Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పసిడి పోరు నుంచి తప్పుకున్న యువ రెజ్లర్
-రజతంతో సరిపెట్టుకున్న దీపక్ పూనియా
-రాహుల్ అవారెకు కాంస్య పతకం
-ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్
నూర్ సుల్తాన్ (కజకిస్థాన్) : ' దేశానికి బంగారు పతకం నెగ్గాలని తపించాను. దురదృష్టశావత్తు అది సాధ్య పడలేదు. ఫైనల్స్ బౌట్ సమయానికి గాయం నుంచి కోలుకుంటానని ఆశించాను. కానీ కాలు వాపు ఇంకా తగ్గలేదు. తొలి బౌట్ సందర్భంగా గాయానికి గురయ్యాను. తుది పోరులో పోటీపడతానని కచ్చితంగా అనుకున్నాను, ఆటగాడి కెరీర్లో గాయాలు భాగమే' అని 20 ఏండ్ల యువ రెజ్లర్ దీపక్ పూనియా భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశాడు. దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి సాధించే అరుదైన అవకాశం ముంగిట నిలిచిన దీపక్ పూనియా.. ఆదివారం ఇరాన్ రెజ్లర్ హసన్ యాజ్‌దానితో తలపడాల్సి ఉంది. కానీ తొలి బౌట్ సందర్భంగా చవిచూసిన కాలు గాయం నుంచి దీపక్ కోలుకోలేదు. కాలు వాపు తగ్గకపోవటంతో పసిడి పోరు నుంచి దీపక్ పూనియా తప్పుకున్నాడు. పురుషుల 86 కేజీల విభాగంలో రజత పతకంతో స్వదేశానికి తిరిగి రానున్నాడు. 20 ఏండ్ల దీపక్ పూనియా సీనియర్ స్థాయిలో పోటీపడటం ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం ముంగిట నిలిచిన దీపక్ పూనియా, టోక్యో 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ' ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్, ఒలింపిక్స్ బెర్త్ సాధించటం గొప్ప గౌరవం. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనటంపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒలింపిక్స్‌లో నా దేశాన్ని నిరాశపరచనని వాగ్దానం చేస్తున్నాను' అని దీపక్ పేర్కొన్నాడు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఐదో పతకం సొంతం చేసుకుంది. వినేశ్ ఫోగట్, రవి కుమార్, బజరంగ్ పూనియా, దీపక్ పూనియాల తర్వాత మరో రెజ్లర్ నూర్ సుల్తాన్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెప లాడించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో రాహుల్ అవారె కాంస్య పతకం సాధించాడు. ఆదివారం కాంస్యం కోసం జరిగిన పోరులో 11-4తో అమెరికా రెజ్లర్ టేలర్ లీ గ్రాఫ్‌ను చిత్తుగా ఓడించాడు. పాన్ అమెరికా చాంపియన్‌ను సులువుగా పట్టేసిన రాహుల్ అవారె అలవోక విజయంతో కాంస్య పతకం సాధించాడు.