Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారు విద్యార్థులు.. సమాజంలో జరుగుతున్న మంచినీ చెడును పరిశీలించే అవగాహన ఉన్నవారు. అవసరమైన మార్గాన్ని ఎంచుకునే మేధస్సు కలిగిన వారు. ఆటాపాటలతో పాటు సినిమాలు, షికార్లు వారి దినచర్యలో ఓ భాగం. అందులో నుంచే భావాలు వస్తాయి. అనుభవాలూ పుడుతాయి. సమస్యలు వస్తాయి.పరిష్కారాలూ దొరుకుతాయి. మనిషి ఉన్నతంగా ఎదిగేందుకు ఇవన్నీ అవసరమే. కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఏదో చేయకూడని తప్పు చేసినట్టు సమాజం నుంచి వేరు చేసే ప్రయత్నం జరగడం బాధాకరం. గుజరాత్ మారణకాండపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీని విద్యార్థులు వీక్షించడం. దాన్ని సీరియెస్‌గా పరిగణించిన యాజమాన్యం వారిని బహిష్కరించడం. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఆలోచించాల్సిన అంశం. ఒకప్పుడు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఇలాంటి చర్యలుండేవి. కానీ ఎలాంటి తప్ప చేయకుండానే విద్యార్థులు శిక్షకు గురికావడం అన్యాయం. వారిపై ఏ రూల్ కింద,ఏ అధికారణం కింద చర్యలు తీసుకున్నారో కూడా స్పష్టత లేదు. మనిషికి స్వేచ్చ రాజ్యాంగం కల్పించిన హక్కు. సమాజంలో జరిగే మంచీచెడుకు స్పందించడం వారి చైతన్యం. పాఠాలతో పాటు ప్రపంచంలో జరిగే విషయాలు తెలుసుకోవడం మంచి పరిణామమే. కానీ ఇది కొందరికి నచ్చడం లేదు.
రెండువేలారెండులో గుజరాత్లో జరిగిన అల్లర్లు రాజకీయ ప్రేరేపితమని, హిందువులు మెజార్టీగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు,ఊచకోత ఉద్దేశపూర్వకంగానే జరిగిందని బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించి ఇటీవల విడుదల చేసింది. ఇది మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ప్రసారమైంది.ఈ డాక్యుమెంటరీని పదమూడు రోజుల కిందట రాజ స్తాన్ సెంట్రల్ యూనివర్సిటీ జైపూర్‌లో పదకొండు మంది పీజీ విద్యార్థులు మొబైల్లో వీక్షించారు.ఇది తీవ్రమైన నేరంగా భావించిన యాజమాన్యం వారిని పద్నాలుగు రోజుల పాటు యూనివర్సిటీ, హాస్టల్ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఆ రోజు క్యాంపస్‌లో కొంతమంది కావాలనే ఉద్రిక్తతలు సృష్టించారని బాధిత విద్యార్థుల ఆరోపణ. 'జైశ్రీరామ్, దేశ ఉగ్ర వాదు లను కాల్పి పారేయండి' అని నినాదాలు చేస్తూ హాస్టల్లోకి దూసుకొచ్చారని ఆవేదన.దీన్ని బట్టి చూస్తే అక్కడేం జరిగిందో అర్థమవుతుంది. వారిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం వెనుక కూడా ఒత్తిళ్ల ప్రభావం ఉంటుంది.కానీ యూనివర్సిటీ అంటే మేథో సంపత్తికి నిలయం.విద్యార్థులకు మాట్లాడే హక్కు, భావ ప్రకటన చేసే హక్కు, సమస్యలపై నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కానీ దేశంలో అలాంటి పరిస్థితి రోజురోజుకూ అంతరిస్తుండటం శోచనీయం.
పిల్లలు తప్పు చేస్తే దండించే అధికారం తల్లిదండ్రులది.ఆ తర్వాత స్థానం పాఠశాలలో గురువులది. అదే పెద్దవాళ్లు అయితే సక్రమమార్గంలో పెట్టే బాధ్యత పోలీసులది.సమాజంలో జరుగుతున్న నేరాలను బట్టి శిక్షను అమలు చేసేది చట్టం. కానీ దాన్ని కొంతమంది తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం, నిజాలను బయటకు పొక్కకుండా చూడటం సరికాదని అభిప్రాయం. డాక్యుమెంటరీని చూస్తేనే సంఘ విద్రోహ చర్యకు పాల్పడినట్టుగా విద్యార్థులను శిక్షిస్తే రోజూ అలాంటి ఘటన లకు కారకులైన వారిని, గోద్రా మరణాలకు బాధ్యుల్ని ఎవరు శిక్షించాలి? విద్యార్థులు ఏదో నేరం చేసినట్టుగా బహిష్కరించడం వారికి అవమానం కాదా? ఇలాంటి చర్యలతో భవిష్యత్తులో వారి మానసిక స్థితి ఎలా ముందుకు సాగుతుంది? సమాజంలో ప్రశ్నించే గళాలు,కలాలన్నీ అధికారిక చట్టం దృష్టిలో దేశద్రోహ చర్యలే! తినేతిండి మీద ఆంక్షలు విధిస్తారు.బట్టలేవి వేసు కోవాలో శాసిస్తారు.శిక్ష ఎవరికి వేయాలో కూడా నిర్ణయిస్తారు. రాజస్తాన్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఘటన ఒక్కటే కాదు. ఇటీవల జైలు నుంచి విడుదలైన జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ పరిస్థితి అంతే. చేయని నేరానికి ఎనిమిది వందల యాభై రోజులు శిక్ష అనుభవించాడు. ఆయన ఏం నేరం చేశాడని? హత్రాస్‌లో జరిగిన దళిత బాలికపై లైంగికదాడి, హత్యకు సంబంధించిన వార్తను కవర్ చేసేందుకు వెళ్లినందుకుగాను ఆయన్ను 'ఉపా' చట్టం కింద జైళ్లో వేశారు.ఇలా అనేకం భారత సమాజాన్ని చుట్టు ముడుతున్నాయి. మేధావులు మౌనం వహించినంతవరకే ఇలాంటి బహిష్కరణలు, నిర్భందాలు, జైలుగోడలు. అది ఏదో ఓరోజు ఆగ్రహంగా మారితే ఉప్పెనలా ఉబికివచ్చే జ్వాలా ముందు ఏ శక్తీ నిలబడదు.