Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎవరికి ఎవరు. చివరికి ఎవరు? ముగియని ఈ యాత్రలోన, ముగిసే ఈ జన్మలోన'' అనే రామకృష్ణ పాడిన సినీ గీతం తాత్విక ధోరణిలో వున్నప్పటికీ ఈనాటి కరోనా కాలంలో చివరి వీడ్కోలుకు ఎవరు మిగులుతున్నారనేది ఒక ముఖ్యమైన విషయంగా మారింది. చనిపోవడం అనేది సాధారణమైన విషయమే. 'జాతస్యమరణంద్రువో' అని గీతాచార్యుడున్నట్లుగా ఎప్పుడో ఒకసారి అందరూ పోయేవాళ్లే. కొత్తగా వచ్చేవాళ్ళూ వుంటారు. కానీ పోయేపుడు మానవ సమాజం ఏర్పరుచుకున్న కొన్ని సంబంధాలను, విలువలను, సంప్రదాయాలను సంస్కారాలను కలిగి ఉండిపోతున్నామా అనేది నేటి ప్రశ్న. అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న కూడా.
కాకి చనిపోతే కాకుల గుంపు చుట్టూ మూగుతూ అరుస్తాయి. పక్షయినా, జంతువయినా అంతే. వీటన్నింటికంటే ఎక్కువ బతుకుతూ మాటా మనసూ, ప్రేమా అనుబంధమూ అన్నీ ఏర్పరచుకున్న మనిషి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విడదీయలేని బంధాన్ని కలిగి వుంటాడు. అట్లాంటి మనిషి పోయినపుడు, అలాంటి అనుబంధాలున్న మనుషులు దగ్గరుండి చివరి వీడ్కోలు చెప్పటమనేది ఒక మానవీయ ప్రవర్తన, పరిచర్యా. అయితే నేటి కరోనా కాలంలో మరణించిన వారికి కన్నీళ్ళతో నిండిన బాధాతప్త వీడ్కోలుకు అవకాశం లేకుండా పోవడం అత్యంత విషాదకరమైన విషయం. బతుకున్నంత వరకు తనవాళ్ళ కోసం, తన సమూహం కోసం పరితపించిన, కృషి చేసిన మనిషిని మర్యాదగా చివరికి పంపించడం కనీస ధర్మం.
కానీ అనేక కారణాల రీత్యా ఎవరో ఇద్దరు చివరకు తంతును కానిచ్చేస్తున్నారు. అదీ సాధ్యంకాకనే గంగానదిలో పడేసి పోతున్నారు. దహన, ఖనన సంస్కారాలను చేయలేక పోతున్నామనే బాధ కుటుంబ సభ్యుల్లోనూ వుంటోంది. దగ్గరకి పోలేకపోవటమూ లేదా కుటుంబసభ్యులూ వ్యాధి బాధితులుగానే వుండటమూ మొదలైన అనేక కారణాలు కనపడుతున్నాయి. పది మంది స్నేహితులు కూడా చివరి చూపు కోసం రాలేకపోతున్నారు. దిక్కు మొక్కులేని చావులా అంతిమ తంతు పూర్తవుతూ వుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా తరతమ బేధం మరచి మానవీయమైన మనస్సుతో సేవలందిస్తున్న వాళ్ళూ మనకు కనపడుతున్నారు. మరీ ముఖ్యంగా మా మతం వేరే అనీ, వాళ్ళది వేరే మతమని, మత విద్వేషాలు సృష్టించి మనుషుల మధ్య విభజన, కల్మషాలను పెంచుతున్న తరుణంలో, కుల అహంకార గీతలు గీసుకుని విర్రవీగే వేళ ముస్లిం మతస్తులు, చనిపోయిన హిందువులను హిందూ సాంప్రదాయం ప్రకారమే దహన సంస్కారాలు నిర్వహించడం చూస్తుంటే ఆపద కాలంలో అన్ని బేధాలూ తొలగి మనిషి మాత్రమే, మానవత్వం మాత్రమే మిగులుతుందని తెలుసుకోక తప్పదనిపిస్తున్నది. చాలా ప్రాంతాలలో ముస్లిం సోదరులు ఈ రకమైన సేవా కార్యక్రమాలను చేస్తూ వుండటం చూసయినా మనుషులందరూ ఒకటే అని గ్రహిస్తారని ఆశిస్తున్నాము. అందుకే క్రూరత్వం, కల్మషం, కుత్సితత్వం, కుటిలత్వం అనేవి మత, కుల ప్రాతిపదికన వుండవనేది తెలుసుకోవాలి. అవి ఆయా మనుషులు, బృందాలు చేసే పనులను, ప్రయోజనాలను బట్టి వుంటాయి.
కాబట్టి ఒక మతానికి ప్రతిగా ఇంకో మతాన్ని నిలబెట్టి ఒక కులానికి ఇంకో కులాన్ని నిలబెట్టి పోటీనీ, ద్వేషాన్ని రెచ్చగొట్టేవారి పట్ల జాగ్రత్తగా వుండాలి. అవి కేవలం ఉద్వేగాలను రెచ్చగొట్టి వారి ప్రయోజనాలను నెరవేర్చుకోవటమేననే వాస్తవాన్ని అవగాహన చేసుకోవాలి. 'చివరి యాత్రలో చివరిసారిగా తోడు వుండటమే మానవత. ఆఖరి మజిలి చేరే వేళ ఆప్తుల పలుకే తోడు కదా!