Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృత్యుహేలతో దేశం వణికిపోతోంది. భయానక పరిస్థితులలో దేశ ప్రజలు విలవిల్లాడుతున్నారు. రాజధాని ఢిల్లీ నుంచి దేశపు నాలుగు దిక్కుల్లోను కరోన విజృంభణతో జనులు పిట్టల్లా రాలిపోతున్నారు. బ్రతికున్న వాళ్ళంతా ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాక బిక్కు బిక్కు మని బ్రతుకులీడుస్తున్నారు. రెండవసారి విరుచుకుపడుతన్న కరోనా మహమ్మారితో తరతమ భేదం లేకుండా మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా యువకులు ఎక్కువగా దీనికి బలౌతున్నారు.
రోగ తీవ్రత, వేగవంతమైన విస్తరణ ఒకటైతే, దాన్ని ఎదుర్కోవటానికి సన్నద్ధంగా లేక పోవటం, ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరింత ముప్పును పెంచుతోంది. మార్చి నెల నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తున్న రోగులు ఏప్రిల్లో ప్రపంచంతోనే అత్యధిక కేసుల దేశంగా మారిపోయింది. రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా బాధితులు పెరగటం ఎక్కడా మనం చూడలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలే. ఒకటి ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించడం, ర్యాలీలు, సభలలో లక్షలాది మందిని సమీకరించడం, నిబంధనలేవీ పాటించక పోవడం ప్రధాన కారణం. మునిసిపల్ ఎన్నికలు- రాష్ట్రాలలో జరిగే ఎన్నికలన్నీ ఈ ఉద్ధృతిలోనే నిర్వహించటం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే వుంది. రోజూ వేలాది ప్రాణాలు పోతున్నాయి. చూస్తూ చూస్తూనే ఐదుగురు జర్నలిస్టులు రెండు తెలుగు రాష్ట్రాలలో చనిపోయారు.
ఇంకా దారుణమైన విషయమేమిటంటే కరోనా బారిన పడి అనారోగ్యంపాలైన వారికి ఆసుపత్రులలో పడకలు లేక, వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమైన విషయం.
అంతేకాదు శ్వాసకు సంబంధించిన సమస్యతో ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఆక్సిజన్ అందించే పరిస్థితి కూడా లేకపోవడం, ఆక్సిజన్ కొరతతో అనేక మంది రోగులు అశువులు బాయటం మునుపెన్నడూ కనని విషయం. ఆర్మీ ఆసుపత్రులలోనూ పడక దొరకక మాజీ ఆర్మీ ఆఫీసర్ మరణించడం ఎంత దారుణమైన విషయం. మరి ఇంత క్లిష్ట పరిస్థితి ఎదురౌతున్నప్పుడు ప్రభుత్వాలు ఏమీ చేయకుండా ఏదో ఉపదేశాలిచ్చి, విపత్తును అందరం కలిసి ఎదుర్కోవాలని ఒట్టి మాటలు వల్లిస్తే ఏం ప్రయోజనం.
ప్రజలందరికీ వాక్సిన్ ఇచ్చే ప్రయత్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన దేశం ఉత్పత్తి చేస్తున్న మందును ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఇప్పుడు వ్యాక్సిన్ కొరతతో నానా ఇబ్బంది పడుతోంది. అంతేకాక వ్యాక్సిన్ రాష్ట్రాలకు అందజేయడంలోనూ వివక్షత చూపుతోంది. రాష్ట్రాలే కొనుక్కోవాలని బాధ్యత నుంచి తప్పుకున్నది. కరోనా కోసం పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేసిన ప్రధాని వాటిని ఆపద సమయంలో ఖర్చు చేయకుండా, వైద్య ససౌకర్యాలు పెంచకుండా చోద్యం చూస్తున్నాడు. చూసీ చూసీ సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి, కేంద్రం వైద్య ప్రణాళికను సిద్ధం చేయాలని ఏర్పాట్లను పర్యవేక్షించాలని, వైద్య ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించే వరకు మొద్దు నిద్రలో తూలుతుండడం ప్రజల పట్ల ప్రభుత్వాలకున్న బాధ్యతారాహిత్యాన్ని చాటుతోంది.
కరోనా విజృంభణ కన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతలేమి తనం ఎక్కువ ఇక్కట్లను తెచ్చి పెడుతున్నది ఇప్పటికైనా పూనుకుని ప్రజలను కాపాడకపోతే మృత్యువు విలయతాండవమాడుతుంది. ప్రజలు కూడా గొంతులు విప్పి ప్రశ్నించాలి.