేక్ పాయింట్, మూడో సెట్లో రెండు బ్రేక్ పాయింట్లు సాధించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి మెద్వెదేవ్ ప్రవేశించాడు. సోమవారం జరుగనున్న టైటిల్ పోరులో మెద్వెదేవ్ సీనియర్ ఆటగాడు, 2వ సీడ్ రఫెల్ నాదల్ తలపడనున్నాడు.