Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు రెండేండ్ల పాటు కరోనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కేంద్రం ముందు జాగ్రత్తా చర్యలు చేపట్టక వ్యాధి ప్రబలిన తర్వాత ఒక్కసారిగా లాక్డౌన్ విధించింది. దీని వల్ల అన్ని రంగాల్లో కంటే ఎక్కువ నష్టం చవిచూసింది విద్యా రంగం. దాదాపు 20వేల స్కూళ్లు మూతపడ్డాయని కేంద్రం ఇటీవల విడుదల చేసిన పెర్ఫామెన్స్ ఇండెక్స్ గ్రేడ్ నివేదికలో పేర్కొంది. 20లక్షల మంది చిన్నారులు విద్యకు దూరమయ్యారంటే వారు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారనే ఆలోచన చేయకుండా డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా అని ఊదరగొట్టడం వల్ల ఉపయోగమేంటి?
ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా తెలుసుకోవాలంటే అక్కడి విద్యా, వైద్య రంగాలు ఎలా ఉన్నాయో ముందు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొదలు నేటివరకూ విద్యారంగం ఒడిదుడుకుల్లోనే పయనిస్తోంది. కేంద్రం ఆజాదీకా అమృతోత్సవాల పేరుతో పండగ జరుపుకుంటోంది. కానీ ఈ రంగానికి సరైన కేటాయింపులు లేని మూలంగా అందరికీ విద్య రోజురోజుకూ అందని ద్రాక్షలా తయారవు తోంది. ఎంతోమంది పేద విద్యార్థులు గ్రామీణ విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. కుటుంబ పోషణ భారమైన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పనులకు తీసుకెళ్తున్న దీనస్థితి 75ఏండ్ల స్వాతంత్య్రాన్ని వెక్కిరిస్తోంది. వారికి అవగాహన కల్పించి స్కూళ్లలో చేర్పించాల్సిన బాధ్యత అన్ని స్థాయిల్లో నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. పలకా, బలపం పట్టాల్సిన ఆ చిట్టిచేతులు పలుగు, పార పడుతుంటే భావి భారతం ఏం కావాలి? దీనికి బాధ్యత ఎవరిది?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయనేది స్పష్టం. మౌలిక సదుపాయలు లేక, సరైన విద్యాబోధన అందక ప్రతియేటా విద్యార్థులు చదువులకు స్వస్తి చెబుతున్నారు. కొంతమంది కష్టమైన సరే ప్రయివేటు స్కూళ్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎక్కువమంది డ్రాపౌట్స్‌గా మారుతున్నారు. వాస్తవానికి బడి మానేసిన పిల్లల్ని బడిలో చేర్పించే ప్రయత్నం చేయాలి. దీనికి తోడు తల్లిదండ్రులు వలస కార్మికులైతే గనుక వారు పని చేసే చోట కూడా పాఠశాలను పెట్టాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. కానీ ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో డ్రాపౌట్స్ సంఖ్య ప్రతి యేటా పెరుగుతూ వస్తోంది. ఇటీవల దేశంలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను అక్షరాస్యత, నాణ్యతా సూచీలో భాగంగా విడుదల చేసిన గ్రేడింగ్ విద్యారంగం అస్తవ్యస్తతను తెలియపరుస్తోంది. ఏడు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో వెనుకబడింది. ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 25వ స్థానంలో ఉంటే ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న కేరళ మాత్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మౌలిక సౌకర్యాలు, విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యమైన బోధన, డిజిటల్ విద్యను అమలు చేస్తున్న రాష్ట్రంగా పైచేయి సాధించింది. కేరళను మోడల్‌గా తీసుకుని అక్కడ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పును దేశ వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా విద్యావేత్తల నుంచి వస్తోంది.
విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి అనేక విధానాలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతున్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత. దీనివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాటు ఉన్నవారిలోనూ నాణ్యత పడిపోతోంది. దీనికితోడు రెషనలైజేషన్ పేరుతోనూ స్కూళ్లను మూసి వేయడం మరింత శోచనీయం.అసలు పిల్లలు స్కూళ్లకు ఎందుకు రావడం లేదనే కోణంలో పరిశీలన కూడా లేదు. గ్రామీణ స్థాయిలో పాఠశాలలు చాలా అధ్వాన్నస్థితిలో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఘటన హృదయాన్ని కదిలిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలలో తరగతి గదిలోని కిటికీ నుంచి పడిన రెండు రూపాయల బిళ్లను తీసుకోవడానికి వెళ్లిన బాలిక పాముకాటుకు గురై చనిపోయింది. వారి తల్లిదండ్రులకు ఆమె 16 ఏండ్ల తర్వాత కలిగిన ఏకైక సంతానం. బాలిక మృతదేహాన్ని గుండెలకు హత్తుకుని రోదించిన తీరు కండ్లముందు ఇంకా కనపడుతూనే ఉంది. ఆమె మృతికి కారకులెవరు? పాఠశాలలో ఇంత దుర్గంధం, చెత్తా చెదారం ఉంటే పిల్లలు స్కూల్‌కు ఏవిధంగా వస్తారో ఒక్కసారి ఆలోచించాలి. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలికల పాఠశాలలో 200మంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? వారు చెప్పుకోలేక, బయటకు వెళ్లలేక ఇంటికి వెళ్లేదాక బిగపట్టుకుంటున్న దుస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ఇలా అనేక సమస్యలతో విద్యావ్యవస్థ కొట్టుమిట్టాడుతోంది.
దాదాపు రెండేండ్ల పాటు కరోనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కేంద్రం ముందు జాగ్రత్తా చర్యలు చేపట్టక వ్యాధి ప్రబలిన తర్వాత ఒక్కసారిగా లాక్డౌన్ విధించింది. దీని వల్ల అన్ని రంగాల్లో కంటే ఎక్కువ నష్టం చవిచూసింది విద్యా రంగం. దాదాపు 20వేల స్కూళ్లు మూతపడ్డాయని కేంద్రం ఇటీవల విడుదల చేసిన పెర్ఫాÛమెన్స్ ఇండెక్స్ గ్రేడ్ నివేదికలో పేర్కొంది. 20లక్షల మంది చిన్నారులు విద్యకు దూరమయ్యారంటే వారు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారనే ఆలోచన చేయకుండా డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా అని ఊదరగొట్టడం వల్ల ఉపయోగమేంటి? విద్యారంగంలో చిత్తశుద్ధితో మార్పులు తీసుకురాకుండా, మౌలిక సదుపాయలు కల్పించకుండా పాత విధానాలే అవలంభిస్తే భవిష్యత్తులో భావిభారత పౌరులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.