Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక సంవత్సరం గడిచిపోయింది ఈ కరోనా మనల్ని వెంటాడటం మొదలుపెట్టి. మధ్యలో కొంత తగ్గుముఖం పట్టినట్లు కనపడ్డా, ఇప్పుడు తిరగబెట్టింది. ప్రపంచమంతా ఎంతో అల్లకల్లోలం చెలరేగింది. లక్షల మందిని కబళించింది. కోట్లాది మందిని మానసిక, ఆర్థిక క్షోభకు గురిచేసింది. చాలా చాలా పాఠాలనూ బోధించింది. అయినా గుణపాఠాలు తీసుకునేందుకు మనం సిద్ధం కాలేదు. దారీ తెన్నూ లేని, దిక్కూ మొక్కూ లేని జీవాల్లా ప్రజలు తల్లడిల్లి పోవడాన్ని మనం చూస్తున్నాం.
వెంటాడుతున్నది వైరస్ అని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ ప్రకృతి అసమతుల్యత నుండి అనివార్యంగా జనించిన వైరస్ తన సహజ విస్తరణలో భాగంగానే వ్యాప్తి పెరుగుతున్నది. ఇప్పుడు చర్చించాల్సింది దాన్ని ఎదుర్కోవడంలో, దాని బారిన పడకుండా ఉండటంలో మనం చూపుతున్న శ్రద్ధాసక్తులు, వ్యూహాలు ఏమిటన్నది మన ముందున్న ప్రశ్న. తరతరాలుగా మానవ సమాజాన్ని నియంత్రిస్తూ, అనేక నియమ నిబంధనలతో పరిపాలిస్తున్న పాలనా కర్తలు, ఇప్పుడు నిర్వహిస్తున్న బాధ్యత గురించి చర్చించాల్సిన సమయం వచ్చింది. వైరస్ మూలంగా వచ్చే శారీరక కష్టాలకంటే పరిపాలకుల ఆలోచనలే ప్రజలను నిజంగా అనేక ఇక్కట్లకు గురిచేస్తున్నది. ప్రజల పట్ల బాధ్యత వహించగల పాలకులు కొరవడటం వల్లనే అనేక ప్రమాదాలు జరిగిపోతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవటం అత్యంత ముఖ్యమైన విషయమే. కానీ, ప్రాణంతో పాటుగా బతుకును కొనసాగించటమూ సవాలుగా మారిన సందర్భంలో పరిష్కారాలను ఎవరు సూచించాలి. లక్షలాది, కోట్లాది ప్రజల జీవన్మరణ సమస్యగా బతుకుబండి లాగటం మారినపుడు ఏ ఒక్క ఆశనూ, భరోసానూ అందివ్వలేని వ్యవస్థ ఎందుకు?
ఒకవైపు వేలాది మంది రైతులు తమ సమస్యను పరిష్కరించమని ఐదు నెలలుగా రోడ్లపైనే నివసిస్తూ ఆందోళన చేస్తున్నా వారి గురించి ఆలోచించలేని నేతలూ ప్రభుత్వాలూ, సేవకులూ మనకెందుకు! ఒకవైపు ప్రకృతి విలయ తాండవమాడుతున్న వేళ కార్మికుల హక్కులను కాలరాసి దోపిడి శక్తులకు దోచిపెట్టే సేవాతత్పరులు పాలకులుగా వుండటం వైరస్ కన్నా అత్యంత ప్రమాదకరమైనదిగా కనపడుతున్నది. ప్రజలకు బతుకుదెరువు ఒక సవాలు. దీనికి మార్గాన్ని చూపినవాడే నిజమైన నాయకుడు, పాలకుడు. కానీ ఆపద సందర్భాన్ని కూడా తన ప్రయోజనానికి, అధికార బలానికి ఉపయోగించుకోవాలనే ఆలోచన కరోనా కన్నా విషతుల్యమైనది.
ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలకన్నా వ్యాపారుల ఆదాయాలు, లాభాలు ముఖ్యంగా మారింది. రాజకీయాలు, అధికారం చేజిక్కించుకోవడమూ అందుకోసం వేయాల్సిన ఎత్తులు, జిత్తులు వీటిపైన ప్రధాన దృష్టి పెట్టిన పాలకులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ గురించిన చర్చను తీసుకువచ్చిందా? విపత్తుల నుంచి ప్రజలు ఎలా బయటపడాలి. ప్రభుత్వం ఏం చేస్తే సవాళ్లను ఎదుర్కోవచ్చు అనే విషయాలను, ఎన్నికల సందర్భంగా కానీ రాజకీయ చర్చ సందర్భంగా కానీ మాట్లాడిందా? లేదు. రెండు వేల కోట్లు కావాలి వాక్సిను ఉత్పత్తిని పెంచటానికని కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నా, పట్టించుకోని ప్రభుత్వం వేల కోట్లు ఎన్నికల్లో గెలవటం కోసం ఖర్చు చేసింది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతూ ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది.
దాని పర్యవసానంగానే నేడు ఉపద్రవం తిరగదీసింది. ప్రజల పట్ల బాధ్యత లేని పాలనాధిపతుల ఫలితంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. వెంటాడుతున్న వైరస్ కనబడినా నిజంగా వెంటాడేది పాలకులే. వారి విధానాలే..!!