Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనసారా కడుపారా ఏడ్వనీయుడు నన్ను' అని కృష్ణశాస్త్రి గారు ఏడ్చే స్వేచ్ఛను కోరుకున్నారు. ఏడ్వనీయండని వేడుకున్నాడు. 'ఏడ్చిన కళ్ళ వెనుక కల్మషము తొలగు' అన్నాడొకాయన. 'పతితులారా భ్రష్టులార! ఏడవకండేడవకండీ' అని ఏడ్చే వాళ్ళకు భరోసా గీతాన్ని రాశారు శ్రీశ్రీ. కాబట్టి ఏడ్వడం గురించిన విషయాలెన్నో కవులూ, రచయితలూ చెబుతూనే వున్నారు. 'కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింటనుండజాలదు' అని ఎవరెవరు ఏడిస్తే ఏమవుతుందో కూడా చెప్పారు.
ఏడ్వడం మూడు రకాలుగా వుంటుంది. ఒకటి బాధా, కష్టం, ఆపతి వచ్చినపుడు, తీరే దారేదీ లేనపుడు దు:ఖపడుతూ ఏడుస్తాము. ఇది బాధలోంచి వచ్చే ఏడుపు. కడుపులోంచి తన్నుకు వచ్చే ఏడుపు. స్వచ్ఛమైన ఏడుపు. ఇక రెండో రకం ఏడుపు ఉంటుంది. నిజంగా గుండెలోంచి బాధ రాకపోయినా ఏడ్పు వచ్చినట్టు ఏడుస్తూ వుండటం, ఏడ్పును తెచ్చుకుని, ప్రయత్నించి మరీ ఏడుస్తుంటారు. ఎందుకంటే ఏడుపు సన్నివేశంలో వున్నపుడు ఏడుపు రాకపోతే బాగుండదు కనుక ఏడుస్తుంటారు. దీన్ని దొంగ ఏడుపు అంటారు. లేదా ఏడుపు నటించడమూ అంటారు. మన సినిమా వాళ్లు ఏడుపు సీన్లకు బాగా జీవం పోస్తారు. బాగా పండాలంటే వాళ్ళకు సంబంధించిన ఎప్పటిదో, బాధాకర దు:ఖపు సంఘటనను గుర్తు చేసుకుని, ఇప్పటి ఏడుపు సీన్‌ను పండిస్తారు. ఇది వారి నటనా చాతుర్యానికి, అభినయ కౌశల్యానికి మచ్చుతునకలా నిలుస్తాయి. ఇక మూడోది, ఎదుటి వాళ్ళ బాగోగులు ఉన్నతమైన ఎదుగుదలను చూసి ఏడ్చే ఏడుపు. ఇది అసూయతో వచ్చే ఏడుపు. ఇలా ఏడ్చే వాళ్ళను మనం రోజూ చూస్తూనే వుంటాము.
ఇక సన్నివేశంలో సహజమైన నటనను ప్రదర్శించడం వేరు. జీవితమే నటనగా మలుచుకోవడం వేరు. అందుకే షేక్స్పీయర్ జీవితమే ఓ నాటక రంగం అన్నారు. నేటి అధికారపు రాజకీయాలలో అయితే నిత్య నటనలే దర్శనమిస్తాయి. నటనలే రాజకీయమైన నేటి తరుణంలో నాయకుల ఏడ్పులు, కన్నీళ్ళు భలే రక్తి కట్టిస్తాయి. సాధారణ సామాన్య ప్రజలెవరైనా ఆ ఏడుపుల్లోని అసలు ఏడుపును ఇట్టే పసిగట్టేస్తారు. నిన్న మన మహా నాయకుడు కరోనాకాలంలో పోయిన దగ్గరి వాళ్ళను తలచుకుని ఏడ్చేసారు. అదీ ఏదో ఇంట్లో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బంధువుల సమక్షంలో ఏడ్చిన ఏడుపు కాదు. సాక్షాత్తు భారతీయులందరూ వీక్షిస్తున్నపుడు మీడియా మిత్రులు ప్రతి అణువునూ కెమెరాల్లోకి బంధిస్తున్నపుడు మాటలు మాట్లాడలేనంతగా ఏడ్చేసారు. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. దు:ఖాన్ని దిగమింగలేకపోయారు. కన్నీళ్ళు జరజర కారిపోయాయి.
బోడి ఏడుపు అందరికీ అర్థమయిపోయింది. ఏడ్వాల్సింది ఏదీ ఏడ్వక, ఏడ్వలేక ఏడ్చే ఏడుపు అది. ఎందరో ప్రాణాలను ఫణంగా పెట్టిన విధానాల ఫలితంగా ఎదురౌతున్న వ్యతిరేకతకు, తిట్లకు, దూషణలకు, శాపనార్థాలకు, ఏం చేయాలో తెలియక ఏడ్చే ఏడుపు. ఇంత నిర్లక్ష్యం వహించిన మీదట, కనీసం ప్రాణ వాయువును సైతం అందివ్వలేని దీనస్థితికి దేశాన్ని తీసుకువచ్చినందుకు. చివరకు శ్మశానంలోనూ చోటు కోసం క్యూ కట్టాల్సిన దౌర్భాగ్యానికి అసలైన దోషిగా ప్రపంచం ముందు నిలబడాల్సి వచ్చినందుకు ఏడుస్తున్న ఏడుపు. దేశ పవిత్రతను గూర్చి ప్రగల్భాలు పలికే సమూహం, పవిత్ర గంగా నదిలో శవాల ప్రవాహం కొసాగుతోంటే కూడా చలించని నాయకులపై జనం దుమ్మెత్తిపోస్తున్న తీరును చూసి ఏడుస్తున్న ఏడుపు. ఈ ఏడ్పులు పడిపోయిన రేటింగ్‌ను పెంచలేవు. పోయిన నమ్మకాన్ని తెచ్చివ్వలేవు. ఇంకా ప్రజలను భ్రమలలో వుంచలేవు.
నాయకుడు ఎలా వుండాలి! కష్టాలలో, బాధలలో వున్న ప్రజలకు భరోసానిచ్చి ఆదుకోగలగాలి. దు:ఖంలో ఏడ్పుల్లో వున్న సామాన్య ప్రజలను ఓదార్చాలి. విశ్వాసాన్ని ఇవ్వగలగాలి. నేనున్నాననే ధైర్యాన్ని ఇవ్వాలి. ఇవ్వేమీ లేకుండా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక ప్రజల దు:ఖాల కన్నీళ్ళింకి పోయాక, ఏమీ చేయలేని తనంతో ఏడ్వడం ఏడుస్తున్నట్లు నటించడం ఎవరికి ఓదార్పునిస్తుంది! ఏడ్పులతో విపత్తు ఆగిపోతుందా? చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఏడ్చేవాళ్ళ కన్నీళ్ళను తుడవాలి.