Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పక్షులన్నిటిలో సురక్షితమైన, సుందరమైన గూడును నిర్మించుకునేది ఈ పిచ్చుకలు మాత్రమే. ఈ పిచుకల జంట ప్రయాణమూ ముద్దుగొలుపుతుంది. మనం పండించే ధాన్యపు గింజలు, చిన్న చిన్న క్రిములు, కీటకాలు వాటి ఆహారం. మనం పండించే పంటలపై పురుగులను తిని మేలు చేస్తాయి. కానీ నేటి మన వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాల వల్ల, పురుగుమందుల వాడకం పెరిగిపోవడం వలన వాటికీ ఆహార కల్తీ ప్రాణాంతకంగా తయారైంది.
రెండు రెక్కలు, రెండు కాళ్ళు, రెండు కండ్లు, నివసించే గూళ్ళు, జీవన గమనాలు అన్నీ మన తీరే. కానీ అవి పిచ్చుకలు. మనం మనుషులం. మెదడు పనితీరు మనల్నిలా మార్చింది. అయినా మనమూ పిచ్చుక సహవాసులమే. ఒక్క పిచ్చుకలు మాత్రమే కాదు, అనేకానేక పురుగూ, పుట్రా, జంతు పక్షాదుల సహవాసి మానవుడు. సమస్త జీవావరణ నిలయమే ఈ నేల. ఈ సహజీవన సమతుల్యంలోనే మనుగడ సాగుతుంది. అది దెబ్బతింటే ఆవరణమే చెడిపోతుంది. చెడిపోవడమంటే అతరించడమే. మనిషి మనుగడ కూడా ఆవరణ రక్షణతోనే ఆధారపడి వుంటుంది. ఒకదానిపై మరోటి ఆధారపడి కొనసాగటమే ప్రకృతి నియమం. నాగరికత పెరిగిన కొద్దీ మానవ చర్యలు ప్రకృతి విధ్వంసానికి దారి తీయడాన్ని మనం చూస్తున్నాం. మానవ సమూహం దాన్ని అభివృద్ధిగా భావిస్తోంది. కానీ అందులో ప్రమాదమూ పొంచి వుంటోంది. ఇదొక సమాజిక, రాజకీయార్థిక సైన్సు అంశం.
ఇప్పుడు మాత్రం పిచ్చుకలను గూర్చి కొంత మాట్లాడుకుందాం. ఎందుకంటే అవీ అంతరించిపోతున్న స్థితిలో వున్నాయి. వాటికి ఆపద వచ్చింది. పిచ్చుకలు చూడని బాల్యం వుండదనుకుంటా! పిచ్చుకలను ముద్దుగా జాషువా గిజిగాడని పాడుకున్నారు. నా చిన్నతనంలోనైతే మా పెంకుటింటి వసారా చివరన వాసానికి పిచ్చుక గూడుండేది. ఎప్పుడూ రెండు పిచ్చుకలు అల్లరల్లరి చేసేవి. గిజిగాడు చాలా చిన్నగా వుంటాడు. గోధుమ వర్ణంలో, ముదురు రంగు చారికలు కలిగి అందంగా కనిపిస్తాడు. మగ పిచ్చుక కంటి దగ్గర, మెడ చుట్టూ నల్లగా కాటుక తీర్చినట్లు ముచ్చట గొల్పుతుంది. ఆడ పిచ్చుక మాత్రం సాదాసీదాగానే వుంటుంది. వాటి అరుపులు, రయ్యిన తిరగటాలు, ప్రతి క్షణమూ కదలికలోనే వుండే వాటి గమనాలు బాల్యంలో మాకొక ప్రేరణగా, గమ్మత్తుగా అనిపించేది. ఈ పిచ్చుకలు మొత్తం దేశంలోనే కాదు, బర్మాలాంటి ప్రాంతంలో ఎక్కువగా మనం చూస్తాం. ఇంటి చూరులలో, తుమ్మ చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, తీగలకు వేలాడే గూళ్ళలో అవి నివాసముంటాయి. వాటి గూడు నిర్మాణ కౌశల్యం చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. అవేమీ ఇంజనీరింగు విద్యనభ్యసించలేదు కానీ సహజాతంగా అబ్బిన ఆ విద్య వాటికే సొంతం. అయితే గూడును మగ పిచ్చుకలు మాత్రమే నిర్మిస్తాయి. ఒక్కొక్క పోచను ఏరుకొచ్చి చాలా భద్రమైన, అందమైన గూడును అల్లుకుంటాయి. అయితే గూడును మగ పిచ్చుక అల్లిత తర్వాత ఆడ పిచ్చుక గృహప్రవేశం చేస్తుంది. గుడ్లు పెట్టడం, వాటిని పొదిగి పిల్లలను కనడం, పిల్లలకు ఆహారాన్ని అందించి పెంచడం ఆడ పిచ్చుక చేస్తుంది. ఇదీ వాటి మధ్య పని విభజన.
గిజిగాడి గూడు నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో మధురంగా గానం చేశారు మన మహాకవి జాషువాగారు. ''తేలిక గడ్డిపోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటుయ్యాల గృహంబు, మానవులకేరికి సాధ్యం గాదు, దానిలో జాలరు అందులో జిలుగుశయ్యలు నంతి పురంబులొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా! గిజిగాడా! నీడజా!'' అని వర్ణించారు. పక్షులన్నిటిలో సురక్షితమైన, సుందరమైన గూడును నిర్మించుకునేది ఈ పిచ్చుకలు మాత్రమే. ఈ పిచుకల జంట ప్రయాణమూ ముద్దుగొలుపుతుంది. మనం పండించే ధాన్యపు గింజలు, చిన్న చిన్న క్రిములు, కీటకాలు వాటి ఆహారం. మనం పండించే పంటలపై పురుగులను తిని మేలు చేస్తాయి. కానీ నేటి మన వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాల వల్ల, పురుగుమందుల వాడకం పెరిగిపోవడం వలన వాటికీ ఆహార కల్తీ ప్రాణాంతకంగా తయారైంది. ఇక ఇప్పుడు పట్టణాలు, పల్లెల్లో సెల్ టవర్స్, కేబుల్ టవర్స్ పెరిగిపోయాయి. వాటి నుండి వచ్చే మాగటిక్ ఎలక్ట్రిక్ వేవ్స్ కూడా పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. అంతే కాదు, ఇప్పుడు కాంక్రీటు ఇండ్లల్లో వాటికి స్థానమే లేకుండా పోయింది.
అందరూ బాగుంటేనే మనమూ బాగుంటామనే ఆలోచనలు ఇగిరిపోయి, నేను బాగుంటే చాలనుకునే స్వార్థపూరిత వ్యాపారధోరణి ప్రబలడంతో అనర్థాలు మరింత పెరుగుతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే పెద్ద పెద్ద వ్యాపార వర్గాలు మొత్తం మానవ జీవ సమూహాల గురించి ఎందుకు ఆలోచిస్తాయి? పర్యావరణంలో జీవన సమతుల్యత లోపించడం పెరిగిపోతున్న సందర్భంలో ముచ్చటైన మన సహవాసులయిన పిచ్చుకల గురించి ఆలోచన చెయ్యాలి. మార్చి 20ని పిచ్చుకల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రకృతిలో ఎవరిపాలును వారికి వొదిలేయాలి. ఎదుటి వాళ్ళదంతా నాకే కావాలన్న దురాశను తెగ నరికేయాలి. పిట్టలు బతకాలి. మనమూ బతకాలి.