Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ శర్మకు వీవీఎస్ సలహా
నవతెలంగాణ, హైదరాబాద్
ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో టీమ్ ఇండియా స్వదేశీ సీజన్‌కు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల ఫ్రీడమ్ సిరీస్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఐదు రోజుల ఆటలో వరల్డ్ నం.1 టీమ్ ఇండియా సొంతగడ్డపై హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఫ్రీడమ్ సిరీస్‌లో 120 పాయింట్లూ సొంతం చేసుకునే ఆలోచనతో సమరానికి సై అంటోన్న కోహ్లిసేన.. విశాఖ టెస్టు వేదికగా ఆసక్తికర మార్పు చేయనుంది. వన్డే, టీ20ల్లో విధ్వంసక ఓపెనర్, భారీ స్కోర్ల మొనగాడు రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తోంది. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, గౌతం గంభీర్‌లు రోహిత్ శర్మను ఓపెనర్‌గా పంపించాలనే ఆలోచనకు జై కొట్టారు. భారత జట్టు మిడిల్ ఆర్డర్లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్. కెరీర్ తొలినాళ్లలో 1996-98 సమయంలో వీవీఎస్‌ను జట్టు మేనేజ్మెంట్ ఇన్నింగ్స్ ఆరంభించమని కోరింది. రోహిత్ శర్మ సైతం టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. ఇప్పుడు రోహిత్‌నూ జట్టు మేనేజ్మెంట్ అదే కోరుతోంది. ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా తన అనుభవాలు, చేసిన పొరపాట్ల నుంచి రోహిత్ శర్మకు ప్రత్యేకమైన సలహా ఇచ్చాడు వీవీఎస్ లక్ష్మణ్.
శైలి మార్చుకోవద్దు : రోహిత్ శర్మ అతిపెద్ద సానుకూలత అనుభవం. నాకు ఆ అనుభవం లేదు. నేను కేవలం నాలుగు టెస్టులే ఆడాను. కానీ రోహిత్ శర్మ 12 ఏండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు. విలువైన పరిణితి, సూపర్ ఫామ్ రోహిత్ సొంతం. ఓపెనర్‌గా పంపినప్పుడు చేసిన తప్పిదం నా ఆట శైలిలో మార్పులు చేసుకోవటం. ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవటం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అపారమైన విజయం అందించిన ఆలోచన సరళి, ఆట శైలి విషయంలో ఓపెనర్‌గా మార్పు చేసుకున్నాను. బ్యాటింగ్ టెక్నిక్‌లోనూ మార్పు చేసేందుకు ప్రయత్నించాను. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎల్లప్పుడూ ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్‌కు వెళ్లేవాడిని. సీనియర్ బ్యాట్స్‌మన్, కోచ్‌లతో సంప్రదింపుల తర్వాత ఆ శైలి మార్చుకున్నాను. 1997 వెస్టిండీస్ పర్యటనలో కోర్ట్లీ ఆంబ్రూస్ను ఎదుర్కొన్నప్పుడు, నా శైలిలో చేసుకున్న మార్పులు విపరీత ఇబ్బందికి గురి చేశాను. రోహిత్ శర్మ ఇటువంటి పొరపాటు చేయకూడదు.
సహజ శైలి ఆటను మరీ ఎక్కువగా మార్చేందుకు ప్రయత్నించినప్పుడు, ఆశించిన ఫలితం రాదు. ఫామ్ రిథమ్ కోల్పోయినప్పుడు మైండ్‌సెట్ దెబ్బతింటుంది. ఓపెనర్‌గా ఆడినప్పుడు నా రిథమ్ కోల్పోయాను. రోహిత్ శర్మ రిథమ్ ఆధారిత ఆటగాడు. అతడి శైలిలో ఎక్కువ మార్పులు వస్తే, కచ్చితంగా ఇబ్బందికి గురవుతాడు.
మానసికంగా ఆలోచన సరళిలో కొంత మార్పు అవసరమే, కానీ బ్యాటింగ్ టెక్నిక్ విషయంలో రాజీ పడకూడదు. మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మ కొనసాగించిన టెక్నిక్‌నే ఇక్కడా ఆడాలి. ఆఫ్ స్టంప్‌కు దూరం వెళ్లే బంతి వేటలో తొందరపాటు, బాడీకి దూరంగా ఆడకపోవటం, బౌన్సర్లను వదిలేయటం వంటి కనీస ప్రమాణాలను పాటించాలి. అదే మానసిక క్రమశిక్షణ, టెస్టుల్లో ఇది ఎంతో కీలకం. రోహిత్ శర్మకు మరో సానుకూలత, ఓపెనర్‌గా ఉపఖండపు పిచ్‌లపై ఆడటం. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులకూ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కొనసాగుతాడని సెలక్షన్ కమిటీ భరోసా ఇచ్చింది. నిజానికి ఇటువంటి భద్రత క్రికెటర్లకు దొరకటం చాలా అరుదు. దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడికి అనుభవం లేదు. కగిసో రబాడ ఒక్కడే ప్రభావశీలుడు. రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకుంటే అతడిని ఆపగలిగే బౌలర్ లేరు. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యం లేదు అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.