Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత క్రికెటర్ సురేష్ రైనా
లక్నో : భారత్ సహా ప్రపంచ దేశాలు కనీవినీ ఎరుగని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ (కోవిడ్-19) వేగంగా వ్యాప్తి చెందటం, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం మరింత ఆందోళనకు దారితీస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ క్రీడాభిమానులు అభిమాన టోర్నీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2020 మార్చి 29 నుంచి ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఎనిమిది ప్రాంఛైజీలు సైతం ఆటగాళ్ల శిక్షణ శిబిరాలను మూసివేశాయి. రెండు నెలల పాటు చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో సాధన చేసిన సురేశ్ రైనా, రెండో బిడ్డకు జన్మనిచ్చిన భార్యతో కలిసేందుకు కాస్త ముందుగానే చెన్నైని వీడాడు. కరోనా వైరస్ కట్టడికి ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 52 లక్షల విరాళం అందించిన రైనా, ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో విరాట్ కోహ్లిని వెంటాడుతున్నాడు. ' ఈ పరిస్థితుల్లో జీవితం అత్యంత విలువైనది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎదురుచూడక తప్పదు. అందరం ప్రభుత్వ సూచనలను పాటించాలి, లేదంటే విపరీత పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది. బతుకు బాగుపడినప్పుడు, మనం ఐపీఎల్ గురించి ఆలోచన చేయవచ్చు. కరోనా వైరస్‌తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది' అని రైనా పీటీఐ వార్తాసంస్థతో అన్నాడు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎక్కువగా పిల్లలతో గడుపుతున్నాను. నా భార్య కోలుకుంటోంది. హాస్టల్ రోజుల నుంచి వంట చేయటం అలవాటు. ఇప్పుడు అదే పని చేస్తున్నాను. జీవితంలో క్రికెట్ కంటే విలువైనవి ఉన్నాయని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతోందని రైనా అన్నాడు.
ధోని దాహంతో ఉన్నాడు : భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో కలిసి సురేష్ రైనా చెన్నై సీఎస్కే శిక్షణ శిబిరంలో ఉన్నాడు. ధోనితో కలిసి కొన్ని వారాలు సాధన చేశాడు. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ తర్వాత ధోని ఇంకా మైదానంలో అడుగుపెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధోని సాధనపై రైనా పలు విషయాలు చెప్పాడు. ' క్యాంప్ చక్కగా జరిగింది. నేను క్యాంప్‌లో రెండు నెలలు ఉన్నాను. ధోనితో విలువైన సమయం గడిపే అవకాశం లభించింది. నెట్స్‌లో మహి చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ధోనిలో యువకుడి తరహా దాహం కనిపించింది. ఓ సెషన్లో ఏకంగా మూడు గంటల పాటు ఏకధాటిగా ప్రాక్టీస్ చేశాడు. ప్రతి ఏడాది దీపావళి, హౌళి పండుగలు జరుపుకున్నట్టే 2011 ప్రపంచకప్‌నూ జరపుకుంటామని' రైనా అన్నాడు.