Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొత్తం దేశంలో హిందీ మాట్లాడే వాళ్లు నలభై శాతం మాత్రమే ఉన్నారు. మిగతా అరవై శాతం ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతారు. ఉత్తర భారతంలో కూడా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలున్నాయి. భోజ్పురి, గుజరాతీ, మరాఠీ, ఒడిస్సీ, కాశ్మీరి మొదలైన ప్రాంతీయ భాషలే మాట్లాడతారు. అట్లాంటిది హిందీ భాషను అందరిపై రుద్దాలని పూనుకోవడం ఏ రకంగా చూసినా శాస్త్రీయం కాదు. మన రాజ్యాంగం విలువలను, దేశ సమాఖ్య వ్యవస్తను మార్చివేసే ప్రయత్నమిది. దక్షిణాదిన తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు ఎంతో ప్రాచీనమైన భాషలు. త్రిభాషా సూత్రం ప్రకారం దక్షిణాది వారు తమ మాతృభాషను, హిందీని, ఇంగ్లీషును చదువుకుంటున్నారు.
భాష మనిషి సాంస్కృతిక ఉనికి. ఒక సమూహం మాట్లాడే భాషలో ఆ సమూహపు జవము జీవము నిండి వుంటుంది. భాషను కేవలం విద్యాభ్యాసపు మాధ్యమంగానే చూసే లక్షణం మన పాలకులకుంది. విజ్ఞాన సముపార్జనలో, విద్యాభ్యాసనలో భాష కీలక పాత్ర పోషించినప్పటికీ భాషకు అంతకంటే అధికమైన సాంస్కృతిక జీవన ప్రాధాన్యత అందులో ఇమిడి వుంది. ఒక భాషా సమూహంపై మరో భాషను రుద్దడం కానీ, బలవంతంగా అమలు పరచడం కానీ చరిత్రలో ఎప్పుడూ వీలు కాలేదు. భాష బతుకుతో, ఆలోచనతో, ఆచారాలతో, మనస్సుతో, నిత్య శ్వాసతో, సంబంధమున్న అంశం. దానిని చెదరగొట్టాలని, లేదా హీనపరచాలని చేసే ఏ ప్రయత్నమూ ఫలించదు. ఒక భాషను మాట్లాడే వారిపై లేదా వివిధ భాషలు మాట్లాడే వారిపై మరో భాషను నిర్బంధంగా తీసుకొచ్చి రుద్దటం అనేక ఆందోళనలకు దారి తీస్తుంది.
ఇపుడు భాష గురించి మాట్లాడుకోవటం ఎందుకంటే, మన దేశంలో హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని, ఉన్నత విద్యాభ్యసనం కూడా హిందీ మాధ్యమంలోనే కొనసాగాలని నేటి పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మన హోంమంత్రి ఆధ్వర్యాన ఏర్పాటయిన పార్లమెంటరీ కమిటీ సిఫారసులు, బహుళ, వైవిధ్య భారత జీవన విధానానికి విరుద్ధమైనవిగా వున్నాయి. దేశంలోని ఉన్నత విద్య (ఐఐటి, ఐఐఎం, వైద్య, ఇంజనీరింగ్) మొత్తం హిందీ మాధ్యమంలోనే సాగాలని, ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలన హిందీలోనే ఉండాలని, ఉద్యోగ అర్హత పరీక్షలూ హిందీలోనే ఉండాలని సిఫారసు చేసింది. హిందీ రాని వాళ్లు ఉద్యోగాలు పొందలేరనేది దీని సారాంశం. దేశం మొత్తంలో ఒకే భాషను అమలు చేయాలన్న తలంపుతో ఈ ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. ఈ భాషా విధానాన్ని వారు తెస్తున్నది హిందీ భాషపై ప్రేమతో కాదు, ఇంగ్లీషు భాషపై వ్యతిరేకతతోనీ కాదు. భారతదేశాన్ని హిందూస్తాన్గా అంటే హిందూ దేశంగా తీర్చాలనే ప్రయత్నంలో భాగమే ఇది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ లాగా ఒక మత దేశంగా మార్చాలనే ఉద్దేశంలో భాగం ఇది. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష - హిందూ, హిందీ, హిందూస్తాన్ అనే తీరుగా మార్చే యత్నం. కానీ మన దేశపు లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. అనేక భాషలు, మతాలు, జాతులు, తెగలు గల సమూహం మనది. రాజ్యాంగం ప్రకారమే అధికారికంగా గుర్తించిన భాషలు 22 ఉన్నాయి.
మొత్తం దేశంలో హిందీ మాట్లాడే వాళ్లు నలభై శాతం మాత్రమే ఉన్నారు. మిగతా అరవై శాతం ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతారు. ఉత్తర భారతంలో కూడా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలున్నాయి. భోజ్పురి, గుజరాతీ, మరాఠీ, ఒడిస్సీ, కాశ్మీరి మొదలైన ప్రాంతీయ భాషలే మాట్లాడతారు. అట్లాంటిది హిందీ భాషను అందరిపై రుద్దాలని పూనుకోవడం ఏ రకంగా చూసినా శాస్త్రీయం కాదు. మన రాజ్యాంగం విలువలను, దేశ సమాఖ్య వ్యవస్తను మార్చివేసే ప్రయత్నమిది. దక్షిణాదిన తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు ఎంతో ప్రాచీనమైన భాషలు. త్రిభాషా సూత్రం ప్రకారం దక్షిణాది వారు తమ మాతృభాషను, హిందీని, ఇంగ్లీషును చదువుకుంటున్నారు.
ప్రపంచీకరణ వచ్చాక ఆంగ్ల భాష గ్లోబల్ మీడియాగా మరింత ప్రసిద్ధి పొందింది. ప్రపంచ జ్ఞానానికి ఆంగ్లం నేటి అవసరంగా మారింది. ఏ భాష పట్ల వ్యతిరేకత ఉండాల్సిన అవసరంలేదు. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బతుకుదెరువుని ఇచ్చే భాషను ఎట్లాగూ నేర్చుకుంటారు. కానీ కావాలని ఒక భాషను రుద్దే ప్రయత్నం చేయటంలోనే ఏదో ఆధిపత్యపు భావజాలం దాగి వుంటది. భాషకూ మతం రంగును పులిమే కుట్రలో భాగమే వీరు చేస్తున్న ప్రయత్నం. తెలంగాణలో ఆనాడు ఆధిపత్య వర్గాలు తమ ఉర్దూ భాషను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినపుడు దానికి వ్యతిరేకంగానే భాషోద్యమం ప్రారంభమయి, అదే ఉద్యమం ఆధిపత్యానికీ ఎదురు తిరిగి తిరగబడింది. నిరంకుశత్వాన్ని అంతమొందించింది. భాష కోసం ఒక దేశమే ఏర్పడింది. ఉర్దూ భాషను రుద్దేందుకు పూనుకున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లా జాతీయులు చేసిన పోరాటం ఒక జాతి పోరాటంగా మారి దేశమే అవతరించింది.
ఇపుడు పాలకులు, రాజ్యాంగం, లౌకిక విలువలు, భిన్నమైన సాంస్కృతిక జీవనమును అర్థం చేసుకోకుండా ప్రజలపై హిందీ భాషను రుద్దాలనుకుంటే ప్రజలు సహించరు. భాష ఆధిపత్యానికి ప్రతిఘటన తప్పదు.