Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజేయంగా 72 బాదిన కెప్టెన్ కోహ్లి
- రాణించిన శిఖర్ ధావన్, దీపక్
- ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం
నవతెలంగాణ-మొహాలి
కెప్టెన్ విరాట్ కోహ్లి (72 నాటౌట్, 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగిన కోహ్లి మొహాలీ టీ20లో భారత్‌కు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. అజేయంగా 72 పరుగులు చేసిన కోహ్లి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా 2441 పరుగులతో రోహిత్ శర్మ (2434) వెనక్కి నెట్టాడు. 150 పరుగుల ఛేదనలో కెప్టెన్ కోహ్లి అజేయ జోరుకు తోడు ఓపెనర్ శిఖర్ ధావన్ (40) రాణించటంతో 19 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. శ్రేయాష్ అయ్యర్ (16 నాటౌట్) రాణించగా, రిషబ్ పంత్ (4) విఫలమయ్యాడు. క్వింటన్ డికాక్ (52) కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. తెంబ బవుమా (49) కీలక ఇన్నింగ్స్‌తో రాణించగా తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 149/5 పరుగులు చేసింది. కెరీర్ 22వ టీ20 అర్ధ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మొహాలీ విజయంతో టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. చివరి టీ20 ఆదివారం చెన్నైలో జరుగనుంది.
విరాట్ విజృంభణ : స్వల్ప ఛేదనలో టీమ్ ఇండియా ఆరంభంలో విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (12)ను కోల్పోయింది. రెండు సిక్సర్లతో ధనాధన్ అనిపించినా, వికెట్ నిలుపుకోలేదు. ఫెలుక్వయో బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (40, 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత్‌ను ఛేదన దిశగా తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. తొలుత విరాట్ నెమ్మదిగా ఆడినా, తర్వాత వేగం పెంచాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కోహ్లి సిక్సర్‌తో మెరువగా, ధావన్ బౌండరీ కొట్టాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మొహాలీలో తిరుగులేని రికార్డును కొనసాగించాడు శిఖర్. షంషి బంతిని లాంగ్ ఆన్‌లో భారీ షాట్ బాదిన ధావన్.. డెవిడ్ మిల్లర్ నమ్మశక్యం కాని క్యాచ్‌తో వికెట్ కోల్పోయాడు. గాల్లో ఎగురుతూ బౌండరీ లైన్ ముందు క్యాచ్ అందుకున్న మిల్లర్, ధావన్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. మిల్లర్ అథ్లెటిక్ క్యాచ్‌తో ధావన్, కోహ్లి సైతం ఆశ్చర్యపోయారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ (4) మరోసారి షాట్ సెలక్షన్లో తడబడ్డాడు. నాలుగు పరుగులకే వికెట్ కోల్పోయి నిరాశపరిచాడు.ఫెలుక్వయో ఓవర్లో వరుస బౌండరీలతో 40 బంతుల్లో కోహ్లి అర్థ సెంచరీ సాధించాడు. రబాడ బంతిని క్లాసికల్ క్లిక్‌తో కోహ్లి సిక్సర్‌గా మలిచాడు. శ్రేయాష్ అయ్యర్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లికి స్ట్రయిక్రొ టేట్ చేస్తూ ఛే దనను సులువు చేశా డు. కోహ్లి మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో చెలరేగటంతో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
డికాక్, బవుమా మెరిసినా.. : టాస్ నెగ్గిన కోహ్లి మంచు ప్రభావంతో ఛేదనకు మొగ్గు చూపాడు. కెప్టెన్ డికాక్ (52, 37 బంతుల్లో 8 ఫోర్లు) దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దాడిని ముందుండి నడిపించాడు. ఓపెనర్ హెండ్రిక్స్ (6) వేగంగా వికెట్ కోల్పోయినా.. డికాక్ జోరు తగ్గలేదు. తెంబ బవుమా (49, 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా డికాక్ చెలరేగాడు. 8 బౌండరీలతో 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన డికాక్ ప్రమాదకరంగా కనిపించాడు. బవుమా మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ధనాధన్ అనిపించాడు. హార్దిక్ ఓవర్లో వరుస బౌండరీలు బాదిన బవుమా సఫారీ స్కోరు వేగం పెంచాడు. నాయకుడిగా తొలి ఫిఫ్టీ అనంతరం మరో భారీ షాట్ ఆడిన డికాక్‌ను విరాట్ కోహ్లి కండ్లుచెదిరే క్యాచ్‌తో అవుట్ చేశాడు. పరుగెడుతూ క్యాచ్‌ను వేటాడిన కోహ్లి, ఎడమ చేతితో క్యాచ్ అందుకుని డైవ్ చేశాడు. డికాక్, బవుమా మెరుపులతో సఫారీ భారీ స్కోరు దిశగా సాగినా.. భారత బౌలర్లు సఫారీని వెనక్కి లాగారు. డుసెన్ (1)ను జడేజా రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. డెవిడ్ మిల్లర్ (18)ను బౌలర్లు స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ప్రిటోరియస్ (10), ఫెలుక్వయో (8) రాణించటంతో భారత్‌కు సఫారీ 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగల్గింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ (2/22) రాణించాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : హెండ్రిక్స్ (సి) సుందర్ (బి) దీపక్ 6, డికాక్ (సి) కోహ్లి (బి) సైని 52, బవుమా (సి) జడేజా (బి) దీపక్ 49, డుసెన్ (సి,బి) జడేజా 1, మిల్లర్ (బి) హార్దిక్ 18, ప్రిటోరియస్ నాటౌట్ 10, ఫెలుక్వయో నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : ( 20 ఓవర్లలో 5 వికెట్లకు) 149.
వికెట్ల పతనం : 1-31, 2-88, 3-90, 4-126, 5-129.
బౌలింగ్ : వాషింగ్టన్ 3-0-19-0, దీపక్ చాహర్ 4-0-22-2, నవదీప్ సైని 4-0-34-1, జడేజా 4-0-31-1, హార్దిక్ 4-0-31-1, కృనాల్ 1-0-7-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (ఎల్బీ) ఫెలుక్వయో 12, ధావన్ (సి) మిల్లర్ (బి) షంషి 40, విరాట్ కోహ్లి నాటౌట్ 72, రిషబ్ పంత్ (సి) షంషి (బి) ఫోర్టిన్ 4, శ్రేయాష్ అయ్యర్ నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (19 ఓవర్లలో 3 వికెట్లకు) 151.
వికెట్ల పతనం : 1-33, 2-94, 3-104.
బౌలింగ్ : రబాడ 3-0-24-0, అన్రిచ్ 3-0-27-0, ఫెలుక్వయో 3-0-20-1, ప్రిటోరియస్ 3-0-27-0, షంషి 3-0-19-1, ఫోర్టిన్ 4-0-32-1.