Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇప్పుడు ఇక్కడ బావీలేదు, బావిలోకి తొంగి చూసే పొన్నాయి చెట్టూ లేదు, చెట్టు పక్కన గాబూ లేదు, గాబు పక్కన అంట్లు తోమే పదేళ్ళ పిల్లాడూ లేదు- పొద్దుటి పూట కళ్ళాపి చల్లిన తడి వాకిటి మీద వేల వేల ఇంద్ర ధనస్సులు ఒక్కసారి కదలాడుతున్నట్టు నృత్యం చేసే నెమలీ లేదు!' అని ప్రసిద్ధ కవి శివారెడ్డి గారు లేని వాటిని జ్ఞాపకం చేసుకుంటున్న కవితా పాదాలివి. అవును మన ముందు ఒక్కొక్కరూ ఖాళీ చేసినపోయిన స్థలాలు, జ్ఞాపకాలు, దృశ్యాలుగా మనసుల్లో నిండిపోతున్న సమయాలివి. ఉండుండి కళ్ళెదుటే కదలిపోతూన్న ఉదయాలివి.
యాభై యేళ్ళుగా చూస్తున్న ముఖాలు, చర్చించిన మాటలు నడుస్తూ నడుస్తూ నడవడికలు తెలిపిన గురుతులు, నవ్వులు, నిశబ్ధాలు, ఉద్రేకాలు, కోపాలు, దయార్థ్రతలు, కరుణలు, కర్తవ్యాలు, నిబద్ధతలు, ఆశలు, ఆశయాలు, ఆచరణలు, ఆత్మ విమర్శలు, విమర్శలు, వివరణలు, విశ్లేషణలు, విజయాలు, అపజయాలు, ఆవేశాలు, అలసటలు, ఆనందాలు, సంతోషాలు, దు:ఖాలు, సవాళ్ళు, ప్రశ్నలు, జవాబులు ఎన్ని చూస్తాము. ఒక్కొక్కరి జీవితాలలో, మనలో, ఇవన్నీ జ్ఞాపకాలలో అలల్లా కదులుతుంటాయి. ఇవన్నీ ఇపుడు ఖాళీగా కనపడుతుంటాయి. వాళ్ళు వొదిలిపోయిన భావోద్వేగ, కార్యాచరణలు.
ప్రకృతికి, కాలానికి ఖాళీలేమీ లేవు, ఏదో ఒకటి, ఎవరో ఒకరు స్థలాన్ని, కాలాన్ని పూరిస్తూనే వుంటారు. కానీ పోయినవారితో వున్న బంధము అనుబంధము వున్న మనకు మాత్రమే ఈ ఖాళీలు. కరోనా రెండవ ఉధృతి కారణంగా చాలా మంది మిత్రులు, సహచరులు, స్నేహితులు మన నుండి దూరమై పోయారు. వాళ్ళను తలచుకున్నప్పుడు శివారెడ్డి గారి పద్యం గుర్తొచ్చింది. దశాబ్దాలుగా వారితో వున్న భౌతిక, మానసిక పరిచయాలు మనస్సుల్లో ప్రతిబింబిస్తూనే వున్నాయి. సామాజిక జీవనంలో మనకు మిగిలేవి అనుభవాలు, జ్ఞాపకాలు మాత్రమే. కదిలిపోతున్న వాళ్ళను చూస్తుంటే ఒక రకమైన బాధ ఉన్నప్పటికీ వాళ్ళు పోయింతర్వాత సజీవంగా వున్న జ్ఞాపకాలన్నీ వారి ఆచరణ, ప్రవర్తనలకు సంబంధించినవే కావటం మనందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సంపాదనలు, ఆస్తులు, ఆదాయాలు మొదలైనవేవీ మిత్రుల జ్ఞాపకాల చర్చల్లోకి రాలేదు. నిజాయితీ, నీతి, త్యాగం, వ్యక్తిత్వం సంబంధించిన అంశాలే వాళ్ళ గుర్తులుగా మిగిలి వున్నాయి. ఎప్పటికీ మిగిలిపోయేవి కూడా అవే. తన కోసం తాను ఏమి చేసుకున్నాడు, భార్యాపిల్లలకు, కుటుంబానికి ఏం చేశాడు అనే విషయం కేవలం ఆ ఒక్క కుటుంబానికి సంబంధించినది మాత్రమే. కానీ సమాజానికి ఏం చేశాడనేదే మిగిలిపోయే జ్ఞాపకం.
నిజంగా దేని విలువయినా అది లేనప్పుడే తెలుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ వున్నపుడు విలువను ఇప్పటికీ గుర్తించము. మనకు విలువ అంటే డబ్బుతో కొలిచేదిగా అలవాటయిపోయింది. అసలు డబ్బే విలువను సృష్టిస్తుందని నమ్ముతున్న వాళ్ళము కదా! కానీ వాటికి మించిన మానవ విలువలు వున్నాయని గుర్తించాలి. జీవితాలనే ఫణంగా పెట్టి సమాజం కోసం పని చేసిన వారు, ఆలోచించిన వారు మన కళ్ళ ముందు ఇప్పటికీ వున్నారు. కళ్ళ ముందు నుండి తరలిపోతున్న వాళ్ళూ వున్నారు. వాళ్ళను గుర్తించాలి. వాళ్ళ జీవితాలు మనకందిస్తున్న సందేశమేమిటో పరిశీలించాలి. మహౌన్నత మానవీయ విలువల జ్ఞాపకాలను సమాజం నిండా నింపగలిగితే జీవితాలకు సార్థకత చేకూరుతుంది. జ్ఞాపకమెప్పుడూ ఒక స్ఫూర్తి నింపాలి. జ్ఞాపకాలు రేపటి అడుగులకు ఉత్ప్రేరకాలు. యోధులు, త్యాగధనులు, స్నేహితుల జ్ఞాపకాలు, దారులలో వెలిగే కాంతి రేఖలు.