Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాళీలు పూరించుమూ అని చిన్నప్పుడు బడిలో పరీక్షల్లో ప్రశ్నలుండేవి. విద్యార్థులు సరైన పదాలతో ఖాళీలను పూరించేవారు. ఇప్పుడు ఖాళీలు అవి కాదు. అలా ప్రశ్నలా ఎదురైనా పూరించే పదాలు, అర్థాలు, జవాబులు ఇక్కడేమీ లేవు. అన్ని వున్నట్టే అనిపిస్తుంది. కానీ ఏదో ఖాళీ ఖాళీగా మనసంతా బోసిపోతుంది. మనసులో ఖాళీతనం వుందీ అంటే అదేదో మానసికమైన విషయంగానే కొట్టిపారేయొద్దు. ఆ మనసు ఖాళీలకు భౌతిక ఖాళీయేదో కారణమై వుంటుంది. ఈ కాలమంతా ఖాళీగానే అనిపిస్తోంది. ముందు ఖాళీ, వెనుక ఖాళీ, కుడి ఎడమల ఖాళీ ఖాళీ.
ఎందుకలిలా అనిపిస్తోంది? ఉండాల్సిన వారెవరో లేకుండా పోతున్నారు. నేనున్నానని చెప్పాల్సిన గొంతేదో చెప్పకుండా నిశబ్దంగా ఖాళీగా వున్నది. ఖాళీ తనమంటే ఏదీ లేకుండా వుండటమే. ఉండాల్సిన జవాబేదో దొరకుండా పోవడం. ఇల్లు ఖాళీ చేస్తున్నపుడు తిరిగిన, కూర్చున్న, నిద్రించిన స్థలాల జ్ఞాపకాలు ఖాళీతనంతో దిగులు కమ్ముకుంటుంది. ఓ వస్తువు వున్న చోటు నుండి తీసివేస్తే, అక్కడంతా ఖాళీతనం ఏర్పడుతుంది. భౌతిక స్థలానికి, వస్తువుల ఖాళీతనాలకీ మనం బెంగ పడి దిగులు పడిపోతుంటామే. మరి మనుషుల ఖాళీతనం ఎంత మనాదిని నింపుతుంది! ఈ మనుషులు తరలిపోయిన ఖాళీతనం ఎంత బాధాకరంగా మారుతుంది!
అబ్బో ఈ ఖాళీతనం భరించలేకపోతున్నాం. కలిమి లేమి తనాన్ని ఎంతైనా మోయవచ్చు ఖాళీని భరించడం కష్టమైన పని. మనుషులు, మనతో ఇప్పటివరకు గడిపిన, మాట్లాడిన, ప్రశ్నించిన, జవాబులు వెతికిన వాళ్ళంతా చూస్తూ చూస్తూ జీవితాలను ఖాళీ చేసి, అనుబంధాలను ఆత్మీయతలను, స్నేహ సౌధాలను వీడిపోతుంటే చుట్టూ ఎడారి తలమై ఘోషిస్తున్నది. మూగగా ఖాళీతనం బావురుమంటున్నది. అనుబంధాలు, మనుషులు మాయమవుతూ ఖాళీ ఏర్పడటాన్ని దు:ఖంతో, కన్నీళ్ళతో సమాధాన పడుతున్నాం. కానీ మనుషులుండీ, వ్యవస్తలుండీ, ప్రభుత్వాలుండీ, పాలకులుండీ, పవరుండీ కూడా ఏమీ లేని ఖాళీ తనమే దర్శనమివ్వడం, కదిలే తనమే లేకుండా పోవడం ఒక విషాద సమయం. పాలనంతా ఖాళీ ఖాళీగా మారింది. బాధ్యతా ఖాళీగానే కనపడుతోంది. ప్రశ్నలెన్నో కుప్పలుగా పడుతున్నాయి. కానీ ఒక్క సమాధానమూ ఖాళీలను నింపడం లేదు.
గాలి అందక ప్రాణాలెన్నో గాలిలో కలిసి పోతుంటే, వున్నానని చెప్పుకుంటున్న వాళ్ళంతా ఎక్కడున్నట్లు, ఏం చేస్తున్నట్లు? ఎవరికోసం అధికారాలను వినియోగిస్తున్నట్లు? ఒట్టి మాటలు చెబుతున్న ఖాళీతనాలు మీవి. వీరున్నా లేనట్టే అనిపిస్తోంది! మీ కుర్చీలన్నీ ఖాళీ ఖాళీగా కనపడుతున్నాయి. ప్రాణాలకే ముప్పు వస్తున్నపుడు, అమాంతంగా మనుషులే మాయమవుతున్నపుడు, హాహాకారాలతో, ఆర్తనాదాలతో స్థలాలన్నీ మారుమ్రోగుతున్నపుడు కూడా మీరు చలన రహితులుగా వుండటం నిజంగా ఖాళీ తనమే కాక మరేమవుతుంది?
మీరున్నారని భావించడమే పెద్ద తప్పు, మా కోసం వుంటారనుకోవడం మరీ తప్పు. ముందుగానే మీరు లేరనుకుంటే మాకీ బాధ వుండేదికాదు. మీ అచేతనకు, నిరాదరణకు ఇంతగా రోధించే వాళ్ళము కాదు. ఇప్పుడిక మీరు ఖాళీ కుర్చీలని తెలిసిపోయింది. ఉండిలేని వాళ్ళయ్యాక, చేయందించాల్సిందీ అందివ్వకపోయాక, మీ అస్తిత్వాలన్నీ ఖాళీ ఖాళీగానే కనపడుతున్నాయి. ఇప్పుడిక మా ముందున్న కర్తవ్యం ఖాళీలను పూరించుకునేందుకు నిజమైన, నిఖార్సయిన పాలకునితో భర్తీ చేయాల్సిన అవసరం వుంది. ఖాళీతనాన్ని ఎంతకాలంగా సహించగలుగుతాము! ఖాళీలను భరించడం కష్టం, ఖాళీ తనమే ఒక ఎడారి కష్టం!