Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Rain rain go away అని ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కాన్వెంట్లలో నేర్పిస్తున్నారిప్పుడు. అంటే ఓ వర్షమా వెళ్ళిపో వెళ్ళిపో.. అని. మేమయితే చిన్నప్పుడు 'వానా వానా వల్లప్పా' 'వానల్లు కురవాలి వానదేవుడా' అని తెలుగులో పాడేవాళ్ళం. పాశ్చాత్య దేశాల్లో వాతావరణం చల్లగా, నిత్య వర్షాలతో వుంటాయి కాబట్టి, వెళ్ళిపొమ్మని పాడుకున్నారు. మనకు వర్షాలోస్తేనే తిండిగింజలు పండుతాయి. రాకుంటే కన్నీళ్ళు నిండుతాయి. కాబట్టివానలను ఆహ్వానిస్తాము. అందుకనే 'వానమ్మా వానమ్మా నువ్వు ఒక్కసారి వచ్చిపోవే వానమ్మా' అని జయరాజు పాట కట్టి వేడుకున్నాడు.
చిన్న పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం, భాష నేర్పిస్తున్నాం, అదీ ఆంగ్ల భాష నేర్పిస్తున్నాం అని గర్విస్తున్నాం కానీ ఈ దేశానికి సరిపోని, సరిపడని, వాస్తవం కాని, ఒక అపసవ్య సంస్కృతిని అంటగడుతున్నాం అని గ్రహించాలి. చదువులో ప్రాదేశిక , నైసర్గిక, సాంస్కృతిక అంశాలు అంతర్లీనంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ స్థానికతకు, నేటివిటీకి భిన్నమైన బోధతో జీవితాలను మొదలేస్తున్నాం అనేది ఈ విషయం రుజువు చేస్తోంది.
విద్యా విషయాలనలా వుంచితే, ఇది వానాకాలం. వాతావరణమంతా చల్లగా, తేమగా, తడి తడిగా వుండే కాలం. వానలు పడుతుంటే ఆనందించే వాళ్ళు ముఖ్యంగా రైతులు, పిల్లలు. వర్షాలపై ఆధారపడి పంటలు పండించే రైతులకు, వానాకాలంలో సమృద్ధిగా వానలు కురిస్తే పంటనెత్తుకోవచ్చనే ఆనందం వుంటుంది. ఇక పిల్లలకు వర్షంలో తడవటం ఎంతో సరదా. వర్షాకాలంలోనే ఎక్కువగా పగటిపూట ఇంద్రధనస్సులు ఆకాశంలో ఏర్పడి అద్భుత రంగుల కళ ప్రత్యక్షమవుతుంది. పిల్లల హృదయాల నిండా ఆనందం నిండుతుంది. 'వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా, వానతో పాటుగ వణుకొచ్చెనమ్మా, సెట్ల కురుల మీద బొట్లు బొట్లురాలి, గట్ల బండల మీద గంధమయి పారింది. కొట్టాముపై వాలి మట్టంత కడిగింది, కోడిపుంజు జుట్టు కొంటెగ తాకింది, దున్నపోతులనేమో ధుంకులాడించింది, బర్ల మందలనేమో సెరవుల్ల ముంచింది' అని గోరటి వెంకన్న గంతులేసి పాడుకున్నాడు. మన సినిమాలలో కూడా వాన పాటలకు కొదవలేదు. 'చిట చిట చినుకులు పడుతూ వుంటే చెలికాడె సరసన వుంటే, చెట్టా పట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయే ఎంతో వెచ్చగ వుంటుందోయి' అన్న పాట ప్రేమికుల గుండె తడిని తెలుపుతుంది. వర్షంలో వ్యక్తమయ్యే హర్షాతిరేకాలు అనేక విధాలుగా వుంటాయి.
వర్షాకాలంలోనే ఇంటి ముందరలో చిన్న చిన్న పారే కాలువల్లో కాగితం పడవలు వేసి ఆనందించే బాల్యం, రాళ్ళ వాన పడుతుంటే కేరింతలతో ఆ ఐసు ముక్కలను ఏరుకుని నోట్లో వేసుకుని సంతోషాల్లో తడిచి ముద్దయిన బాల్యం తలచుకుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిలో జీవిస్తూ ప్రకృతి అందించిన అన్ని కాలాలను, రుతువులను ఆస్వాదించడంలో వున్న ఆనందాన్ని అనుభూతి చెందడాన్ని నేడు కోల్పోయాం. కృత్రిమ ఆవరణాలను ఏర్పరుచుకుంటున్నాం. ఇప్పుడంతా పొడి వాతావరణమే. హృదయాలూ పొడిపొడిగానే వున్నాయి. 'నా కొరకు చెమ్మగిలు నయనంబు లేదు' అని కృష్ణశాస్త్రి గారు అందుకే వాపోయాడు. పొడిబారుతున్న మనసులు ఆనందాన్నివ్వలేవు. పొందలేవు. అందుకే తడిపే వానను స్వాగతించాలి. మనసుకు తడిగా మలచుకోవాలి.
పర్యావరణ విధ్వంసం వలన వానలు ఉపద్రవాలను తీసుకొస్తున్నాయి. పెద్ద పెద్ద వరదలొచ్చి అనేక నష్టాలకు కారణమవుతోంది. నదులూ, చెరువులు, వాగులు, వంకలు అన్నీ తరిగిపోవటం, నీటిని నిలుపుకునే శక్తిని, నేల కోల్పోవటం వరదలు ముంచెత్తడానికి కారణం. ఇది మానవ విధ్వంస ఫలితం. అందుకనే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. వానా కాలపు ఆనందాలను అందుకోవాలి.