Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంవత్సరంలో 10, 11 నెలలు స్కూల్‌కి వెళ్ళి అలసి, విసిగిన ఆ పసి మనసులకు కాస్త ఆటవిడుపు కావాలి. మండే ఎండలకు చల్లని చెట్ల నీడన సేద తీరాలి. సాయంత్రానికి ఏ చెరువు గట్టునో, కొలను దగ్గరో చేరి అలసిపోయేవరకు ఆడుకోవాలి. అమ్మమ్మ, నానమ్మ దగ్గర చేరి గారాలు పోతూ ఇక ఒక్క మెతుకు కూడా పొట్టలో పట్టదు అన్నంత ఆబగా వారి చేతి గోరుముద్దలు తినాలి. రాత్రికి తాతయ్య పక్కన చేరి అంతుచిక్కని ఏ పేదరాశి పెద్దమ్మ కథనో వింటూ తెలియకుండానే నిద్రలోకి జారుకోవాలి. కానీ ఈ కాలం పిల్లల్లో ఎంతమంది వేసవి సెలవుల్లో ఇలాంటి అనుభూతులు పొందుతున్నారు?
వేసవి సెలవులు వచ్చాయి. ఇక పిల్లలకు పండగే. కానీ ఆ మాట ఇప్పుడు వర్తించదు. గత దశాబ్ద కాలంగా వేసవి సెలవులకు అర్ధం మారిపోయింది. వేసవి వస్తుందంటే పిల్లలను ఏ సమ్మర్ కోచింగ్‌లో జాయిన్ చెయ్యాలి? ఏయే సమ్మర్ క్యాంపులు దగ్గర్లో వున్నాయి, వాటిలో ఏం నేర్పిస్తున్నారు? అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటే, పిల్లలేమో ఏ కార్టూన్ సిరీస్ కొత్తగా వచ్చింది, మిగతా ఫ్రెండ్స్ కంటే తానే ముందు ఆ కార్టూన్ సిరీస్ చూసి వాళ్ళకి స్టోరీ చెప్పేయాలి అనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఎవరి ఆలోచన వారిది! ఎవరి ఉత్సాహం వారిది!!
ఈ వేసవి సెలవుల్లో పిల్లల అల్లరిని ఎలా భరించాలిరా బాబూ అనుకునే తల్లిదండ్రులు, తమ స్కూలు రోజుల్లోని వేసవి సెలువుల ఎలా గడిచాయో గుర్తుతెచ్చుకోండి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆడుకుని, మధ్యాహ్నం పూట ఏ పుస్తకమో చదువుకుంటూ, కొద్దిసేపు నిద్రపోయే పిల్లలు ఇప్పుడు చూద్దామన్నా కనిపించరు. ఇవన్నీ ఒకప్పటి అలవాట్లు, ఇప్పుడు ఎలా కుదురుతై అనుకోవడం కంటే, ఎందుకు మన పిల్లలకి కూడా ఇలా అలవాటు చేయకూడదు?
వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులు తల్లిదండ్రులుకు కొంత ఊరట కలిగించే విషయం. ఫిజికల్ ఆక్టివిటీస్‌తో పాటు డ్రాయింగ్, పెయింటింగ్ లాంటివి పిల్లల్ని ఆకర్షించే అంశాలు. తెగ హడావుడి చేసే కొన్ని సమ్మర్ క్యాంపులు కూడా లేకపోతేదు. అలాంటి వాటిల్లో పిల్లల్ని జాయిన్ చేసే ముందు కొన్ని నెలలో, ఒకట్రెండు సంవత్సరాలలో నేర్చుకునే కోర్సులను నెలా, రెండు నెలల్లో పిల్లలు ఎంత వరకు నేర్చుకోగలరు అని ఒక్కసారి ఆలోచించండి! సమ్మర్ క్యాంపులు కూడా రోజులో రెండు మూడు గంటలు మాత్రమే వుంటాయి. మిగతా టైమంతా ఏం చేయాలో తోచదు పిల్లలకు. వీళ్ళకు సమ్మర్ క్యాంపులు మాత్రమే సూళ్ళకు ప్రత్యామ్నాయం కాకూడదు.
అలా అని ఇంట్లోనే కూర్చోబెట్టి సెల్‌ఫోన్ చేతికిచ్చినా ప్రమాదమే. ఆ ఫోన్ పట్టుకుని గంటల తరబడి చూస్తూ కళ్ళు ఎంతగా అలసిపోతున్నాయో కూడా పట్టించుకోవట్లేదు. శరీరానికి వ్యాయామం, మెదడుకి ఆలోచించే శక్తి... రెంటినీ కోల్పోతున్నారు నేటి చిన్నారులు. శరీరానికి తగినంత వ్యాయామం లేక ఈ రెండు నెలల్లోనే బరువు పెరిగేవారూ లేకపోలేదు. వ్యాయామం, యోగా అలవాటు చేయడానికి ఈ వేసవి సెలవులు మంచి సమయం. ఒక్కసారి ఇవి అలవాటు అయ్యాయంటే క్రమం తప్పకుండా చేస్తుంటారు పిల్లలు.
పుస్తకాలకు మించిన మంచి వ్యాపకం పిల్లలకు మరోటి వుండదు. మహనీయుల జీవిత కథల్లాంటి ఎన్నో మంచి పుస్తకాలు బహుమతిగా ఇచ్చి చదివించాలి. ఒక్కో పుస్తకం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఆ పుస్తకాల్లోని సారాంశాన్ని స్టోరీగా చెప్పమనడం, ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తంలో ఎన్ని పుస్తకాలు చదువుతారో అన్ని బహుమతులు ఇస్తామని టార్గెట్లు పెడితే పిల్లలు ఇంకా ఉత్సాహపడతారు. అందుకోబోయే బహుమతికోసం ఎదురు చూస్తారు కూడా. ఇప్పటి పిల్లలకి డబ్బు విలువ కూడా బాగా తెలుసు! ఇచ్చే బహుమతి డబ్బు రూపంలో ఇస్తామని చూడండి... ఈ డబ్బు వారి పాకెట్ మనీగా కూడా ఉపయోగపడుతుందని చెప్పండి. పిల్లలు ఈ వేసవి సెలవులో కేవలం పుస్తకాలు చదివేస్తూ ఎంత డబ్బు సంపాదిస్తారో చూసి మనమే ఆశ్చర్యపోతాం.
సంవత్సరంలో 10, 11 నెలలు స్కూల్‌కి వెళ్ళి అలసి, విసిగిన ఆ పసి మనసులకు కాస్త ఆటవిడుపు కావాలి. మండే ఎండలకు చల్లని చెట్ల నీడన సేద తీరాలి. సాయంత్రానికి ఏ చెరువు గట్టునో, కొలను దగ్గరో చేరి అలసిపోయేవరకు ఆడుకోవాలి. అమ్మమ్మ, నానమ్మ దగ్గర చేరి గారాలు పోతూ ఇక ఒక్క మెతుకు కూడా పొట్టలో పట్టదు అన్నంత ఆబగా వారి చేతి గోరుముద్దలు తినాలి. రాత్రికి తాతయ్య పక్కన చేరి అంతుచిక్కని ఏ పేదరాశి పెద్దమ్మ కథనో వింటూ తెలియకుండానే నిద్రలోకి జారుకోవాలి. కానీ ఈ కాలం పిల్లల్లో ఎంతమంది వేసవి సెలవుల్లో ఇలాంటి అనుభూతులు పొందుతున్నారు?
పిల్లల్ని తమ సొంతూర్లకి (తాము పుట్టి పెరిగిన ఊళ్ళకి లేదా తమ తల్లిదండ్రులు వుండే ప్రాంతాలకి) పంపిస్తే బావుంటుంది కదా అని ఒక్కసారి ఆలోచించాలి. తల్లిదండ్రుల మాట వినని చాలామంది పిల్లలు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చెప్తే చాలా బాగా వింటారు. వినేలా వాళ్ళు చెప్పగలరు కూడా. అలాగే ఆ ప్రాంతాల పద్ధతులు, సంస్కృతులు కూడా కొత్తవి తెలుసుకోగలుతారు.
ఇవన్నీ ఇంట్లో వుండి చూసుకునే తల్లిదండ్రులకైతే కుదురుతుంది, ఆఫీసుకెళ్ళే వాళ్ళకు ఎలా కుదురుతుంది అనుకోవద్దు. దేనికైనా కొంచెం ప్లానింగ్ వుండాలంతే!