Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ పరిస్థితులపై సచిన్
న్యూఢిల్లీ : కాలంతో పాటు న్యూజిలాండ్ పిచ్ స్వభావంలోనూ ఎంతో మార్పు వచ్చిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్ కోసం కోహ్లిసేన సోమవారమే ఆక్లాండ్‌కు బయల్దేరింది. ఆస్ట్రేలియాలో జరుగనున్న 2020 టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని కోహ్లిసేన కివీస్ పర్యటనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. న్యూజిలాండ్ పిచ్‌లపై ఆడటం తొలి నుంచీ భారత బ్యాట్స్‌మెన్‌కు కత్తి మీద సామే. తాజా సిరీస్ నేపథ్యంలో కివీస్ పిచ్‌ల స్వభావం, కాలంతో వచ్చిన మార్పుపై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' ఇటీవల కాలంలో న్యూజిలాండ్‌లు ఎంతగానో మార్పు చెందాయి. న్యూజిలాండ్ పిచ్‌లపై ఇప్పుడు భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 2009 పర్యటనలో హామిల్టన్ పిచ్ స్పందన ఇంకా గుర్తుంది. నేపియర్, వెల్లింగ్టన్లతో పోల్చితే హామిల్టన్ ఎంతో భిన్నమైనది. మిగతా పిచ్‌లు మాదిరిగా కాకుండా హామిల్టన్ సున్నితంగానే స్పందించింది. కాలంతో పాటు నేపియర్ పిచ్ మారింది. (ఇక్కడ 2009లో గౌతం గంభీర్ 12 గంటల ఇన్నింగ్స్‌తో సెంచరీ కొట్టాడు). 1990లో నా తొలి పర్యటన నుంచి 2009లో నా చివరి పర్యటనలో తెలుసుకున్న విషయం ఏమిటంటే.. కివీస్ పిచ్‌లు కాలంతో పాటు మారిపోయాయి' అని టెండూల్కర్ అన్నాడు.
న్యూజిలాండ్ పిచ్‌లపై ఆ జట్టును ఓడించేందుకు భారత్‌కు అవసరమైన ఆయుధ సంపత్తి ఉందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ' భారత్‌కు నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ విభాగం ఉంది. న్యూజిలాండ్‌కు గట్టి పోటీఇవ్వగల ఆయుధ సంపత్తి భారత్ వద్ద ఉందని నమ్ముతున్నాను. అయితే వెల్లింగ్టన్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏ ఎండ్ నుంచి దాడి చేయాలో బ్యాట్స్‌మెన్ ముందుగా ఓ నిర్దారణకు రావాలి. ఎందుకంటే అక్కడ ఓ ఎండ్ నుంచి బలమైన గాలులు వీస్తాయి. గాలి వ్యతిరేక దిశలో సీమర్లతో బౌలింగ్ చేయించకూడదు. స్నిన్నర్లతో గాలికి వ్యతిరేకంగా బంతులు వేయించాలి. పేసర్లను గాలి వీస్తోన్న దిశలో బౌలింగ్ చేయించాలి. రోహిత్ శర్మకు న్యూజిలాండ్‌లో టీ20, వన్డేల్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులు రోహిత్‌కు తెలుసు. అయినా, టెస్టు క్రికెట్ అంటే టెస్టు క్రికెటే. అంతా పిచ్‌పై ఆధారపడి ఉంటుంది. పచ్చిక పిచ్‌లు తయారు చేస్తే సిరీస్‌లో కఠిన సవాల్ ఉంటుంది' అని సచిన్ అన్నాడు. క్రికెటర్ జీవితంలో గాయాలు భాగం. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అత్యుత్తమ ఆటతీరు అందించాలి. అత్యుత్తమంగా ఆడే క్రమంలో గాయాలు ఎదురవుతాయి. అదంతా క్రీడల్లో భాగమేనని మాస్టర్ పేర్కొన్నాడు.