Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్షోభాలు, సంక్లిష్ట సమయాలు కొన్ని వాస్తవిక విషయాలను తేటతెల్లం చేస్తాయి. కొందరికి సంక్షోభాలు కూడా లాభాలు తెచ్చి పెడతాయి. అయితే ఈ కరోనా విజృంభణ సందర్భంలో, గ్రామీణం నుండి పట్టణాలు, నగరాల వరకు పొద్దుట లేస్తే మహా మహా శక్తుల గురించి, మహత్తుల గురించి తెగ చెబుతూ ప్రచారం చేసే వాళ్ళెవరూ ఈ ఆపద కాలంలో కనపడకపోవడం మనం గమనించవచ్చు. ఇంతకుముందు టీవీల్లో పత్రికల్లో స్వాముల వార్లూ, బాబాలు, ఫాదర్లూ, ఫాస్టర్లు, రుద్రాక్షల మహిమలు, డైమండ్ జాతకాలు, తాయత్తు మహిమలు మహా బాగా వినపడేవి. జపాలు, తపాలు, ఊగిపోవడాలు, శక్తుల ప్రదర్శనలు మహా ఘనంగా ప్రచారంలోకి వచ్చేవి. వేలాది మంది భక్తులనూ, అనుచరులను తమ వెంట తిప్పుకునే వారు. రోజూ వేలాది మంది ప్రాణాలు పోతుంటే ఎవరూ బాగు చేస్తామని ముందుకు రారే! అసలు మాట మాత్రమైనా ధైర్యాన్ని గానీ భరోసాను గాని అందించరే! ఏరీ వాళ్ళెక్కడీ
కళ్ళకు కనపడని అతి సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్ కారణంగా మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశ దేశాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇంకా సరైన మందులేవీ కనుగొనలేకపోయినా ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఎలా ప్రాణాలను కాపాడవచ్చో వైద్య విజ్ఞానమే మొదట మానవాళికి విజ్ఞానాన్ని అందించింది. అత్యంత వేగంగా వాక్సిన్నూ కనుగొని కొంత నిరోధించే ప్రయత్నమూ చేసింది. సైన్స్ మాత్రమే ఒక భరోసాను, ధైర్యాన్ని మనిషికి అందించింది. ప్రాణాపాయ స్థితిలో వున్న లక్షలాది ప్రజలకు, ప్రాణాలొడ్డి సేవలు చేస్తున్న వారు వైద్యులు, నర్సులు, మొదలైన సేవకులు మాత్రమే వారి ప్రాణాలకు ముప్పుందని తెలిసి కూడా నిబద్ధంగా సేవలందిస్తున్నారు. వాళ్ళేమీ తమ దగ్గర అతీత శక్తులున్నాయని చెప్పడం లేదు. ఏ రకమైన మాయలకు, మంత్రాలకు పాల్పడటం లేదు. వాళ్లు చేస్తున్నదల్లా వ్యాధి తీవ్రత, శరీర పరిస్థితులను బట్టి శాస్త్రీయంగా వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని బట్టి వైద్యం అందిస్తున్నారు. ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నానంటే, సైన్సుకు తప్ప ఏ విధమైన క్రతువుకూ మహత్తుకూ వాస్తవికతను అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. దీన్ని ప్రజలు చైతన్యయుతంగా అవగాహన చేసుకోవాల్సి వుంది.
దేశమంతా తలలూపుతూ విన్న బాబా రాందేవ్ గారి ఉపన్యాసాలు, యోగా పాఠాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలాగో ఈ ఆపద కాలంలో చెప్పలేక పోతోంది. ఆ యోగా కేంద్రం సి.ఇ.వో. గారే ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టించుకుని సైన్సు ఫలితాన్ని పొందుతున్నాడు. కరోనాకు మందు కనిపెట్టానన్న రాందేవ్ బాబా గారే అల్లోపతి వైద్యం చేయించుకున్నారు. మరి వీళ్ళ శక్తులు, యుక్తులు ఏమైపోయాయి. ప్రార్థనలు చేసి వైరస్ను పారద్రోలవచ్చునని చెప్పిన వాళ్ళంతా వైద్యుల ముందు మోకరిల్లుతున్నారు. ఆధ్యాత్మికత పేరుతో అజ్ఞానాన్ని పంచి పెంచి పోషించడం తగని పని. మన రాజ్యాంగంలోనూ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి వుండాలని, ప్రతి పౌరుడూ ఆ చైతన్యంతో జీవనం సాగించాలని చెప్పుకున్నాము.
కానీ నేటి పాలకులు కూడా మూఢ విశ్వాసాలను అజ్ఞానంతో కూడుకున్న విషయాలను ప్రచారంలో పెడుతూ ప్రజలను అంధకారంలోకి తోసి వేస్తున్నారు. ప్రజలకు ఇప్పటివరకు ఎన్నో నీతి బోధలు, మహత్తుల గురించి ప్రవచించిన స్వాములు బాబాలు, ఇతర వ్యక్తులు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. కనీసంగా ప్రజలు ఆపదలో వున్నపుడు వారికి సేవ చేసే పనిలోనయినా వుండాలి కదా! మానవ సేవే మాధవ సేవ అన్న వాళ్ళు బాధితుల వద్దకు రారేమీ? అంటే సామాన్య ప్రజలకు బోధించడానికి మాత్రమేనా! కాబట్టి ప్రజలు ఇప్పటికయినా ఇలాంటి మాయమాటల వాళ్ళను, వాళ్ళకు వత్తాసు పలికే వాళ్ళను నమ్మి మోసపోకూడదు. ఎప్పటికైనా సైన్సు మాత్రమే మనిషిని కాపాడుతుంది.