Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రౌండ్లో ఫెదరర్, సెరెనా, జకోవిచ్
- మిక్స్డ్ డబుల్స్‌కు సానియా మీర్జా దూరం
- ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్టార్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మెల్‌బోర్న్‌లు ఎటువంటి సంచలనాలు నమోదు కాలేదు. టైటిల్ ఫేవరెట్లు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్, సెరెనా విలియమ్స్ అలవోక విజయాలు నమోదు చేశారు. ఫెదరర్, జకోవిచ్ టీ షర్ట్‌కు చెమట పట్టకుండా సులువైన విజయాలు అందుకున్నారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ పోటీ నుంచి నిష్క్రమించింది.
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)
రికార్డు గ్రాండ్‌స్లామ్ విజయం దిశగా అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ మరో అడుగు ముందుకేసింది. కెరీర్ 24వ గ్రాండ్‌స్లామ్ వేటలో మెల్బోర్న్లో సెరెనా విలియమ్స్ దూసుకెళ్తోంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ సులువుగా గెలుపొందింది. వరల్డ్ నం.70, స్లోవేకియా ప్లేయర్ తమర జిదన్సెక్పై సెరెనా విలియమ్స్ 6-2, 6-3తో విజయం సాధించింది. వరుస సెట్లలో దూకుడైన ఆటతీరుతో సెరెనా మూడో రౌండ్లో ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్, సెర్బియా వీరుడు నొవాక్ జకోవిచ్‌లు సైతం ముందంజ వేశారు. 6-1, 6-4, 6-1తో రోజర్ ఫెదరర్ రెండో రౌండ్లో క్రోయేషియా ఆటగాడిపై విజయం సాధించాడు. రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ 6-1, 6-4, 6-2తో జపాన్ ఆటగాడు టట్సుమా ఇటోపై వరుస సెట్లలో పైచేయి సాధించాడు.
సులువుగా ముందుకు : పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ వరుసగా రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించాడు. క్రోయేషియా ఆటగాడు ఫిలిప్ క్రజినోవిక్పై వరుస సెట్లలో విజయం సాధించాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో 14 ఏస్‌లతో మెరిసిన ఫెదరర్, ఏడు బ్రేక్ పాయింట్లు పొందాడు. మ్యాచ్‌లో ఫెదరర్ 89 పాయింట్లు సాధించగా, ఫిలిప్ 56 పాయింట్లు నెగ్గాడు. దిగ్గజంతో పోరులో క్రోయేషియా ప్లేయర్ కేవలం ఆరు గేముల్లో మాత్రమే మెరిశాడు. అలవోకగా 18 గేమ్‌లు గెల్చుకున్న ఫెదరర్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. ఫెదరర్ 11 సర్వ్‌లు నిలుపుకుని, ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ 6-1, 6-4, 6-2తో రెండో రౌండ్లో సులువైన విజయం నమోదు చేశాడు. టట్సుమా ఇటో (జపాన్) జకోవిచ్‌కు ఎక్కా పోటీ ఇవ్వలేకపోయాడు. 16 ఏస్‌లు సంధించిన జకోవిచ్ ఏకంగా ఐదు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మ్యాచ్‌లో ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడినా, ఇటో పోటీ ఇవ్వలేకపోయాడు. 13 సర్వ్‌లు నిలుపుకున్న జకోవిచ్ హార్డ్‌కోర్ట్‌లో తనెంత కఠినమైన ఆటగాడో మళ్లీ నిరూపించాడు. జకోవిచ్ 88 పాయింట్లు సాధించగా, ఇటో 53 పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. గ్రీస్ యువ సంచలనం స్టెఫానోసÊ సిట్సిపాస్ రాకెట్ పట్టకుండానే మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. జర్మనీ ఆటగాడు ఫిలిప్ పోటీ నుంచి తప్పుకోవటంతో సిట్సిపాస్ నేరుగా ముందుకెళ్లాడు. మిలోస్ రావోనిక్ 6-3, 6-4, 6-2తో క్రిస్టిన్ గారిన్పై గెలుపొందాడు. 32వ సీడ్ గారిన్ నుంచి రావోనిక్కు ఎటువంటి పోటీ ఎదురుకాలేదు. మారిన్ సిలిచ్ 6-2, 6-7(6-8), 3-6, 6-1, 7-6 (10-3) రెండో రౌండ్లో అతికష్టంమీద గెలుపొందాడు. బెనోట్ పైరె దాదాపు గెలిచినంత పని చేశాడు. నిర్ణయాత్మక ఐదో సెట్ టైబ్రేకర్‌లో వెనుకంజ వేసిన పైరె ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. జపాన్ సింహనాదం కిరు నిషికోరి సైతం సులువుగా నెగ్గాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో 6-4, 6-3, 6-4తో డాన్ ఎవాన్స్‌పై ఘన విజయం నమోదు చేశాడు. నిషికోరి రెండో రౌండ్లో 61 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. 14 సర్వ్‌లు నిలుపుకున్న నిషికోరి టోర్నీలో ముందంజ వేశాడు. అమెరికా ఆటగాడు శామ్ ఖుర్రే 7-6(7-2), 4-6, 6-4, 6-4తో బెరాంకిస్పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ మిల్‌మ్యాన్ 6-4, 7-5, 6-3తో హుబర్ట్ హుర్కాజ్పై వరుస సెట్లలో పైచేయి సాధించాడు. జాన్ మిల్‌మ్యాన్ మూడో రౌండ్ పోరులో దిగ్గజ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌తో తలపడనున్నాడు.
మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ సెరెనా విలియమ్స్ 6-2, 6-3తో తమరపై గెలుపొందింది. ఎప్పట్లాగే బలమైన సర్వ్‌లతో హడలెత్తించిన సెరెనా విలియమ్స్ నాలుగు బ్రేక్ పాయింట్లు గెల్చుకుంది. 8 సర్వ్‌లు నిలుపుకున్న సెరెనా విలియమ్స్, వరుసగా నాలుగు గేమ్‌లు సైతం గెల్చుకుని తొలి సెట్లోనే సత్తా చాటింది. మరో అమెరికా సీనియర్ ప్లేయర్ మడిసన్ కీస్ 7-6(7-3), 6-2తో రష్యా ప్లేయర్ రస్పై గెలుపొందింది. అమెరికా యువ సంచలనం, 15 ఏండ్ల మెరుపు కొకో గాఫ్ 4-6, 6-3, 7-5తో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. చెక్ రిపబ్లిక్ భామ పెట్రా క్విటోవా 7-5, 7-5తో స్పెయిన్ అమ్మాయి గిబర్ట్ను వరుస సెట్లలో ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ నవొమి ఒసాక (జపాన్) 6-2, 6-4తో చైనా అమ్మాయి జాంగ్‌ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది.
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ పోటీ నుంచి తప్పుకుంది. హౌబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ విజయంతో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చిన సానియా మీర్జా.. కుడి కాలి కండరాల ఒత్తిడితో మిక్స్డ్ డబుల్స్ నుంచి తప్పుకుంది. 33 ఏండ్ల సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగాల్సి ఉంది. అయినా, మహిళల డబుల్స్‌లో నదియా కొచనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగుతోంది.