Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండే మహిళల విద్యా, స్వేచ్ఛను అడ్డుకోవడ మంటే వారిని చరిత్ర పుటల్లోంచి తొలగించడమే. తాలిబన్ల కుట్రను ఆధునిక సమాజం ఏ మాత్రం అంగీకరించదు. టెలివిజన్, సంగీతం, సినిమాలను కూడా నిషేధించడం చూస్తుంటే అసలు సమాజం ఎటువైపు వెళ్తోందనే అనుమానం రాకమానదు. కనీసం తమ హక్కుల కోసం ప్రతిఘటించే స్వేచ్ఛ కూడా అక్కడ లేదు. అప్ఘాన్ కఠినవైఖరిని నిరోధించేందుకు ఐక్య రాజ్య సమితి జోక్యం చేసుకున్నా మార్పు రాలేదు. చదువుకోవడం తప్పని, స్వేచ్ఛగా జీవించడం నేరమని? ఏ మతం చెబుతుంది? తాలిబన్లు నమ్మే షరియా చట్టంలోనూ లేదు. మరి మహిళలంటే ఎందుకింత కక్ష? అసలు వారి హక్కుల్ని కాల రాసేందుకు ఏ ప్రభుత్వానికి, మత సంస్థకు, స్వతంత్ర రాజ్యానికి కూడా లేదు.
ఒక దేశాన్ని కొలవాలంటే ముందు ఆ దేశంలో మహిళ ఏ స్థానంలో ఉందో చూడాలంటాడు కార్ల్‌మార్క్స్. వారి చదువు, హక్కులు, స్వేచ్ఛను బట్టి ఆ దేశాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఇదో మౌలిక సూత్రం. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే మహిళ స్థానం రోజురోజుకూ దిగజారుతుండటం పతనావస్థకు ఓ హెచ్చరిక. అందులో మొదటి వరుసలో నిలిచింది అప్ఘానిస్తాన్. ఇస్లామిక్ చట్టం పేరుతో అక్కడ విధిస్తున్న కఠిన ఆంక్షలు దారుణం. నేరారోపణలతో అమలు చేస్తున్న బహిరంగ శిక్షలు భయానకం. ఇదేం రాజ్యం? ఆటవికులు సైతం అసహించుకునే పాలన ఎవరికి ఉపయోగం? నాలుగు రోజుల కిందట దొంగతనం, అసహజ లైంగిక కార్యకాలాపాలకు పాల్పడ్డారన్న కార ణంగా తొమ్మిది మందిని తాలిబన్లు కొరడాతో కొట్టారని ఆ దేశ సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే వారిలో నలుగురిని పుట్‌బాల్ స్టేడియంలో అందరూ చూస్తుండగానే చేతులు నరికేసినట్టు చర్చ జరుగుతోంది. ఇదేకాదు గత డిసెంబర్లో ఒకరికి బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేశారు. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన.
దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తాలిబన్ల పాలనలో ఎన్నో అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు, విదేశీదాడులతో దేశ ప్రజలు ఇప్పటికే దారుణంగా నష్టపోయారు. రెండువేల ఒకటి తర్వాత పౌర ప్రభుత్వంతో కాస్తా ఊపిరి పీల్చుకుని ఎంతో కొంత వృద్ధి సాధించారు. కానీ, ఏడాదిన్నర కిందట మళ్లీ దేశాన్ని ఆక్రమించుకుని యథాతథంగా ప్రజల్ని ఆంక్షల బోనులోకి నెట్టారు. తొలినాళ్లలో ప్రజాభీష్టం మేరకే పాలన చేస్తామని హామీలిచ్చి వాటిని తుంగలో తొక్కారు. వారు గద్దెనెక్కిన తర్వాత అత్యధికంగా అణచివేతకు గురైంది మహిళలే. మగతోడు లేకుండా ఒంటరిగా వీధుల్లోకి రాకూడదని హెచ్చరించారు. ఈడొచ్చిన పిల్లల్ని ఇంటికే పరిమితం చేశారు. శరీరం ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా బుర్కా ధరించకుంటే బహిరంగంగానే కొడుతున్నారు. జిమ్‌లు, ఈత కొలనులకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. విశ్వవిద్యాలయాల్లోనూ ప్రవేశం నిషేధం. ఉద్యోగానికి వెళ్లడం కూడా తప్పే! కనీసం పక్కనున్న పార్కుకు వెళ్లేందుకు కూడా అనుమతిలేక పోవడం అమానుషం. ఇదేమనడిగితే జాతీయ ప్రయోజనం, మహిళల గౌరవం కోసమని చెబుతున్నారు. అక్షరాస్యత లేని దేశంలో ఏజాతీయ ప్రయోజనం సిద్ధిస్తుందో వారికే తెలియాలి.
దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండే మహిళల విద్యా, స్వేచ్ఛను అడ్డుకోవడ మంటే వారిని చరిత్రపుటల్లోంచి తొలగించడమే. తాలిబన్ల కుట్రను ఆధునిక సమాజం ఏ మాత్రం అంగీకరించదు. టెలివిజన్, సంగీతం, సినిమాలను కూడా నిషేధించడం చూస్తుంటే అసలు సమాజం ఎటువైపు వెళ్తోందనే అనుమానం రాకమానదు. కనీసం తమ హక్కుల కోసం ప్రతిఘటించే స్వేచ్ఛ కూడా అక్కడ లేదు. అప్ఘాన్ కఠినవైఖరిని నిరోధించేందుకు ఐక్య రాజ్య సమితి జోక్యం చేసుకున్నా మార్పు రాలేదు. చదువుకోవడం తప్పని, స్వేచ్ఛగా జీవించడం నేరమని? ఏ మతం చెబుతుంది? వారు నమ్మే షరియా చట్టంలోనూ లేదు. మరి మహిళలంటే ఎందుకింత కక్ష? అసలు వారి హక్కుల్ని కాల రాసేందుకు ఏ ప్రభుత్వానికి, మత సంస్థకు, స్వతంత్ర రాజ్యానికి కూడా లేదు. ఈ విషయం వారి గమనంలో లేకపోవడం శోచనీయం. మహిళల పట్ల అనుసరిస్తున్న తిరోగమన విధానాలే రేపు వారిని తిరగబడేలా చేస్తే రాజ్యమే కూలుతుందన్న చరిత్రను విస్మరించడం అవివేకం. తాలిబన్ల మత ఛాందసం దేశ ప్రజల్లో అస్థిరత, దారిద్య్రానికి దారి తీయడం ఖాయం.
ఇలాంటి సమయంలోనే అంతర్జాతీయ సమాజం మేల్కొవాలి. రోజురోజుకూ మానవ హక్కుల హననం జరుగుతున్న అప్ఘాన్ ప్రజానీకానికి అండగా నిలవాలి. వారి న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడేందుకు ధైర్యాన్నివ్వాలి. వారి ఆశలు, ఆకాంక్షల్ని గౌరవించి వారికి భరోసా కల్పించాలి. కాబూల్‌తో స్నేహ సంబంధాల కోసం అర్రులు చాస్తున్న భారత్‌కూ కనువిప్పు కలగాలి. అరాచక పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసేలా ఆలోచించాలి. వాణిజ్య, దౌత్య సంబంధాల్లో ప్రపంచ దేశాలు అప్ఘాన్‌ను ఒంటరి చేయాలి. దీనిపై ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి ఏం చేయనుందో ప్రకటించాలి. ప్రజా ఉద్యమాలతోనే తాలిబన్లను ప్రతిఘటించే చైతన్యాన్ని మహిళల్లో తీసుకురావాలి.