Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో'' అని సినారె అన్నట్లు, రామప్ప ఆలయ రమణీయతను చూడడానికి కోట్ల కన్నులు చాలవు. ఆ సౌందర్యాన్ని చూసి మోగని గుండెలు ఉండవు. తెలుగునేలపై, అందునా తెలంగాణ మట్టిపై గొప్ప గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడంగా, రామప్ప పేరు విశ్వవీధుల్లో నేడు మారుమోగుతోంది. మన రామప్ప ఆలయం నేడు తాజ్ మహల్, ఎర్రకోట వంటి విశిష్ట విఖ్యాత కట్టడాల సరసన సగర్వంగా చేరింది.
వేల ఏండ్ల మానవ ప్రయాణంలో కొనసాగింపు ఓ ప్రధాన భాగం. ఆ కొనసాగింపును ప్రతిఫలిస్తుంది చారిత్రక వారసత్వ సంపద. దానిని కాపాడుకోవడం ప్రతి జాతి కర్తవ్యం. నడచివచ్చిన ఆనవాళ్ళను పదిలంగా పరిరక్షించుకోవటం వర్తమానానికీ, భవిష్యత్తుకీ అవసరం. గతం గత: అనే మాట చరిత్రకి వర్తించదు. గతాన్ని తలపోయడం, గతం అడుగుజాడల్ని మరచిపోకుండా ఉండటం మానవాళి పురోగమనానికి తప్పనిసరి. గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. ఆదిమానవుల అడుగుజాడల అన్వేషణకి ఈ సూత్రమే మూలం. వర్తమానానికీ, గతించిన గతానికీ విడదీయరాని లంకె వుంది. అది చారిత్రక కట్టడాల్లో, ప్రకృతి విలసిత నదుల్లో, అడవుల్లో, పర్వతాల్లో, సముద్రాలతో ముడిపడివుంది. అందుకే చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న జిజ్ఞాస ఇరవయ్యో శతాబ్దంలో మరింతగా ప్రబలింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితిలో అంతర్భాగమైన యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడాల సంరక్షణకు పూనిక వహించింది. ఇందుకోసం 'ది వరల్డ్ హెరిటేజ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ వారసత్వ హౌదా పొందడానికి తగిన అర్హతలున్న ప్రాంతాలని గుర్తించి, వాటిని కాపాడుకునేందుకు చేయూత నిస్తోంది.
''ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో'' అని సినారె అన్నట్లు, రామప్ప ఆలయ రమణీయతను చూడడానికి రెండు కండ్లు చాలవు. ఆ సౌందర్యాన్ని చూసి మోగని గుండెలు ఉండవు. తెలుగునేలపై, అందునా తెలంగాణ మట్టిపై గొప్ప గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడంగా, రామప్ప పేరు విశ్వవీధుల్లో నేడు మారుమోగుతోంది. మన రామప్ప ఆలయం నేడు తాజ్ మహల్, ఎర్రకోట వంటి విశిష్ట విఖ్యాత కట్టడాల సరసన సగర్వంగా చేరింది. హైదరాబాద్ నగరంలోని చార్మినార్, గోల్కొండ కోటలకు కూడా ప్రపంచ వారసత్వ హౌదా గుర్తింపు ఇవ్వాలని చరిత్ర పట్ల ప్రేమ, బాధ్యతలున్న పురాతత్వవేత్తలు, చరిత్రకారులు, మేధావులు కోరుతున్నారు. కేవలం చారిత్రక వారసత్వ కట్టడాలనే కాదు, ప్రకృతి సహజమైన సరస్సుల్నీ, నదుల్నీ, పర్వతాల్నీ కాపాడుకోవాలి. అభివృద్ధి పేరిట విధ్వంసం, పురోగతి పేరిట గత కట్టడాల కూల్చివేత చరిత్రపై దాష్టిక ప్రదర్శన అవుతుంది. ఇది వివేకవంతులైన పాలకులు చేయాల్సిన పనికాదు.
కరెంటు లేని రోజుల్లో, ఎలాంటి యంత్ర పరిజ్ఞానం లేని కాలంలో మానవ శ్రమతో నిర్మించిన మహా కట్టడాల్ని కాపాడుకోవడం గర్వకారణం. అవి ఆయా ప్రాంతాల చరిత్రకే తలమానికం. పురావైభవానికి నిదర్శనం. వాటిని కాపాడుకోవడమంటే చరిత్రను నిలుపుకోవడమే కాదు. ఒకనాటి మానవుల శ్రమని గుర్తించి గౌరవించడం కూడా. చరిత్రని తిరిగి నిర్మించలేం. కానీ వాటి ఆనవాళ్ళుగా మిగిలిన కట్టడాల్ని పరిరక్షించుకోగలం. ప్రముఖ చరిత్రకారులు డి.డి.కోశాంబి అన్నట్టు 'చరిత్రలో ఏదీ శాశ్వతంగా అంతరించదు, దాని అవశేషాలు ఏదో రూపంలో కొనసాగుతాయి'. అవశేషాలుగానే కాదు మానవుని ఊహాశాలితకీ, సృజనాత్మకతకీ, కౌశలానికీ దాఖలాగా నిలిచే చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదల్ని కాపాడుకుంటూ, వాటిని పటిష్టమైన రీతిలో సంరక్షించుకుంటూ ముందుతరాలకు అందజేయాలి. ఒక తరం నుంచి మరోతరం అంది పుచ్చుకుంటూ సాగించే ప్రయాణానికి వారధిగా నిలిచే గొప్ప కానుకలు ఈ కట్టడాలు. కనుక వారధిని ధ్వంసం చేయాలనుకోడం అసమంజసం, అవివేకం.