Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రెయిగ్ బ్రాత్‌వేట్ అర్థశతకం
- రాణించిన ఛేజ్, డావ్రిచ్
సౌతాంప్టన్ (ఇంగ్లాండ్)
విజ్డెన్ తొలి టెస్టుపై విండీస్ పట్టు బిగిస్తోంది. బంతితో నిప్పులు చెరిగి ఇంగ్లాండ్‌ను 204 పరుగులకే పరిమితం చేసిన కరీబియన్లు.. ఇప్పుడు బ్యాట్‌తో సత్తా చాటుతున్నారు. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వేట్ (65, 125 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాత్‌వేట్ ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు టీ విరామ సమయానికి వెస్టిండీస్ 235/5తో భారీ స్కోరు దిశగా సాగుతోంది. రోస్టన్ ఛేజ్ (27 బ్యాటింగ్, 115 బంతుల్లో 3 ఫోర్లు), డావ్రిచ్ (30 బ్యాటింగ్, 48 బంతుల్లో 5 ఫోర్లు) ఆరో వికెట్‌కు అభేద్యంగా 49 పరుగులు జోడించారు. వెస్టిండీస్ 31 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ స్పిన్నర్ బెస్, పేసర్ అండర్సన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బ్రాత్‌వేట్ సూపర్ : సౌతాంప్టన్‌లో విండీస్ మెరుపులు కొనసాగుతున్నాయి. ఇంగ్లీష్ పరిస్థితుల్లో కరీబియన్లు సొంతగడ్డపై ఆడుతున్న అలవోకగా రెచ్చిపోతున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 57/1తో తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన వెస్టిండీస్ అలవోకగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓపెనర్ బ్రాత్‌వేట్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. షారు హౌప్ (16)తో కలిసి 59 పరుగులు జోడించిన బ్రాత్‌వేట్.. బ్రూక్స్ (39, 71 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి ఆధిక్యానికి బాటలు పరిచాడు. మూడు ఫోర్లతో 113 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన బ్రాత్‌వేట్, తర్వాత మరో మూడు ఫోర్లతో చెలరేగాడు. బ్రూక్స్‌తో కలిసి బ్రాత్‌వేట్ వేగంగా పరుగులు సాధించాడు. 140/2తో పటిష్టంగా కనిపించిన విండీస్‌ను స్పిన్నర్ బెస్ దెబ్బకొట్టాడు. పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుని, కీలక వికెట్లు కూలగొట్టాడు. దీంతో 186/5తో వెస్టిండీస్ సైతం ఇక్కట్లో పడింది. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్), వికెట్ కీపర్ డావ్రిచ్ (30 నాటౌట్)లు ఆరో వికెట్‌కు విలువైన 49 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235/5తో కొనసాగుతోంది. విండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బ్లాక్‌వుడ్ (12), హౌప్ (16)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ ఇద్దరినీ స్పిన్నర్ బెస్ పెవిలియన్‌కు పంపించాడు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 204 ఆలౌట్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : క్రెయిగ్ బ్రాత్‌వేట్ (ఎల్బీ) స్టోక్స్ 65, జాన్ కాంప్‌బెల్ (ఎల్బీ) అండర్సన్ 28, షారు హౌప్ (సి) స్టోక్స్ (బి) బెస్ 16, షమ్రా బ్రూక్స్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 39, రోస్టన్ ఛేజ్ బ్యాటింగ్ 27, బ్లాక్‌వుడ్ (సి) అండర్సన్ (బి) బెస్ 12, షేన్ డావ్రిచ్ బ్యాటింగ్ 30, ఎక్స్‌ట్రాలు : 18, మొత్తం : (80 ఓవర్లలో 5 వికెట్లకు) 235.
వికెట్ల పతనం : 1-43, 2-102, 3-140, 4-173, 5-186.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 19-9-42-2, జోఫ్రా ఆర్చర్ 17-3-47-0, మార్క్‌వుడ్ 16-2-54-0, బెన్ స్టోక్స్ 9-4-24-1, డామ్ బెస్ 19-5-51-2.
బ్రాడ్‌కు కోపమొచ్చింది!
ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు కూల్చిన జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ది రెండో స్థానం. గత దక్షిణాఫ్రికా పర్యటన, యాషెస్ సిరీస్‌లలో సైతం బ్రాడ్ వికెట్ల వేటలో ముందున్నాడు. అయినా, సౌతాంప్టన్‌లో తొలి టెస్టుకు స్టువర్ట్ బ్రాడ్‌ను పెవిలియన్‌కు పరిమితం చేశాడు స్టోక్స్. తుది జట్టులో చోటు దక్కకపోవటంపై స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. నేషనల్ చీఫ్ సెలక్టర్ ఎడ్స్మిత్తో నేరుగా తేల్చుకునే ప్రయత్నం చేశాడు. ' నేను భావోద్వేగానికి లోనవటం లేదు. కానీ గత రెండు రోజులు కఠినంగా సాగాయి. గత రెండేండ్లుగా అత్యుత్తమ ప్రదర్శన చేశాను. అయినా, బెంచ్‌కు పరిమితం చేయటం అర్థం కావటం లేదు. నిరాశకు లోనయ్యాను, ఆగ్రహం చెందాను. ఎడ్ స్మిత్‌తో నా భవిష్యత్‌పై మాట్లాడాను. 13 మంది ఎంపిక వరకే నా పాత్ర. పిచ్‌కు అనుగుణంగా తుది జట్టు ఎంపిక జరిగింది. అందులో నా పాత్ర లేదని చెప్పాడు. తుది జట్టులో చోటుకు నేను అర్హుడిని. అలాగని మిగతా బౌలర్లకు అర్హత లేదని కాదు. అందరికీ తుది జట్టులో నిలిచే అర్హత ఉంది. తుది జట్టులో చోటు నిరాకరణను తట్టుకోలేకపోతున్నాను' అని స్టువర్ట్ బ్రాడ్ తెలిపాడు.